2014లో కాస్మెటిక్ట్స్ పరీక్షలపై నిషేధం విధించిన భారత్..

by Manoj |
2014లో కాస్మెటిక్ట్స్ పరీక్షలపై నిషేధం విధించిన భారత్..
X

దిశ, ఫీచర్స్ : మనుషులు తమ సౌకర్యం కోసం తోటి జీవాలను హింసించేందుకు వెనకాడరన్నది నిర్వివాదాంశం. నిజానికి మనం వాడే బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీ కోసం ఎన్నో జీవులను వధిస్తుండటంతో వందలాది జాతులు అంతరించిపోతున్నాయి. కేవలం కాస్మెటిక్స్‌లోని సువాసన కోసమే వందలాది 'కస్తూరి జింక'లను చంపేస్తున్నారంటేనే ఈ జంతు బలి క్రూరత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. రసాయన సమ్మేళనాలతో కూడిన ఈ సౌందర్య సాధనాలు మనిషి చర్మంపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయనే కోణంలో జరిగే పరిశోధనలకు బలయ్యేది కూడా జంతువులే. ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ వీటికి అద్భుతమైన ప్రత్యామ్నాయాలు తీసుకొచ్చినా హింస మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో భారత జంతు సంరక్షణ సంస్థ ఫెడరేషన్ (FIAPO) సీఈవో భారతి రామచంద్రన్, జంతు హక్కుల సంఘంలో సీనియర్ కంటెంట్ స్పెషలిస్ట్ ఉపాసన సర్రాజు.. కాస్మెటిక్స్ ఇండస్ట్రీ ద్వారా జీవుల నష్టం, హింసపై కొన్ని అభిప్రాయాలు పంచుకున్నారు.

మనుషుల అందాన్ని పెంచేందుకు ఉపయోగించే ప్రతీ కాస్మెటిక్ ఉత్పత్తి పనితీరును జంతువుల చర్మంపై పూయడం, కళ్లలోకి చుక్కల రూపంలో వేయడం లేదా ఆయా జీవుల్లోకి బలవంతంగా ఇంజెక్ట్ చేయడం ద్వారా అంచనా వేస్తుంటారు. ఇక్కడ జంతువును ప్రాణిగా పరిగణించకుండా దాన్ని ఒక టెస్ట్ సబ్జెక్ట్‌గా చేసుకొని ప్రయోగాలతో హింసిస్తున్నారు. ఉదాహరణకు మగ కస్తూరి జింక పొత్తికడుపు, జననాంగాల మధ్య వాల్‌నట్-పరిమాణంలో ఉండే కస్తూరి గ్రంథి ఎంతో మంచి సువాసన అందిస్తుంది. సుగంధ ఉత్పత్తుల తయారీకి ఒక కిలో కస్తూరి సారాన్ని సేకరించేందుకు 160 కస్తూరి జింకలను చంపేస్తున్నారు. దీంతో ప్రస్తుతం కస్తూరి జింకలు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే 'బిజ్జూ' అనే మరొక జీవి శరీరంపై కొట్టినప్పుడు దాని శరీరంపై గాయాలైన చోట చర్మాన్ని పూడ్చుకునేందుకు ఒక మృదువైన పదార్థాన్ని స్రవిస్తుంది. ఆ పదార్థాన్ని పోగుచేసి, దాన్ని సెంట్ల తయారీలో ఉపయోగిస్తున్నారు.

లిప్‌స్టిక్, టాల్కం పౌడర్, హెయిర్ డై తదితర ఉత్పత్తులను కోతులపై ప్రయోగించి చూడటమే కాకుండా ఆయా పదార్థాలను కోతులతో తినిపిస్తారు. ఎంత మోతాదులో తినిపిస్తే ప్రాణాంతకమో కూడా టెస్ట్ చేస్తారు. అంతేకాదు కోతులు ఎందుకు చావలేదో పరిశీలించి చూస్తారు. కొన్ని రకాల సౌందర్య సాధనాలను కుందేళ్ల కళ్లలో వేసి పరీక్షిస్తారు. ఈ ప్రయోగాలతో అవి చూపును కోల్పోతాయి. ఇవే కాదు బాబూన్స్, గినియా పందులు, ఎలుకలు, గుర్రాలు, కప్పలు, గొర్రెలు, పందులు, ఆవులు, గుడ్లగూబలు వంటి వైవిధ్యమైన జాతులు మన సౌందర్య అవసరాలను తీర్చేందుకు అనవసరంగా బలవుతున్నాయి. ఏదేమైనా సౌందర్య సాధనాలు, అలంకరణ సామగ్రిని రూపొందించుకునే క్రమంలో 130 జాతులకు చెందిన జంతువులు సమూలంగా అంతరించిపోగా.. మరో 240 జాతులు కనుమరుగైపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి.

చరిత్రాత్మకం :

ప్రస్తుత టెక్ యుగంలో శాస్త్రీయ విజ్ఞానం అద్భుతమైన ప్రత్యామ్నాయాలను కల్పించింది. అయినప్పటికీ కాస్మెటిక్ ప్రయోజనాల కోసం జంతువులను ల్యాబ్స్‌లో పెంచడం, వాటికి హాని చేయడం వంటి పద్ధతులను ఎందుకు అవలంబిస్తున్నారని జంతు సంరక్షణ కార్యకర్తలు చాలా ఏళ్లుగా ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రశ్న. ఈ క్రమంలోనే జంతు పరీక్షలను ముగించే చట్టం కోసం హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ (HSI), పీపుల్ ఫర్ యానిమల్స్ (PFA), పెటా-ఇండియా వంటి సంస్థలు ఉద్యమించాయి. దీంతో 2014లో భారత ప్రభుత్వం డ్రగ్ టెక్నికల్ అడ్వయిజరీ బోర్డ్.. అన్ని జంతు సౌందర్య సాధనాల పరీక్షలను, కొన్ని నెలల తర్వాత జంతు పరీక్షలతో సంబంధమున్న కాస్మెటిక్ ఉత్పత్తుల దిగుమతిని నిషేధించింది. ఆ విధంగా దశాబ్దాలుగా ప్రపంచ సౌందర్య పరిశ్రమకు పునాదిగా ఉన్న జంతు బలి, జంతువుల బాధలను చట్టబద్ధంగా ఖండించిన మొదటి దక్షిణాసియా దేశంగా భారతదేశం అవతరించింది.

తప్పుదారి:

నిజానికి ఈ చట్టాలను బాధ్యతాయుతంగా పాటించాలి. కానీ ప్రసిద్ధ అంతర్జాతీయ బ్యూటీ బ్రాండ్స్ 'క్రూరత్వం లేని' ప్రొడక్ట్‌గా చెప్పుకోవడం ద్వారా వినియోగదారులను తప్పుదారి పట్టించగలవు. ఉదాహరణకు : ఫేషియల్ క్రీమ్ దాని ప్యాకేజింగ్‌పై క్రూరత్వం లేని లేబుల్‌ను కలిగి ఉండవచ్చు. ఎందుకంటే ఇండివిడ్యువల్ ఇన్‌గ్రీడియెంట్స్ ఉన్నప్పటికీ ఫైనల్ ప్రొడక్ట్ జంతువులపై పరీక్షించలేదు. దీంతో ఈ ఫేషియల్ క్రీమ్‌ను ఒక బాధ్యతాయుతమైన, నైతికమైన ఎంపికగా భావించి కొనుగోలు చేస్తాం. కానీ ఇక్కడ జంతువుల బాధ అనేది ఉత్పత్తి ఉనికిలో అంతర్భాగమైందనే వాస్తవాన్ని పట్టించుకోం. ఈ అనైతిక వ్యూహాన్ని తరచుగా 'బన్నీ-వాషింగ్' అని పిలుస్తారు. కాస్మెటిక్ పరిశ్రమకు సంబంధించి ప్రపంచంలోని టాప్ 50 బ్యూటీ బ్రాండ్స్‌లో 88% వరకు జంతు పరీక్షలు చేస్తూ క్రూయల్టీని కలిగిస్తున్నాయి.

2020 నాటికి భారతదేశంలో సౌందర్య సాధనాల్లో 'క్రూరత్వం లేని', 'శాకాహారి', 'నైతిక' వంటి లేబుల్స్ వినియోగానికి ఎలాంటి ప్రమాణాలు లేవు. PETA వంటి కొన్ని జంతు సంక్షేమ సంస్థలు ఆయా ప్రొడక్ట్స్ తయారీ ప్రక్రియను పరిశోధించిన తర్వాత కాస్మెటిక్ ఉత్పత్తులను ధృవీకరించాయి. 'Zoobop', 'లీపింగ్ బన్నీ ప్రోగ్రామ్' వంటి ఇతర ప్లాట్‌ఫామ్స్ కూడా వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్స్ ఎంత నైతికమైనవి, పర్యావరణానికి అనుకూలమైనవేనా కాదా? అని ధృవీకరిస్తున్నాయి. ఈ మేరకు మనం ఎంపిక చేసుకునే సౌందర్య సాధనాలు క్రూరత్వానికి మద్దతు ఇవ్వడం లేదా ప్రోత్సహించడం లేదా డిమాండ్‌ను పెంచడం లేదని నిర్ధారించుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత.



Advertisement

Next Story

Most Viewed