అమెరికాలో లైంగిక వేధింపు కేసులు ఇక‌పై నేరుగా కోర్టుల‌కే..!

by Nagaya |   ( Updated:2022-03-04 15:09:11.0  )
అమెరికాలో లైంగిక వేధింపు కేసులు ఇక‌పై నేరుగా కోర్టుల‌కే..!
X

దిశ‌, వెబ్‌డెస్క్: ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంత నాగ‌రిక‌త అభివృద్ధిచెందినా, ఎన్ని ఉన్న‌త చ‌దువులు, ఎంత‌ సాంకేతిక జ్ఞానం మ‌నిషిని విజ్ఞానంవైపు న‌డుపుతున్నా స్త్రీల‌పై లైంగిక హింసమాత్రం పెరుగుతూనే ఉంది. అందులోనూ వృత్తి, ఉద్యోగాలు చేసుకునే మ‌హిళ‌ల‌పైనా ఈ ప్ర‌భావం ఇంకాస్త ఎక్కువ‌గానే ఉంటుంది. కార్యాల‌యాల్లో ఏవైనా వేధింపులు జ‌రిగితే వాటిని బ‌య‌ట‌కు పొక్క‌నీయ‌కుండా బ‌ల‌వంతంగానైనా యాజ‌మాన్యం ఛాంబ‌ర్‌లోనే రాజీ కుద‌ర్చ‌డం స‌ర్వ‌సామాన్య మ‌య్యింది. ఇక‌పై అమెరికాలో ఇలాంటి బ‌ల‌వంత‌పు రాజీల‌కు కాలం చెల్లింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ దేశంలో ఓ కీల‌క చ‌ట్టంపై సంత‌కం చేశారు.

"ఎండింగ్ ఫోర్స్డ్‌ ఆర్బ్రిట్రేష‌న్ ఆఫ్ సెక్సువ‌ల్ అసాల్ట్ అండ్ సెక్సువ‌ల్ హెరాస్మెంట్ యాక్ట్‌-2021 (లైంగిక హింస‌, లైంగిక వేధింపుల్లో బలవంతపు మధ్యవర్తిత్వానికి ముగింపు, చ‌ట్టం-2021)" తీసుకొచ్చారు. ఈ చ‌ట్టంతో అమెరికా ఆఫీసుల్లో లైంగిక వేధింపులకు గుర‌వుతున్న లక్షలాది మ‌హిళ‌లు న్యాయం కోసం రహస్య మధ్యవర్తిత్వ ప్రక్రియ‌ల‌ ద్వారా కాకుండా నేరుగా కోర్టులను ఆశ్రయించే హక్కును ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కూ అమెరికాలో లైంగిక వేధింపుల‌పై మ‌ధ్య‌వ‌ర్త్విత్వాలే ఎక్కువ‌గా కొన‌సాగేవి, అధికారులు, యాజ‌మాన్యం మాట విన‌క‌పోతే ఉద్యోగం ఊడిపోతుంద‌నే భ‌యం కూడా ఉండేది. ఇలాంటి ప‌రిస్థితుల్లో `బలవంతపు మధ్యవర్తిత్వ ముగింపు చట్టం`పై బైడెన్ సంతకం చేయ‌డంతో ఆ దేశంలో మ‌హిళ‌ల‌కు ఇంకాస్త‌ ర‌క్ష‌ణ‌తో పాటు, వారి ఉద్యోగాల‌కు కూడా మ‌రింత భ‌ద్ర‌త‌ను ఇచ్చిన‌ట్ల‌య్యింది. దీనిపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.

అమెరికాలో దాదాపు 60 మిలియన్ల మంది కార్మికులు బలవంతపు మధ్యవర్తిత్వ నిబంధనలకు కట్టుబడి ఉన్నారని నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఐదు సంవత్సరాల క్రితం, సెనేట్‌లో ఉన్న కాలంలో, ఈ బిల్లుకు రూప‌క‌ల్ప‌న చేశారు. అది చ‌ట్టంగా కావ‌డానికి ఇన్నేళ్లు ప‌ట్టింది.



Advertisement

Next Story

Most Viewed