ప్రముఖ క్రికెటర్ ఇంట్లో విలువైన వస్తువులు చోరీ.. దొంగలకు కీలక విజ్ఞప్తి

by Rani Yarlagadda |
ప్రముఖ క్రికెటర్ ఇంట్లో విలువైన వస్తువులు చోరీ.. దొంగలకు కీలక విజ్ఞప్తి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ క్రికెటర్, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ ఘటన రెండువారాల క్రితమే జరగ్గా.. తాజాగా ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తో విషయం వెలుగుచూసింది. తన ఇంట్లో విలువైన వస్తువులు దొంగిలించబడ్డాయని, దొంగను పట్టుకునేందుకు సహాయం చేయాలని నెటిజన్లను కోరాడు బెన్ స్టోక్స్. అక్టోబర్ 17న నార్త్ ఈస్ట్ ఇంగ్లండ్ లోని కాస్టల్ ఈడెన్ ఏరియాలో ఉన్న తన ఇంట్లోకి కొందరు ముసుగు వేసుకున్న వ్యక్తులు చొరబడి దోపిడీకి పాల్పడినట్లు ఆ పోస్టులో వివరించాడు. దొంగతనం జరిగిన సమయంలో తాను పాకిస్థాన్ పర్యటనలో ఉన్నానని, భార్య, పిల్లలు మాత్రం ఇంట్లోనే ఉన్నారన్నాడు. వారికెలాంటి హాని జరగలేదు కానీ.. విలువైన వస్తువులు పోయాయని వాపోయాడు.

చోరీకి గురైన వస్తువులతో తనకు, తన కుటుంబానికెంతో అనుబంధం ఉందన్నాడు. వాటిని మరో వస్తువులతో రీప్లేస్ చేయలేనన్న బెన్ స్టోక్.. దొంగలకు కీలక విజ్ఞప్తి చేశాడు. దయచేసి ఆ వస్తువుల్ని తిరిగి ఇచ్చేయాలని కోరాడు. ఈ దొంగతనం తన కుటుంబసభ్యుల్ని మానసికంగా ఎంతో కలవరపరిచిందన్నాడు. చోరీకి గురైన వస్తువుల్లో నగలు, డిజైనర్ బ్యాగులు, క్రికెట్ సేవలకు గాను గౌరవార్థంగా తనకు లభించిన మెడల్స్ ఉన్నట్లు పేర్కొన్నాడు. వాటికి విలువ కట్టలేనని, ఆ వస్తువులు దొరికితే తిరిగి తనకు అందిస్తారన్న ఆశతో ఫొటోలు షేర్ చేస్తున్నట్లు చెప్పాడు.

Advertisement

Next Story