Bengaluru: బెంగళూరులో భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు

by vinod kumar |
Bengaluru: బెంగళూరులో భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో చెట్లు నేలకూలాయి. వాతావరణ ప్రభావంతో బెంగళూరుకు వచ్చే 20 విమానాలను అధికారులు దారి మళ్లించగా, 10 విమానాలు ఆలస్యంగా నడిచాయి. దారి మళ్లించిన విమానాల్లో ఇండిగో 10, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 4, అకాసాకు చెందిన 2, ఎయిర్ ఇండియాకు చెందిన 2 , దేశీయంగా 18, రెండు అంతర్జాతీయ ఇండిగో విమానాలున్నాయి. ‘బెంగళూరులో ప్రతికూల వాతవరణం ఉండటంతో విమానాలపై ప్రభావం పడింది. వాతావరణ పరిస్థితిని గమనిస్తున్నాం. పరిస్థితులు మెరుగుపడిన వెంటనే కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తాం’ అని ఇండిగో (indigo), ఎయిర్ ఇండియా (Air india)లు ఓ ప్రకటనలో తెలిపాయి.

ఒడిశాలో ఇద్దరు మృతి

ఒడిశాలోనూ భారీ వర్షాలు కురిశాయి. ఈ కారణంగా పలు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా, 67 మంది గాయపడ్డారు. మయూర్‌భంజ్‌ జిల్లాలో 600 పైగా ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. గంజాం, పూరి జిల్లాల్లో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందగా, మయూర్‌భంజ్ జిల్లాలో వడగళ్ల వాన కారణంగా అనేక మంది గాయపడ్డట్టు వెల్లడించారు. మయూర్‌భంజ్‌లోని రెండు అత్యంత దెబ్బతిన్న బ్లాక్‌లైన బిసోయి, బంగిర్‌పోసి బ్లాక్‌లలో జిల్లా యంత్రాంగం సహాయ, పునరావాస కార్యకలాపాలను ప్రారంభించింది. భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Next Story