సీఎం కేసీఆర్‌కు రైతులు సహకరించేనా..?

by Nagaya |   ( Updated:2022-03-22 23:30:46.0  )
సీఎం కేసీఆర్‌కు రైతులు సహకరించేనా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యమం తరహాలో వడ్ల కొనుగోళ్ల కోసం ఉధృతంగా ఉద్యమాన్ని నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆ దిశగా మంత్రుల మొదలు గ్రామస్థాయి కార్యకర్త వరకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రం దిగి వచ్చేంత వరకు దీన్ని కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది. ఉగాది పండుగను డెడ్‌లైన్‌గా పెట్టుకున్న పార్టీ ఆ తర్వాతే విస్తృత స్థాయిలో నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు నిర్వహించాలనుకుంటున్నది. కానీ అప్పటికి వరి కోతలు మొదలైతే రైతులు ఏ మేరకు కదులుతారనే చర్చ పార్టీలో జోరుగా సాగుతున్నది. రైతుబంధు సమన్వయ సమితి జిల్లా నాయకులకు నిర్దిష్ట బాధ్యతలు అప్పజెప్పినా రైతుల్ని ఇందులో ఏ మేరకు భాగస్వాములను చేయగలుగుతామనే సందేహాలు మొదలయ్యాయి.

వడ్ల కొనుగోళ్ల విషయంలో తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నదంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నది. రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్ళింది. కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్‌తో సంప్రదింపులు జరుపుతున్నది. ఆశించిన రీతిలో సానుకూల ఫలితాలు రాకపోతే స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగాలనుకుంటున్నారు. మరోవైపు కేంద్రానికి తెలంగాణ రైతుల నిరసన సెగ తగిలేలా కార్యాచరణ ప్రణాళికను కూడా రెడీ చేస్తున్నది టీఆర్ఎస్. రైతుబంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులను కూడా రంగంలోకి దించుతున్నది. దీనికి తోడు రైతులను ఈ ఉద్యమంలో భాగస్వాములను చేయాలనుకుంటున్నది. స్వయంగా రైతులకు ఆ ఫీలింగ్ కలిగేలా ఇంటికి పిడికెడు బియ్యాన్ని కూడా సేకరించాలనుకుంటున్నది.

ఈ ఉద్యమాన్ని సక్సెస్ చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గైడెన్సులో టీఆర్ఎస్ బహుముఖ వ్యూహాన్ని రూపొందించింది. సకల జనుల సమ్మె తరహాలో సకల రైతుల సమాహారంగా నిరసనలు, దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు తదితర పోరాట రూపాలను ఖరారు చేస్తున్నది. మరోవైపు గ్రామ స్థాయి నుంచే సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 26న గ్రామ‌ సభల్లో, 27న మండల పరిషత్‌లలో, 30న జిల్లా ప‌రిష‌త్‌ల‌లో ప్రత్యేకంగా తీర్మానాలు చేయించనున్నది. ఈ నెల 28న యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవం ఉన్నందున అది ముగిసిన తర్వాత నిర్దిష్ట నిరసన కార్యక్రమాన్ని రూపొందించనున్నది. అప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే ఉగాది పండుగ తర్వాత సీరియస్ ఆందోళనలకు ప్లాన్ చేస్తున్నది.

రైతుబంధు సమన్వయ సమితి బాధ్యుల ద్వారా అన్ని గ్రామాల్లోని రైతులను కదిలించి రోడ్డెక్కించాలనుకుంటున్నది. అయితే ఏ మేరకు రైతులు ఇందులో కలిసి వస్తారనే చర్చ పార్టీ, రైతుబంధు సమితి వర్గాల్లో జరుగుతున్నది. వరి కోతలు ప్రారంభమవుతున్నందున రైతులు ఆశించిన సంఖ్యలో రావడం సాధ్యమేనా? వానాకాలం పనులను మానుకుని రాగలుగుతారా? యాసంగిలో వరి పంట వేయవద్దని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పడంతో సాగుకు దూరంగా ఉన్న రైతులు ఇప్పుడు నిరసనలు, ఆందోళనల్లో కలిసి వస్తారా? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్నాయి. రైతుల్ని తప్పనిసరిగా భాగస్వాములను చేయాలని సీఎం కేసీఆర్ నొక్కిచెప్పినందువల్ల దాన్ని సక్సెస్ చేయడం క్షేత్రస్థాయిలో సవాలుగా మారింది.

చాలా జిల్లా కమిటీలకు ఎమ్మెల్యేలను చైర్మన్లుగా కేసీఆర్ నియమించినా పార్టీ ఇచ్చే పిలుపులు విజయవంతం చేయడంలో మంత్రులు యాక్టివ్ రోల్ పోషించాలని ముఖ్యమంత్రి ఇటీవల క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు వడ్ల కొనుగోళ్ళ విషయంలోనూ గ్రామాల్లో నిరసనలు ఉధృతంగా జరగడానికి మంత్రులే ఎక్కువ చొరవ తీసుకుంటున్నారు. తెలంగాణ భవన్‌లో సీఎం ఈ విషయాన్ని ప్రకటించడంతోనే మంత్రులు వారివారి జిల్లాల్లో సన్నాహక సమావేశాలను నిర్వహించడం మొదలుపెట్టారు. అందుబాటులో ఉన్న సీనియర్ లీడర్లు, ఎమ్మెల్యేలు, మేయర్లు, కార్పొరేషన్ల ,చైర్‌పర్సన్లతో మీటింగులను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉగాది పండుగ తర్వాత మొదలయ్యే ఉద్యమంలో వీలైనంత ఎక్కువ మందిని సమీకరించడానికి వీలుగా ప్రిపరేటరీ మీటింగులు జరుగుతున్నాయి.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు తదితరులతో వడ్ల కొనుగోలు ఉద్యమానికి సిద్ధం కావడానికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు, సన్నద్ధతపై చర్చించారు. రైతులకు మద్దతుగా పార్టీ శ్రేణులు ఎలాగూ వస్తాయి కాబట్టి రైతుల్ని కూడా భాగస్వాములను చేయడంపై ప్రత్యేకంగా నొక్కిచెప్పారు. పంటల సీజన్‌లో రైతుల బిజీ పనులను దృష్టిలో పెట్టుకుని వారిని ఉద్యమంలోకి కదిలించేలా ఆచరణాత్మకమైన పోరాట రూపాలను ఎందుకోవడంపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోళ్ల ఉద్యమాన్ని ఏ స్థాయిలో టీఆర్ఎస్ నిర్వహించేదానిపై ఉగాది తర్వాతనే క్లారిటీ రానున్నది.

Advertisement

Next Story

Most Viewed