- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇప్పటికీ అక్కడ నీటిని 'పాలు' అని పిలుస్తారు.. ఎందుకంటే..?
దిశ, శంకరపట్నం: పాలు పాలే... నీరు నీరే... అన్న నానుడి ఎక్కడైనా వినిపిస్తుంది కానీ ఇక్కడ నీటినే పాలుగా పిలుస్తుంటారు. నిజాం కాలం నుండి నేటివరకు ఆ నీటిని 'దూద్' అనే పిలుస్తున్నారంటే వాటి స్పెషాలిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పాలు ఎలా అయితే ఆరోగ్యాన్ని పంచుతాయో ఈ నీరు కూడా అంతే ఆరోగ్యాన్ని పంచుతున్నాయని దూద్ గా పేరు మార్చేశారు. శతాబ్ధాల క్రితం నిర్మించిన ఈ బావి లక్షలాది మంది దాహార్తిని తీర్చడమే కాదు... ఆరోగ్యాన్ని అందిస్తోంది. దేశంలో అత్యంత అరుదైన బావుల్లో ఒకటైన 'దూద్ బౌళి' కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరులో ఉంది.
నేపథ్యం ఇదీ...
శంకరపట్నం మండలం మొలంగూర్ ఖిల్లాపై ఏడు కోనేర్లు ఉన్నాయి. ఈ ఖిల్లా కింది భాగంలో రాతితో నిర్మాణం చేపట్టిన బావిని నిర్మించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ బావిని దూద్ బౌళి అని పిలుస్తుంటారు. హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన నిజాం ప్రభువు గుర్రాలపై మొలంగూర్ దూద్ బావి నీళ్లు తీసుకెళ్లే తాగేవారు. మొలంగూర్ ఖిల్లా కేంద్రంగా కాకతీయులు పరిపాలన చేస్తున్న సమయంలో ఈ బావిని తవ్వించినట్టుగా చరిత్ర చెబుతోంది. జైనులు, శాతవాహనులు, కాకతీయులు, మొఘలులు, నిజాం పాలకులకు ఎంత చరిత్ర ఉందో ఈ దూద్ బావికి కూడా అంతే చరిత్ర ఉందంటే దీని స్పెషాలిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. దూద్ బావి నీళ్లు తాగితే అనారోగ్యం దూరం అవుతుందని, ఈ ప్రాంత వాసులకు ప్రగాడ నమ్మకం. ఈ విషయం తెలుసుకున్న నిజాం ప్రభువు కూడా దూద్ బావి నీటిని హైదరాబాద్ కు తెప్పించుకునేందుకు ప్రత్యేకంగా సైన్యాన్నే నియమించుకున్నారు. ఇప్పటికీ శంకరపట్నంతోపాటు చుట్టు పక్కల మండలాలు వాసులు దూద్ బావి నీరు తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా మొలంగూర్ కు వస్తుంటారు. చరిత్ర పరిశోధకులు కూడా దూద్ బావి ప్రత్యేకతల గురించి రిసెర్చ్ చేశారు. గ్రామ సర్పంచ్ మోరే అనూష శ్రీనివాస్, పంచాయితీ పాలకవర్గ సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకుని, గుట్ట కింది భాగం నుండి పై భాగం వరకు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. తెలంగాణా రాష్ట్రానికే వన్నె తెచ్చే ఈ దూద్ బావితోపాటు మొలంగూర్ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. ఇటీవల కేంద్ర పర్యాటక పురావస్తు శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో, ట్రెక్కింగ్ నిర్వహించి, కేంద్రానికి నివేదికలు అందజేశారు.
45 ఏళ్ల నుండి తాగుతున్న: కచ్చు భూమయ్య, బూడిది పల్లి, సైదాపూర్ మండలం
45 ఏళ్లుగా ఈ దూద్ బావి నీటిని తాగుతున్నాను. ఔషధంలా పనిచేస్తున్న ఈ నీటిని తాగుతుండడం వల్ల ఇప్పటికీ నాకు కీళ్ల నొప్పులు రాలేదు. చిన్నప్పడు సైకిల్ మీద వచ్చి తీసుకెళ్లేవాడిని, ఇప్పుడు బైక్ పై రెండు రోజులకోసారి వచ్చి తీసుకెళ్తున్నాను. హైదరాబాద్ లో ఉన్న నా కొడుకుల వద్దకు వెళ్లినా నేను దూద్ బావి నీటిని వెంట తీసుకెళ్తాను. కొడుకులు కూడా ఇంటికి వచ్చినప్పుడల్లా ప్రత్యేకంగా దూద్ బావి వద్దకు వెళ్లి నీటిని తీసుకుని వెళ్తుంటారు.
పర్యాటక కేంద్రం చేయాలి: దండు స్వరూప సమ్మయ్య, వార్డు మెంబర్, మొలంగూర్
తెలంగాణాకే తలమానికంగా ఉన్న మొలంగూర్ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. కాకతీయుల కాలం నాటి నుండి నేటివరకు గ్రామానికో చరిత్ర ఉంది. ఆరోగ్యాన్ని పంచే దూద్ బావి గురించి ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. చరిత్ర పుటల్లో ఘనకీర్తిని చాటుకున్న దూద్ బావి గురించి భావితరాలకు చెప్పాల్సిన అవసరం ఉంది.