- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈసీ సంచలన నిర్ణయం.. కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లపై వేటు
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రెండు రోజుల్లోనే కేంద్ర ఎలక్షన్ కమిషన్ కొరడా ఝళిపించింది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్, నాన్-కేడర్ ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. ఎన్నికల విధుల నుంచి వారిని తప్పించింది. సమర్థులైన, సీనియర్ అధికారుల జాబితాను 24 గంటల వ్యవధిలోనే పంపించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీసు కమిషనర్లతో పాటు తొమ్మిది జిల్లాల నాన్-కేడర్ ఎస్పీలు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, మూడు శాఖల కార్యదర్శులు ఈ జాబితాలో ఉన్నారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసిన ఎన్నికల సంఘం.. తెలంగాణ సహా మిగిలిన రాష్ట్రాల విషయంలో ఇంకా లాంఛనంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. కొత్త బాధ్యతలు ఇవ్వకుండా హోల్డ్‌లో పెట్టారు. ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న బాధ్యతలను అక్కడి దిగువస్థాయి అధికారులకు అప్పగించాలని ఆ ఉత్తర్వుల్లో (జీవో నెం. 1423/11.10.2023) స్పష్టం చేశారు. ఆ తర్వాత వారంతా ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని సూచించారు. ప్రధాన కార్యదర్శి నుంచి జీవో విడుదలైన వెంటనే డీజీపీ సైతం సర్క్యులర్ విడుదల చేశారు.
ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో బదిలీలు
తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల్లోని పలువురు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ ఐదు రాష్ట్రాల్లో కలిపి మొత్తం తొమ్మిది మంది జిల్లా కలెక్టర్లు ఉంటే అందులో నలుగురు ఒక్క తెలంగాణలోనే ఉన్నారు. ఐదు రాష్ట్రాల్లో కలిపి బదిలీ వేటుకు గురైనవారిలో 25 మంది ఎస్పీలు/పోలీసు కమిషనర్లు ఉంటే అందులో సగం మంది (పన్నెండు మంది) తెలంగాణకు చెందినవారే. ఐదు రాష్ట్రాల్లో కలిపి ఐదుగురు కార్యదర్శులపై బదిలీ వేటు వేస్తే అందులో ముగ్గురు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారే.
ముగ్గురు సీపీలపై ఆరోపణలు
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు ఈ నెల 3, 4, 5 తేదీల్లో రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో విపక్షాలు హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ పోలీసు కమిషనర్లపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశాయి. ఈ ముగ్గురూ ఎన్నికల విధుల్లో కొనసాగితే పారదర్శకత ఉండదని, నిష్పక్షపాతంగా జరగవన్న ఆందోళనను చీఫ్ కమిషనర్ దగ్గర వ్యక్తం చేశారు. ఈ ముగ్గురు సీపీలు బీఆర్ఎస్ పార్టీకి ఏయే సందర్భాల్లో అనుకూలంగా వ్యవహరించారో కొన్ని ఉదాహరణలను పేర్కొని దానికి తగిన ఆధారాలను ఆ ఫిర్యాదులో ప్రస్తావించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే ఆందోళనకు ఆంక్షల్లేని అనుమతులిచ్చి, విపక్ష పార్టీలకు అలాంటి అవకాశం ఇవ్వకపోవడంపై వివరించారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో కరీంనగర్ కమిషనర్‌గా పనిచేసిన సత్యనారాయణపైనా ఇలాంటి ఫిర్యాదులే చేశారు.
నాన్ కేడర్ ఎస్పీలపై కొరడా
ఎన్నికల్లో అనుకూలంగా వ్యవహరించేందు కోసం పోలీసు, రెవెన్యూ అధికారులను ప్రభుత్వం అవసరమైన జిల్లాల్లో నియమించుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే తొమ్మిది మంది నాన్ కేడర్ ఎస్పీలను జిల్లా ఎస్పీలుగా నియమించింది. ఈసీ ఇప్పుడు ఈ అంశాన్నే సీరియస్‌గా తీసుకున్నది. అధికార దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యం, గతంలో ఎన్నికల నిర్వహణ (మునుగోడు ఉప ఎన్నిక)లో ఇలాంటివాటిపై ఆరోపణలు రావడం.. ఇవే ఇప్పుడు ఎన్నికల కమిషన్ తాజా నిర్ణయానికి కారణమైనట్లు తెలిసింది.
ఎన్నికల విధుల్లో వివాదాల ఆఫీసర్లు
గతంలో జరిగిన ఉప ఎన్నికల సమయంలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వివాదాల్లో ఇరుక్కున్నారు. రూలింగ్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్టు వారిపై ఆరోపణలు వచ్చాయి. హుజూర్‌నగర్, మునుగోడు ఉప ఎన్నికల టైమ్‌లో కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు అధికార పార్టీకి పాజిటివ్‌గా పనిచేశారని ఇప్పుడు వేటుకు గురైన అధికారులపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో వీరిని ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల పక్రియ నుంచి ఈసీ తప్పించింది. ఒకేసారి ఇంతమందిపై వేటు వేయడం ఇదే ఫస్ట్ టైమ్ అని సచివాలయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.
బదిలీకి గురైన ఐపీఎస్ అధికారులు వీరే
1 సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ – అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్‌కు బాధ్యతలు హ్యాండ్ ఓవర్
2 ఏవీ రంగనాథ్, వరంగల్ పోలీసు కమిషనర్ – క్రైమ్స్ డీసీపీ డి.మురళీధర్‌కు హ్యాండ్ ఓవర్
3 వి.సిత్యనారాయణ, నిజామాబాద్ సీపీ – అదనపు డీసీపీ జయరామ్‌కు హ్యాండ్ ఓవర్
4 ఎస్.రాజేంద్ర ప్రసాద్, సూర్యాపేట ఎస్పీ – అదనపు ఎస్పీ (అడ్మిన్) నాగేశ్వరరావుకు హ్యాండ్ ఓవర్
5 ఎం.రమణకుమార్, సంగారెడ్డి ఎస్పీ – అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.అశోక్‌కు హ్యాండ్ ఓవర్
6 బి.శ్రీనివాసరెడ్డి, కామారెడ్డి ఎస్పీ (నాన్-కేడర్) – అదనపు ఎస్పీ కే.నర్సింహారెడ్డికి హ్యాండ్ ఓవర్
7 ఏ.భాస్కర్, జగిత్యాల ఎస్పీ (నాన్-కేడర్) – అదనపు ఎస్పీ ఆర్.ప్రభాకర్‌రావుకు హ్యాండ్ ఓవర్
8 కే.నర్సింహ, ఎస్పీ, మహబూబ్‌నగర్ – అదనపు ఎస్పీ అందే రాములుకు హ్యాండ్ ఓవర్
9 కే.మనోహర్, ఎస్పీ, నాగర్‌కర్నూల్ – అదనపు ఎస్పీ రామేశ్వర్‌కు హ్యాండ్ ఓవర్
10 కే.సృజన, గద్వాల ఎస్పీ – అదనపు ఎస్పీ ఎన్.రవికి హ్యాండ్ ఓవర్
11 జీ.చంద్రమోహన్, ఎస్పీ, మహబూబాబాద్ – అదనపు ఎస్పీ (క్రైమ్స్) జే.చెన్నయ్యకు హ్యాండ్ ఓవర్
12 ఎన్. వెంకటేశ్వర్లు, నారాయణపేట ఎస్పీ – కే.సత్యనారాయణ, సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్‌కు హ్యాండ్ ఓవర్
13 పీ. కరుణాకర్, ఎస్పీ, భూపాలపల్లి – ఏ. రాములు, ఎస్డీపీవోకు హ్యాండ్ ఓవర్
నాలుగు జిల్లాల కలెక్టర్లపైనా వేటు
మొత్తం 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, నాన్-కేడర్ ఎస్పీలపై వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు జిల్లాల కలెక్టర్లనూ బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, యాదాద్రి జిల్లా కలెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి, నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి కూడా ఈ ఉత్తర్వులతో తప్పుకోవాల్సి ఉంటుంది. వీరి స్థానంలో కొత్త అధికారుల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. ఈ నాలుగు జిల్లాల కలెక్టర్లు ఆ జిల్లాలకు ఎన్నికల అధికారులుగా వ్యవహరించాల్సి ఉన్నందున వెంటనే కొత్తవారి నియామకంపై ఎలక్షన్ కమిషన్ సిఫారసుల మేరకు నిర్ణయం జరగనున్నది.
ముగ్గురు కార్యదర్శులపైనా..
రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కేఎస్ శ్రీనివాసరాజు, స్టేట్ ఎక్సయిజ్ శాఖ డైరెక్టర్ ముషారఫ్ ఆలీ, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్రీదేవిలను కూడా బదిలీ చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు విచ్చలవిడిగా మద్యాన్ని, నోట్లను పంపిణీ చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌కు అనేక ఫిర్యాదులు వెళ్లాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే సమయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌పై ఈ విషయానికి సంబంధించి పాత్రికేయులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఓటర్లకు గిఫ్టుల రూపంలో నజరానాలు ఇవ్వడాన్ని కూడా ఈసీ సీరియస్‌గా తీసుకున్నది. ఈ నేపథ్యంలో రవాణా వ్యవహారంలో ఆ శాఖ కార్యదర్శి, మద్యం విషయంలో ఎక్సయిజ్ శాఖ డైరెక్టర్, ఆర్థిక లావాదేవీలు, గిఫ్టుల విషయంలో వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌ను తప్పించాలని ఈసీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.