చిత్రా రామకృష్ణ నివాసంలో ఆదాయ పన్ను శాఖ సోదాలు!

by Web Desk |
చిత్రా రామకృష్ణ నివాసంలో ఆదాయ పన్ను శాఖ సోదాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణ కు సంబంధించిన నివాసంలో ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ గురువారం దాడులు నిర్వహించింది. ఆమె ఓ హిమాలయ యోగి తో ఎన్ఎస్ఈ కి సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని, వివరాలను అందజేశారనే ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ ఈ సోదాలు నిర్వహించింది.

ఆమెతో పాటు ఆ సమయంలో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా ఉన ఆనంద్ సుబ్రమణియన్ నివాసంలో కూడా ఐటీ సోదాలు నిర్వహించింది. పన్ను ఎగవేత తో పాటు ఆర్థిక పరమైన అక్రమాల గురించి ఈ సోదాలు జరుపుతున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. చిత్రా రామకృష్ణ ఎన్ఎస్ఈ లో 2013 నుంచి ఎండీ, సీఈఓ గా ఉన్నారు. 2016లో వ్యక్తిగత కారణాలతో ఆ పదవికి రాజీనామా చేశారు.

హిమాలయాల్లో నివసించే ఆధ్యాత్మిక గురువుతో ఆమె ఎన్ఎస్ఈ కి సంబంధించి ఆర్థిక, వ్యాపార ప్రణాళికలు, బోర్డు ఎజెండా సంబంధిత కీలక అంశాలను పంచుకున్నారని సెబీ ఇటీవల ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఎన్ఎస్ఈ చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్ ఆనంద్ సుబ్రమణియన్ నియామకం, తర్వాత గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎండీ సలహాదారుగా చేయడం లాంటి పాలనాపరమైన అవకతవకలు జరిగాయని సెబీ తన దర్యాప్తులో తేల్చింది.

ఆధ్యాత్మిక గురువు ఆమెపై ఎక్కువ ప్రభావం చూపారని, ఆమె ద్వారా ఎన్ఎస్ఈ ని నడిపారని సెబీ పేర్కొంది. ఆ గురువు చెప్పడం ద్వారా కేపిటల్ మార్కెట్‌లో ఎలాంటి అనుభవం లేని వ్యక్తిని ఎన్ఎస్ఈ నిర్వహణాధికారి, సలహాదారుగా నియమించినట్టు సెబీ ఆరోపించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ సెబీ ఆమెకు రూ. 3 కోట్ల జరిమానా, మూడేళ్ల స్టాక్ మార్కెట్ల నుంచి నిషేధం అమలు చేసింది.

Advertisement

Next Story