బీజేపీకి గుణపాఠం తప్పదు

by Sridhar Babu |
బీజేపీకి గుణపాఠం తప్పదు
X

దిశ, హన్మకొండ : లోక్‌సభ ఎన్నికల్లో 400 లకు పైగా సీట్లు సాధించి అధికారంలోకి వస్తామని డాంభీకాలు పలికిన బీజేపీని ప్రజలు సగం సీట్లకు తగ్గించి తగిన గుణపాఠం చెప్పారని, త్వరలో జరగనున్న హర్యాన, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కూడా బీజేపీని ఓడించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ డి.రాజా అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందనేది ప్రశ్నార్థకమేనని, చంద్రబాబు నాయుడు, నితీష్‌కుమార్‌ వారి వెంట ఎంత కాలం ఉంటారో కూడా తెలియదని అన్నారు. హన్మకొండలో మూడు రోజుల పాటు జరగనున్న సీపీఐ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు గురువారం ఆయన హన్మకొండకు వచ్చారు. ఈ సందర్భంగా హరిత హోటల్‌ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ రాజ్యాంగంపై ప్రత్యక్షంగా దాడి చేస్తున్నాయని, దేశంలో తీవ్రమైన సంక్షోభ పరిస్థితులు ఉన్నాయని, రాజ్యాంగాన్ని విస్మరిస్తూ ఉద్యోగ నియామకాల్లో లాటరల్‌ ఎంట్రీ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులను బ్యూరోక్రసీలో చొప్పించేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. ఇందుకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్రాల హక్కులు, అధికారాలను లాక్కుంటుందని, రాజ్యాంగం స్థానంలో కొత్త మతతత్వ రాజ్యాంగం తేవాలని ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం పెద్ద వైఫల్యమని, అక్కడ ఎన్‌కౌంటర్లు, దాడులు జరుగుతున్నాయని, శాంతి, సాధారణ పరిస్థితులు ఆ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్ర పభ్రుత్వం కార్పొరేటర్లకు విథేయతను చాటుకుందని, ప్రజల తక్షణ సమస్యల గురించి పట్టించుకోలేదని అన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ మారిందని చెబుతున్న ప్రధాని మోదీ దేశంలో ఉచితంగా రేషన్‌ ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అధానీ సంస్థలలో భాగస్వామ్యం కలిగిన సెబి చైర్‌ పర్సన్‌ను ఆ పదవి నుంచి తప్పుకోవాలని ప్రధాని మోదీ ఎందుకు కోరడం లేదని, ఈ మొత్తం వ్యవహారంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)ని ఏర్పాటు చేసేందుకు మోదీ ఎందుకు వెనుకాడుతున్నారని అన్నారు. కోల్‌కతాలో వైద్యురాలిపై జరిగిన ఘటన అత్యంత దారుణం అన్నారు.

ఆసుపత్రులు, వైద్య సంస్థల్లో వైద్యులు, సిబ్బంది భధ్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్లు, సామాజిక న్యాయాన్ని ఎత్తి వేసేందుకు కుట్రలు చేస్తుందని విమర్శించారు. గత లోక్ సభ ఎన్నికల సందర్భంగా భావపారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించిందని అన్నారు. రెండు ఎంఎల్‌సీ పదవులను ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదని గుర్తు చేశారు. అదే విధంగా ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా కాంగ్రెస్‌ అనేక హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయాలని ఆయన కోరారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ముందుకు సాగాలని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కావస్తుందని, నేటికి గత ప్రభుత్వం సృష్టించిన

సంక్షోభాల నుండి బయట పడలేక పోతుందని అన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పని అయిపోయిందని, బీజేపీ రాకూడదని, కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉండాలని తాము కోరుకుంటున్నామని పేర్కొన్నారు. సీపీఐ ని ఒక పోరాట పార్టీగా నిలబెట్టేందుకు హనుమకొండలో రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహిస్తున్నామని, ప్రజాసమస్యలపై చర్చించి, పార్టీ పరంగా శ్రేణులను ఎలా కదిలించాలన్న విషయాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్‌ 26కు సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి కావస్తున్నదని తెలిపారు. అలాగే సెప్టెంబర్‌ 11 నుండి 19 వరకు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్‌ కె.నారాయణ, సయ్యద్‌ అజీజ్‌పాషా, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు, పశ్య పద్మ, కలవేణ శంకర్‌, వీఎస్‌ బోస్‌, ఎన్‌.బాలమల్లేష్‌, ఎం. బాలనరసింహ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed