కేటీఆర్ బర్త్ డే వేడుకలకు రాలేదని అధికారులకు షోకాజ్ నోటీసులు!

by Nagaya |
కేటీఆర్ బర్త్ డే వేడుకలకు రాలేదని అధికారులకు షోకాజ్ నోటీసులు!
X

దిశ, వెబ్‌డెస్క్ : స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా కొంత మంది అధికారుల తీరు తెలంగాణ రాష్ట్రంలో వివాదాస్పదం అవుతోంది. మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలకు హాజరు కాలేదని ముగ్గురు సిబ్బందికి మెమోలు జారీ చేయడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ప్రభుభక్తిని చాటుకునేందుకు ఉన్నతాధికారుల ఓవర్ యాక్షన్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జులై 24న మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 46వ పుట్టిన రోజు. అయితే రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ యేడాది తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని మంత్రి కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు అంతకు ముందు రోజే కేటీఆర్ కాలు ఫ్రాక్చర్ కావడంతో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. తన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఇతరులకు సాయం చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చినా.. మంత్రి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఏర్పాటు చేసుకున్నారు. వీళ్లంతా రాజకీయ నాయకులు కాబట్టి పర్వాలేదు అనిపించినా కొన్ని శాఖల్లో అధికారులు మాత్రం మంత్రి బర్త్ డేను సర్కార్ ప్రోగ్రాంగా నిర్వహించాలని నిర్ణయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది.

ఈ క్రమంలో ఓ అడుగు ముందుకు వేసిన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ కేటీఆర్ బర్త్ డే వేడుకలకు రాలేదని ముగ్గురు అధికారులకు ఏకంగా మెమోలు జారీ చేయడం వివాదాస్పదం అవుతోంది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 24న కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు కమినషనర్ అంతకు ముందు వాట్సాప్ ద్వారా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రకటించినట్లుగానే బర్త్ డే రోజు ఆసుపత్రి ఆవరణంలో హరితహారం కార్యక్రమంతో పాటు కేక్ కటింగ్ చేశారు. అయితే ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్ హాజరైనా మీరెందుకు హాజరు కాలేదంటూ సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వరీ, జూనియర్ అసిస్టెంట్ పున్నం చందర్, సిస్టం మేనేజర్ మోహన్‌కు మున్సిపల్ కమిషనర్ మంగళవారం షోకాజ్ నోటీసులు ఇచ్చారు. 24 గంటల్లో సంజాయిషీ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశం అయింది.

ఇదిలా ఉంటే నోటీసులు అందుకున్న వారిలో జూనియర్ అసిస్టెంట్లు, దివ్యాంగులు ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి బర్త్ డే వేడుకలను సర్కార్ ప్రోగ్రామ్ లా నిర్వహించడమే కాకుండా హాజరు కానందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ఇలా మంత్రుల పుట్టిన రోజులు నిర్వహించడమే కాకుండా హాజరు కాని అధికారులకు షోకాజ్ నోటీసులు ఇస్తారా? అని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story