81 కోట్ల మందికి ఉచిత ప్రయాణాలు అందించాం : మంత్రి పొన్నం ప్రభాకర్

by M.Rajitha |
81 కోట్ల మందికి ఉచిత ప్రయాణాలు అందించాం : మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : పరిపూర్ణ సమాజం, జాతి నిర్మాణానికి మహిళలు సాధికరాత సాధించడమే సోపానమని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ లోని స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం అఖిల భారత విద్యాసంఘాల సమాఖ్య(ఐఫియా), తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టీఆర్‌టీఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. మహిళా సాధికారితకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొలి సంతకం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై పెట్టినట్లుగా గుర్తుచేశారు. ఇప్పటివరకు 81 కోట్ల మంది ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారన్నారు. సాధికారతలో భాగంగానే అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో మహిళలకు సంపూర్ణ భాగస్వామ్యం కల్పించినట్లు తెలిపారు. విద్యలో తారతమ్యాలు తగ్గించడం ద్వారా మహిళా సాధికారత సాధించవచ్చు అని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అతి త్వరలోనే ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని స్పష్టంచేశారు. అనంతరం ప్రొఫెసర్ వై ప్రశాంతి మాట్లాడుతూ.. మహిళలకు నేటి సమాజంలో తగిన రీతిలో ప్రాధాన్యత దక్కడం లేదని, నేటికీ వారు రెండో శ్రేణి పౌరులుగానే కొనసాగుతున్నారని చెప్పారు. అనేక రంగాల్లో వివక్షత, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆటవిక సమాజానికి ప్రతిరూపంగా అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయన్నారు. బాలికలను రక్షించేందుకు సమాజం మొత్తం నడుంబిగించాలని ఆమె ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, అఖిలభారత విద్యాసంఘాల సమాఖ్య అధ్యక్షుడు సుధీర్ కుమార్, సంస్థ ప్రధాన కార్యదర్శి కుమార్, సంస్థ సలహాదారు కే సుబ్బారెడ్డి, స్టాన్లీ కళాశాలల చైర్మన్ కృష్ణారెడ్డి, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి మా రెడ్డి అంజిరెడ్డి, నాయకులు కావలి అశోక్ కుమార్, స్థానిక కౌన్సిలర్ డాక్టర్ సురేఖ, నాయకులు కటకం రవికుమార్, మిథిలేష్ శర్మ, మనోజ్ కుమార్, కమల్ లోచక్, కిరణ్ జ్యోతి, స్వర్ణ సమత, బాల త్రిపుర సుందరి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed