‘సింగరేణి’పై దశలవారీగా ఆందోళనలు చేస్తాం: జీబీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి

by Shiva Kumar |
‘సింగరేణి’పై దశలవారీగా ఆందోళనలు చేస్తాం: జీబీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి ప్రైవేటీకరణలో భాగంగానే నిర్వహిస్తున్న వేలంను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు టీజీబీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేకల రాజిరెడ్డి స్పష్టం చేశారు. జూలై 1న నల్లబ్యాడ్జీలతో నిరసనలు, వినతులు అందజేశామని వెల్లడించారు. తెలంగాణ భవన్ లో సింగరేణి బొగ్గుగనుల వేలంను నిరసిస్తూ ఉద్యమ కార్యచరణపై గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. సింగరేణికి 135 ఏళ్ల చరిత్ర ఉందని, పబ్లిక్ సెక్టార్ గా సంస్థ ఉందన్నారు. తెలంగాణ గడ్డపై ఉన్న ప్రతి బొగ్గు పెళ్ల సింగరేణికి దక్కుతుందన్నారు. ఎవరైనా బొగ్గు గనుల వేలానికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సింగరేణికి ఏం తక్కువ ఉందని బొగ్గు బ్లాకులను ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి ద్వారా 70 వేల మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించామని, సింగరేణి సంస్ధలో 40 వేల మంది కార్మికులు ఉన్నారన్నారు. సింగరేణి సంస్థ తెలంగాణ ప్రజల సంస్ధ అని, టెక్నికల్ గా మాత్రమే సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉందన్నారు. సింగరేణి సంస్థ ఉనికి కోల్పోయే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

పబ్లిక్ సెక్టార్లను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కోల్ ఇండియాలో వేలం లేకుండానే బొగ్గు బావులను తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణికి కూడా వేలం లేకుండా బొగ్గు బ్లాకులను కేటాయించాలని డిమాండ్ చేశారు. బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ అడ్డుకోవాలని కోరారు. బొగ్గు బ్లాకుల వేలానికి బీజేపీకి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సహకరిస్తోందని ఆరోపించారు. సింగరేణి అత్యధిక బొగ్గు ఉత్పత్తిని సాధించిందని వెల్లడించారు. సింగరేణిని కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని వెల్లడించారు. జూలై 1న నల్ల బ్యాడ్జీలతో నిరసన, అధికారులకు వినతులు, 3 వ తేదీన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల దహనం, 6 వ తేదీన జీఎం ఆఫీసుల ఎదుట ధర్నా, 9 వ తేదీన గోదావరిఖనిలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు.

రెండోదశ పోరాటాలు చేస్తామని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత కోల్ బెల్టు ఎమ్మెల్యేలకు వినతులు ఇచ్చి ఒత్తిడి చేస్తామన్నారు. మరోవైపు అసెంబ్లీలో కేసీఆర్ తో ఒత్తిడి చేయిస్తామన్నారు. ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేస్తామన్నారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే పార్లమెంట్ సమావేశాల సమయంలో అవసరం అయితే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని వెల్లడించారు. సింగరేణి సంస్థ ఇబ్బందులు, గొప్పతనం దేశానికి తెలియజేస్తామన్నారు. సింగరేణి ప్రైవేటీకరణలో భాగంగానే వేలం అని వెంటనే ఉపసంహరించుకోవాలని, శ్రావణ్ పల్లి బొగ్గుగని బ్లాక్ 17(ఏ) ప్రకారం సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇతరులు ఎవరు వచ్చినా బొగ్గుబావుల్లో అడుగు పెట్టనివ్వబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు కాపు కృష్ణ, నూనె కొమరయ్య, మాదాసి రామమూర్తి, సురేందర్ రెడ్డి, పర్లపల్లి రవి, బి.సంపత్ కుమార్, రాజశేఖర్, వడ్డేపల్లి శంకర్, చల్లా రవీందర్ రెడ్డి, బేతి చంద్రయ్య, పింగళి సంపత్ రెడ్డి, చెల్ఫూరి సతీష్ తోపాటు 11 డివిజన్ల ఉపాధ్యక్షులు మల్రాజు శ్రీనివాసరావు, మేడిపల్లి సంపత్, పేట్టం లక్ష్మణ్, సంపత్ రెడ్డి, బడితల సమ్మయ్య ,నాగేల్లి వెంకట్, గడప రాజయ్య, శ్రీనివాసరావు, జాఫర్ హుస్సేన్ తో పాటు రాష్ట్ర నాయకులు తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed