Canada: భారత్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కెనడా

by Shamantha N |
Canada: భారత్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కెనడా
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌-కెనడాల మధ్య దౌత్య వివాదం కొనసాగుతోంది. ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించిన సమయంలో భారత్ పై కెనడా(Canada) సంచలన ఆరోపణలు చేసింది. ఏప్రిల్ 28న అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఈ ఎన్నికల్లో(Canada Elections) భారత్, చైనా జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఒట్టావా స్పై ఏజెన్సీ ఆరోపించింది. కెనడియన్‌ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వానెస్సా లాయిడ్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘త్వరలో జరిగే ఎన్నికల్లో కెనడా ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా(PRC) ఏఐ ఆధారిత సాధనాలను ఉపయోగించే అవకాశం ఎక్కువగా ఉంది. చైనా తన ప్రయోజనాలకు అనుకూలమైన కథనాలను ప్రోత్సహించడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది. రహస్య, మోసపూరిత మార్గాల ద్వారా కెనడాలోని చైనీయులు.. సాంస్కృతిక, మతరపరమైన సంఘాలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకునే ఛాన్స్ ఉంది. భారత ప్రభుత్వం(Indian Government) తన భౌగోళిక రాజకీయ ప్రభావాన్ని నిరూపించుకోవడానికి కెనడియన్ కమ్యూనిటీలు, ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకునే ఉద్దేశం కనిపిస్తోంది. భారత ప్రభుత్వానికి ఈ సామర్థ్యం ఉంది." అని ఆమె అన్నారు. అయితే, ఈ ఆరోపణలపై ఒట్టావాలోని చైనీస్‌, భారత దౌత్య కార్యాలయాలు ఇంకా స్పందించలేదు.

రష్యా, పాక్ పైనా ఆరోపణలు

అంతేకాకుండా.. రష్యా, పాకిస్థాన్‌ కూడా ఆ ప్రయత్నం చేయొచ్చని వానెస్సా లాయిడ్‌ అనుమానాలు వ్యక్తంచేసింది. " కెనడియన్లను లక్ష్యంగా చేసుకుని విదేశీ సమాచారాన్ని తారుమారు చేసి, కార్యకలాపాల్లో జోక్యం చేసకునేందుకు ఆన్ లైన్ నెట్ వర్క్ లను క్రెమ్లిన్ వాడే అవకాశం ఉంది. పాకిస్థాన్ లోని రాజకీయ, భద్రత, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి భారత్ పై పెరుగుతున్న ప్రపంచ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఇస్లామాబాద్ కెనడాపై విదేశీజోక్యం కార్యకలాపాలు నిర్వహించగలదు." అని చెప్పుకొచ్చారు. 2023 జూన్‌లో ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. వాటిని న్యూఢిల్లీ తీవ్రంగా ఖండించింది. దీనిపై ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుండగానే.. కెనడా పదేపదే భారత్ పై ఆరోపణలు చేస్తూనే ఉంది. మరోవైపు, చైనాతో కూడా కెనడా సంబంధాలు దిగజారిపోయాయి. గత సంవత్సరం చైనా ఎలక్ట్రిక్ వాహనాలు, ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై ఒట్టావా సుంకాలు విధించింది. దీనికి ప్రతీకారంగా బీజింగ్ ఈ నెలలో 2.6 బిలియన్లకు పైగా విలువైన కెనడియన్ వ్యవసాయ, ఆహార ఉత్పత్తులపై టారీఫ్ లు ప్రకటించింది.

Advertisement
Next Story

Most Viewed