Trump : అమెరికాలోని అక్రమ వలసదారులపై ట్రంప్ కీలక ప్రకటన

by Hajipasha |
Trump : అమెరికాలోని అక్రమ వలసదారులపై ట్రంప్ కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా సరిహద్దుల భద్రతపై తన అభిప్రాయాన్ని కాబోయే దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేశారు. ‘‘సరిహద్దు భద్రతపై జాతీయ అత్యవసర స్థితి(national emergency)ని ప్రకటించేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారు’’ అని పేర్కొంటూ ఓ వ్యక్తి ట్రంప్ సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’‌లో పోస్ట్ చేశాడు. ‘‘బైడెన్ హయాంలో సరిహద్దులు దాటి అక్రమంగా అమెరికాలోకి చొరబడిన అక్రమార్కులను సాగనంపుతారు. ఇందుకోసం అవసరమైతే సైన్యం సాయం తీసుకుంటారు’’ అని సదరు వ్యక్తి తన పోస్టులో చెప్పుకొచ్చాడు. దీన్ని రీపోస్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్.. ‘ట్రూ’ అని కామెంట్ పెట్టారు.

అమెరికా సరిహద్దుల భద్రత, విదేశీ వలసలకు సంబంధించిన వ్యవహారాలను చూసే కీలకమైన ‘బార్డర్ జార్’ పదవిని టామ్ హోమన్‌కు ట్రంప్ కేటాయించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో టామ్ హోమన్ మాట్లాడుతూ.. ‘‘బైడెన్ నిర్లక్ష్యం వల్ల అమెరికాలోకి చొరబడి అక్రమంగా ఉంటున్న వాళ్లంతా తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధం కావాలి. ఇప్పుడే లగేజీ సర్దుకోవడం మొదలుపెడితే బెటర్’’ అని కామెంట్ చేశారు. ఇటువంటి అభిప్రాయం కలిగిన వ్యక్తికి బార్డర్ జార్ పదవిని ట్రంప్ కట్టబెట్టారు. సరిహద్దు భద్రత, వీసాల జారీ విషయంలో ట్రంప్ సర్కారు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోబోతోంది అనేందుకు క్యాబినెట్ కూర్పు ప్రధానమైన సంకేతమని పరిశీలకులు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed