కంపెనీల్లోని టాప్ ఎగ్జిక్యూటివ్ హోదాలో పెరుగుతున్న మహిళల ఆదాయం!

by Disha Desk |
కంపెనీల్లోని టాప్ ఎగ్జిక్యూటివ్ హోదాలో పెరుగుతున్న మహిళల ఆదాయం!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లోని కంపెనీల్లో టాప్ ఎగ్జిక్యూటివ్ హోదాలో ఉన్న మహిళల ఆదాయం ఇటీవల గణనీయంగా మెరుగవుతుందని ఓ నివేదిక వెల్లడించింది. మహిళా ఎగ్జిక్యూటివ్‌లు పురుషులు సంపాదించే ప్రతి రూ. 100కి సగటున రూ. 85 సంపాదిస్తున్నారని నివేదిక తెలిపింది. ఇదే సమయంలో దేశంలోని కంపెనీల్లో టాప్, సీనియర్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యం డైరెక్టర్ల బోర్డులో ఉండవలసిన మహిళల శాతం కంటే చాలా తక్కువగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్(ఐఐఎం-ఏ) నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలోని 200 కంపెనీల నుంచి దాదాపు 4,000 కంటే ఎక్కువ మంది నుంచి అభిప్రాయాలను సేకరించిన తాజా నివేదిక ప్రకారం.. కంపెనీల సీనియర్ మేనేజ్‌మెంట్‌లో మహిళల ప్రాతినిధ్యం కేవలం 7 శాతం మాత్రమే ఉండగా, టాప్ మేనేజ్‌మెంట్ స్థాయిలో 5 శాతం మహిళలు ఉన్నారు. నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో ఉన్న 500 కంపెనీల్లోని ఉన్నత స్థాయిలో ఉన్న మహిళా డైరెక్టర్ల సంఖ్య 2014లో 4.5 శాతం నుంచి 2021 చివరి నాటికి 16 శాతం పెరిగింది. మొత్తం 21 కంపెనీల్లో టాప్ మేనేజ్‌మెంట్‌లో ఒక మహిళ మాత్రమే ఉండగా, 76 శాతం కంపెనీల్లో టాప్ మేనేజ్‌మెంట్ స్థాయిలో ఒక్ మహిళ కూడా లేరని నివేదిక స్పష్టం చేసింది. రంగాల వారీగా చూస్తే వినియోగదారు సేవలు, ఫైనాన్స్, ఫార్మా, ఐటీ రంగాల్లో ఎక్కువమంది మహిళా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. ఇక, మహిళా ఎగ్జిక్యూటివ్‌ల వేతనం సగటున రూ. 1.91 కోట్లు ఉండగా, ఇదే స్థాయిలో ఉండే పురుషులు రూ. 2.24 కోట్లను తీసుకుంటున్నారు.

Advertisement

Next Story