చేతులెత్తేసిన పోలీసులు.. మంత్రి హత్య ప్లాన్‌లో అందరిదీ ఒక్కటే జవాబు

by GSrikanth |   ( Updated:2022-03-13 05:59:01.0  )
చేతులెత్తేసిన పోలీసులు.. మంత్రి హత్య ప్లాన్‌లో అందరిదీ ఒక్కటే జవాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మంత్రి శ్రీనివాస్​గౌడ్​హత్య కుట్ర కేసులో పోలీసులు చేతులెత్తేశారు. ఈ హత్య కుట్రపై చాలా ప్రచారాలు, అనుమానాలు ఉన్నప్పటికీ.. నిందితులను కస్టడీకి అప్పగించడంతో ఏమైనా వివరాలు వస్తాయని భావించారు. కానీ, ప్లాన్‌పై ఇప్పుడు సర్వత్రా అనుమానాలు మొదలయ్యాయి. అసలు హత్య కుట్ర ఉందా.. లేక ఉద్దేశపూర్వకంగా ప్లాన్​చేశారా.. అనేది ఇప్పుడు పోలీసులు తేల్చాల్సిన ప్రశ్న.

పోలీస్​.. ఫెయిల్యూర్

నిందితులను విచారించాలని సైబరాబాద్​పోలీసులు మేడ్చల్​కోర్టులో పిటిషన్​వేశారు. మంత్రి శ్రీనివాస్​గౌడ్‌ను ఎందుకు చంపాలనుకుంటున్నారు, ఆయుధాలు ఎక్కడి నుంచి తెచ్చారు, సుపారి ఒప్పందం చేసుకున్న రూ.15 కోట్లు ఎలా సమకూర్చుకుంటారు, ఎవరి నుంచి సహకారం తీసుకున్నారు, రాజకీయ కోణం ఏదైనా ఉందా అనే వివరాలు తెలుసుకునేందుకు నిందితుల కస్టడీ కోరారు. దీనిపై మేడ్చల్​ కోర్టుకు నివేదించారు. ఈ నేపథ్యంలో రెండు రోజులు విచారించిన మేడ్చల్​కోర్టు.. ఎట్టకేలకు నాలుగు రోజుల కస్టడీకి అప్పగించింది. విచారణ మొత్తం వీడియో రికార్డింగ్‌లో ఉండాలని, నిందితులను పోలీసుల అదుపులో ఉంచుకోవడం కుదరదని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని షరతులు పెట్టి అప్పగించారు. ఈ నెల 13 వరకు (ఆదివారం సాయంత్రం) వరకు నిందితుల కస్టడీ అనుమతి ఉంది.

అంతా కట్టుకథ

కానీ, పోలీసులు చేతులెత్తేశారు. అక్షరాలా విఫలమయ్యారు. మూడు రోజుల పాటు విచారించిన పోలీసులకు.. ఏడుగురు నిందితుల నుంచి ఒకే సమాధానం పదేపదే రావడం, అటు మొత్తం విచారణను వీడియో రికార్డింగ్‌తో చేయడం, సాయంత్రం తర్వాత తమ అదుపులో లేకపోవడంతో పోలీసులు వారి నుంచి ఒక్క మాట కూడా చెప్పించలేకపోయారు. "మంత్రి శ్రీనివాస్​గౌడ్​తమను ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులు పెట్టాడని, పూర్తిగా అణిచివేశాడని, ఆయన కారణంగా వ్యాపారాలు దెబ్బతినిపోయాయనే వివరాలను మాత్రం పోలీసులకు చెప్పారు. అంతేకానీ, తాము హత్యకు సుఫారీ ఇవ్వలేదని, రూ.15 కోట్లు ఇచ్చేంత ఆర్థిక స్థోమత కూడా తమ దగ్గర లేదని, ఇది మొత్తం ఒక కట్టుకథ అనే తీరుతో నిందితులు పోలీసుల ఎదుట తెలిపారు. పదేపదే ఒకే సమాధానం చెప్పడంతో పోలీసులు ఇక విచారించేది ఏమీ లేదని నిర్ధారణకు వచ్చారు. దీంతో వారిని కస్టడీ సమయం ఒక్క రోజు మిగిలి ఉండగానే.. శనివారం సాయంత్రం మేడ్చల్​ కోర్టుకు అప్పగించారు. తమకు ఇంకా గడువు అవసరం లేదని కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా నిందితుల విచారణ నివేదిక, వీడియో రికార్డింగ్‌లను కోర్టుకు సమర్పించారు. పోలీసుల నివేదికతో మేడ్చల్​కోర్టు ఏడుగురు నిందితుల కస్టడీని ముగించింది.

అనుమానాలు.. ఆరోపణలు

మంత్రి హత్య కుట్రలో ముందు నుంచీ అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పోలీసుల తీరుతో అవన్నీ మరింత బలపడుతున్నాయి. రిమాండ్​రిపోర్టులోనే చాలా తప్పులు దొర్లాయి. మంత్రి పేరునే మార్చగా.. తుపాకులు ఎక్కడ దొరికాయో కూడా క్లారిటీ లేదు. అంతేకాకుండా నిందితుల్లో నలుగురిని సుచిత్ర దగ్గర అరెస్ట్​చేశామని పోలీసులు చెప్పితే.. కుటుంబ సభ్యులు మాత్రం ఇంటి నుంచి ఎత్తుకొచ్చారంటూ విమర్శించారు. పోలీసులు వెల్లడించిన తేదీలు కూడా ఎక్కడా పొంతన లేకుండా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి హత్య కుట్ర అంతా ప్లాన్ అనే ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పుడు పోలీసులు కూడా ఏం చెప్పాలో తెలియక.. నిందితులను ఈ హత్య కుట్రలో ఒప్పించలేక చేతులెత్తేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముందు నుంచీ వస్తున్న ఆరోపణలు, అనుమానాలను పోలీసులే నిజం చేస్తున్నారనే చర్చ కూడా సాగుతోంది. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారో.. అనేదే ముందున్న సవాల్.

Advertisement

Next Story

Most Viewed