ముగ్గురు విద్యార్థులను బలితీసుకున్న చెరువు.. శోకసంద్రంలో కుటుంబాలు

by Javid Pasha |
ముగ్గురు విద్యార్థులను బలితీసుకున్న చెరువు.. శోకసంద్రంలో కుటుంబాలు
X

దిశ, వనపర్తి: సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వనపర్తి పట్టణం వల్లబ్ నగర్, బండార్ నగర్ ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు మంగళవారం సాయంత్రం పట్టణ పానగల్ రోడ్డు సమీపంలో ఉన్న ఈదుల చెరువులో ఈత కొట్టడానికి వెళ్లారు. సాయంత్రం వరకు సరదాగా ఈత కొడుతూ ఉండగా భరత్, ఎండి అస్మత్, ఎండి మున్న అనే విద్యార్థులు చెరువులో కాసింత లోతుగా ఉన్న ప్రదేశానికి వెళ్లి నీటిలో మునిగిపోయారు. భారత్‌కు ఈత వచ్చినప్పటికీ నీటిలో మునిగి పోతున్న స్నేహితులను కాపాడే క్రమంలో ముగ్గురు మునిగిపోవడంతో మిగతా స్నేహితులు భయంతో ఇళ్లకు వెళ్లారు.

రాత్రి అయిన తమ పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. ఒక క్రమంలో ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగి పోయిన విషయం వెలుగు చూసింది. విషయాన్ని పోలీస్, మత్స్యశాఖ, ఫైర్ స్టేషన్‌ సిబ్బందికి తెలియజేశారు. రాత్రి నుండే గల్లంతైన వారిని వెలికి తీసే పనులు చేపట్టారు. అర్ధరాత్రి వరకు రెండు మృతదేహాలు, బుధవారం ఉదయం మరో మృతదేహాన్ని వెలికి తీశారు. తమ పిల్లల మృతదేహాలు బయట పడగానే తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగి పోయారు. ఈ మేరకు వనపర్తి సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Advertisement

Next Story