ఏచూరికి అమెరికా అంటే ఎందుకంత కోపం..? ఆ ఆగ్రహానికి ఇదే కారణమా!

by M.Rajitha |
ఏచూరికి అమెరికా అంటే ఎందుకంత కోపం..? ఆ ఆగ్రహానికి ఇదే కారణమా!
X

దిశ, వెబ్ డెస్క్ : భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్)(CPIM) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(Sitharam Yechury) గురువారం కన్ను మూశారు. ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, ప్రజాపక్షపాతి అయిన ఏచూరి అమెరికా విదేశాంగ విధానాలను మాత్రం తీవ్రంగా వ్యతిరేకించేవారు. అమెరికా(America) విదేశాంగ విధానాల వలనే ఇస్లాం మతంలో ఛాందసవాదం మరింత పెరిగిందని అనేవారు. పశ్చిమాసియా దేశాలైన ఇరాన్, ఇరాక్, తుర్కియే, సౌదీ అరేబియా దేశాల్లో అమెరికా సైనిక జోక్యం వల్లే ఆయా దేశాల్లో తీవ్రమైన అశాంతి ఏర్పడిందనేవారు. అమెరికా రాజకీయ జోక్యం వల్ల ఆ దేశాల్లోని ముస్లిం ప్రజలు తమ మతం అభద్రతకు గురవుతుందని అభిప్రాయపడ్డారని చెప్పేవారు. ఇది ఇస్లాం మతం మరింతగా ఛాందసవాద భావాల్లో కూరుకుపోవడానికి దోహదపడిందని అనేవారు. అనేక కొత్త కొత్త ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు పుట్టుకురావడానికి కారణం అమెరికా అనవసర జోక్యమే అని ఆరోపించేవారు. ప్రపంచం మీద పెత్తనం కోసం అమెరికా.. ఇతర దేశాల స్నేహపూర్వక వాతావరణం మధ్య చిచ్చు పెట్టగలదని ఆగ్రహం వ్యక్తం చేసేవారు. భూమి మీద అత్యంత విలువైన ఇంధన వనరులను, వాటి వాణిజ్యాన్ని తన గుప్పిట్లో ఉంచుకొని.. ప్రపంచ దేశాలను తనముందు మోకరిల్లేలా చేయడమే అమెరికా వెర్రి కోరిక అని దుయ్యబట్టేవారు. అందుకే అమెరికా పశ్చిమాసియా దేశాల మధ్య చిచ్చు పెట్టి వాటిని శ్మశానలుగా మారుస్తుందని ఆవేదన చెందేవారు. అందుకే 2015 జనవరి 26న జరిగిన భారత రిపబ్లిక్ డే వేడుకల్లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా(Barack Obama) ముఖ్య అతిధిగా పాల్గొనడాన్ని సీతారాం ఏచూరి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో బరాక్ ఒబామా పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనల్లో పాల్గొనమని అన్ని వామపక్ష పార్టీలకు సీతారాం పిలుపునివ్వగా.. దేశవ్యాప్త నిరసనల్లో లక్షల మంది కమ్యూనిస్ట్ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed