- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గ్లోబల్ సిటీగా HYD అభివృద్ధి.. GHMC మేయర్ కీలక పిలుపు

దిశ, తెలంగాణ బ్యూరో: నగర అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దామని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి స్టాండింగ్ కమిటీ సభ్యులను కోరారు. శనివారం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం మేయర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యులకు మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఇలంబర్తి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. స్టాండింగ్ కమిటికి అత్యంత ప్రాముఖ్యత ఉందన్నారు. స్టాండింగ్ కమిటీ పాలసీ నిర్ణయాల కమిటీ అని, నిర్మాణాత్మక, ప్రజోపయోగమైన నిర్ణయాలు తీసుకుని నగర అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.
గతంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట ప్రభుత్వం జీహెచ్ఎంసీకి పెద్దఎత్తున నిధులను మంజూరు చేస్తున్నదని, హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకు సీఎం రేవంత్ రెడ్డికి జీహెచ్ఎంసీ తరుపున మేయర్ కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, బానోతు సుజాత, సయ్యద్ మిన్హాజుద్దీన్, సమీనా బేగం, అబ్దుల్ వాహెబ్, మహాలక్ష్మి రామన్ గౌడ్, మహమ్మద్ గౌస్ ఉద్దీన్, సీఎన్.రెడ్డి, వీ.జగదీశ్వర్ గౌడ్, బురుగడ్డ పుష్ప నగేశ్ పాల్గొన్నారు.
స్టాండింగ్ కమిటీలో ఆమోదించిన అంశాలు..
- స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక పూర్తి అయినందున ప్రతి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించడానికి కమిటీ ఆమోదం.
- అల్వాల్ గ్రామానికి చెందిన గ్రామకంఠంలోని 0.11 గుంటల భూమిని మేడ్చల్ డివిజన్‌లో కొత్త అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా అగ్నిమాపక శాఖ అధికారికి కేటాయించుటకు కార్పొరేషన్ ఎన్‌వోసీ జారీచేయుటకు కమిటీ ఆమోదం.
- 2024-25 ఆర్థిక సంవత్సరానికి వన్ టైమ్ స్కీమ్ కింద 90 శాతం బకాయి వడ్డీని మాఫీ చేయడం, స్టాండింగ్ కమిటీ ఆమోదంతో అనుమతి కోరుతూ ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ కమిటీ ఆమోదం.
- కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్‌లో ఉన్న కుమందన్ బౌలి హెరిటేజ్ స్ట్రక్చర్ (చారిత్రక మెట్ల బావి) పరిరక్షణ, అభివృద్ధికి గాను ఇండియన్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ ఆర్థిక సహకారంతో రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో పునరుద్ధరణ, పరిరక్షణ కోసం మొదటి దశలో 18 నెలల పాటు నిర్మాణ్ ఎన్‌జీఓ ఆర్గనైజేషన్‌తో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఎంవోయూ చేయుటకు కమిటీ ఆమోదం.
- చాంద్రాయణగుట్ట బండ్లగూడలో గల ప్రోగ్రెస్ స్కూల్ నుంచి క్రిస్టల్ టౌన్, డెలివరీ కొరియర్ సర్వీస్ వరకు స్టార్మ్ వాటర్ డ్రెయిన్, వీడీసీసీ రోడ్ నిర్మాణాలకు రూ.2.95 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు పరిపాలన అనుమతికి కమిటీ ఆమోదం.
- శేరిలింగంపల్లి మండలం, లింగంపల్లి గ్రామంలో నల్లగండ్ల చెరువు వద్ద మురుగు మళ్లింపునకు రూ.3.35 కోట్లతో చేపట్టేందుకు టెండర్ పిలువడానికి అడ్మినిస్ట్రేటివ్ మంజూరుకు కమిటీ ఆమోదం.
- శేరిలింగంపల్లి జోన్ కొండాపూర్ గ్రామంలోని కుడి కుంటను సీఎస్ఆర్ కింద పునరుద్దరణకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సహకారంతో మెస్సర్స్ సాహీ ఎన్‌జీఓతో ఆరు నెలల కాలానికి అడిషనల్ కమిషనర్ లేక్స్ ఎంవోయూ చేయుటకు కమిటీ ఆమోదం.