ఎంట్రన్స్ ఎగ్జామ్‌నే వ్యాపారంగా మార్చుకుని.. రూ.23కోట్లు సంపాదించిన విద్యార్థి!

by Manoj |
ఎంట్రన్స్ ఎగ్జామ్‌నే వ్యాపారంగా మార్చుకుని.. రూ.23కోట్లు సంపాదించిన విద్యార్థి!
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోనే అత్యంత కఠినమైన గావోకావో యూనివర్సిటీ అడ్మిటెన్స్ పరీక్షలో వరుసగా మూడేళ్లు విజయం సాధించిన వ్యక్తిగా క్యాన్ గుర్తింపు పొందాడు. అయితే ఈ పరీక్షలో విజయం సాధించినందుకుగాను.. ఇప్పటివరకు రూ. 23,797,980 ($300,000) సంపాదించాడని ఆరోపిస్తూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ అతను పరీక్ష రాస్తూ డబ్బులు ఎలా సంపాదిస్తున్నాడో తెలుసుకుందాం.

చైనాలోని 'గావోకావో' యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ చాలా కష్టతరమైన విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షల్లో ఒకటి. ఈ ఎగ్జామ్‌లో పాస్ అయ్యేందుకు చాలా మంది సంవత్సరాలు, కొన్నిసార్లు దశాబ్దాల పాటు ప్రయత్నిస్తుంటారు. ఉదాహరణకు లియాంగ్ షి ఈ కళాశాలలో చేరేందుకు 25 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. అయితే చైనాలోని అగ్రశ్రేణి పాఠశాల విద్యార్థులు కూడా గావోకావో జాయిన్ అయ్యేందుకు చాలా కష్టపడుతుంటారు. దీంతో ఆ పరీక్షలో పాసైన విద్యార్థులకు చైనాలోని అనేక ప్రసిద్ధ పాఠశాలలు అధికమొత్తంలో 'క్యాష్ ప్రైజ్' అందిస్తున్నాయి. ఒక విద్యార్థి గావోకావోను ఎన్నిమార్లైనా రాసేందుకు వీలుండటం, ఎటువంటి పరిమితి లేనందున, అసాధారణమైన ప్రతిభావంతులైన కొందరు వ్యక్తులు సంవత్సరాలుగా పరీక్ష రాస్తూ ప్రైజ్‌మనీ పొందుతున్నారు.

క్వాన్ అనే ఇంటిపేరు గల విద్యార్థి గత మూడేళ్లలో మూడుసార్లు గావోకావో పరీక్షలో పాల్గొని 2 మిలియన్ యువాన్స్ విలువైన బహుమతులను పొందినట్లు నివేదించిన తర్వాత చైనా అధికారులు ఇటీవల దర్యాప్తు చేపట్టారు. యూనివర్సిటీ ఎంట్రన్స్ పరీక్షలో పాస్ అయిన తర్వాత కాలేజీలో చేరుతాడా లేదా అన్నది ఆ విద్యార్థి ఇష్టం. అంతేకాదు అతడు మళ్లీ కాలేజీలో సీటు పొందాలంటే మరోసారి ఎగ్జామ్ రాసే వీలుంది. అలా తను ప్రతీసారి ఒక్కో స్కూల్ ద్వారా ఈ ఎగ్జామ్ రాస్తూ 2020 నుంచి 2022 వరకు వరసగా ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత పొంది డబ్బులు సంపాదించడంతో అతడిపై కేసు ఫైల్ అయింది. దీంతో అతడు చైనీస్ మీడియాలో వైరల్ అయ్యాడు.

కొందరు విద్యార్థులు 'గావోకావో' పరీక్షను డబ్బు సంపాదించేందుకు మార్గంగా చూస్తున్నారు. విద్యార్థులు, సంస్థలు రెండింటికీ కూడా ఇది చేటు చేస్తుంది. ఎంతోమంది విద్యార్థులు మంచి విశ్వవిద్యాలయంలో చేరాలనే ఆశతో గావోకావో పరీక్షకు హాజరవుతున్నప్పటికీ, 'ఎగ్జామ్ కేర్ టేకర్స్' మాత్రం కేవలం లాభం కోసమే ఎంట్రన్స్ రాస్తున్నారు. ఇది ఎంతమాత్రం భావ్యం కాదు. ఇందులో స్టూడెంట్‌తో పాటు పాఠశాలల తప్పు కూడా ఉంది. ఎందుకంటే వాళ్లు ఈ కెరీర్ పరీక్ష రాసే కేర్ టేకర్స్‌ను పదే పదే గావోకావోను ఏస్ చేసేందుకు నియమించుకుంటారు. తద్వారా పాఠశాల ఖ్యాతిని పెంపొందించుకునేందుకు, ఎక్కువ మంది విద్యార్థులను ఆకర్షించేందుకు ఉపయోగించుకుంటారు. నిజానికి ఇలాంటి చర్యలు విద్యాసంస్థలపై చిన్నచూపు కలిగేలా చేస్తాయి.

-జియాంగ్ బింగ్‌, ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్

క్వాన్ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. అయితే ఈ కథ ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. 'క్వాన్ ఇప్పటికే పెకింగ్ యూనివర్శిటీలో స్థానం సంపాదించాడు కానీ ప్రవేశించలేదు. అతడు చేసిన పనివల్ల ఇతర విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఆ కుర్రాడు తన ప్రతిభతో డబ్బు సంపాదిస్తున్నాడు. నిజానికి పెకింగ్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేట్లు అయిన వాళ్లు కూడా రెండేళ్లలో అంత డబ్బు సంపాదించలేరు' అని చైనా మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed