- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
GHMC: జీహెచ్ఎంసీలో అవినీతికి చెక్.. ఆ ఎనిమిది విభాగాలపై విజిలెన్స్ విచారణ!

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీలో అవినీతికి చెక్ పెట్టడంతో పాటు నిధుల దుర్వినియోగం, ఆదాయానికి గండికొట్టే చర్యలకు చెక్ పెట్టాలని కమిషనర్ ఇలంబర్తి నిర్ణయించారు. దీంతో పాటు పౌరులకు మెరుగైన సేవలందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విభాగాలపైనా నిఘా పెట్టారు. అందులో భాగంగానే బల్దియాలోని ఎనిమిది విభాగాలపై విజిలెన్స్ విభాగం చేత విచారణ చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఇంజినీరింగ్ విభాగంపై చేయించారు.
రూ.150 కోట్ల బిల్లులపై..
జీహెచ్ఎంసీలో రెండేండ్లకు పైబడిన కాంట్రాక్టర్ల బిల్లులను విజిలెన్స్ విభాగం అధికారులు విచారణ చేపట్టారు. రోడ్లపై గుంతలను పూడ్చడం, చెరువుల్లో గుర్రపు డెక్కను తొలగించడం వంటి పనులు కాకుండా సివిల్ వర్క్స్‌ను పరిశీలించారు. రూ.150 కోట్ల పనులను విజిలెన్స్ అధికారులు విచారించారు. వీటిలో భారీగానే లోపాలు జరిగినట్టు గుర్తించారు. వీటికి సంబంధించిన రిపోర్టును కమిషనర్ ఇలంబర్తికి అందజేశారు. గుర్తించిన తప్పుల ఆధారంగా కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులపై చర్యలు తీసుకునే అవకాశమున్నట్టు సమాచారం. వీటిలో రూ.60 కోట్ల బిల్లులను నిలిపేసినట్టు తెలిసింది.
టౌన్‌ప్లానింగ్ విభాగంలోనూ..
క్షేత్రస్థాయిలో టౌన్‌ప్లానింగ్ అధికారులు సరిగ్గా పనిచేయకపోవడంతో పాటు అవినీతికి పాల్పడుతున్నారని. ఫలితంగానే విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయని గుర్తించారు. దీంతోపాటు క్షేత్రస్థాయిలో పనిచేయడానికి న్యాక్ నుంచి 100 మంది ఇంజినీర్లను జీహెచ్ఎంసీ నియమించుకుంది. కానీ ఆశించిన స్థాయిలో పనిచేయకపోగా అవినీతికి పాల్పడుతున్నారని 27 మందిని తొలగించిన విషయం తెలిసిందే. మరికొంత మందిపైనా విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టినట్టు తెలిసింది.
ఇతర విభాగాల్లో..
హెల్త్ విభాగంలోని ఎంటమాలజీ, జనన, మరణ ధ్రువప్రతాల జారీ విభాగాలపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఫుడ్‌సేఫ్టీ విభాగంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో విచారణ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. విద్యుత్ విభాగంలో వీధి దీపాల నిర్వహణలో భారీగా అవకతవకలు జరుగుతున్నట్టు గుర్తించారు. ఈ విభాగంలో సమూల మార్పులు చేయాలని నిర్ణయించారు.మొబైల్ యాప్ కూడా తీసుకొస్తున్నారు. అర్బన్ బయోడైవర్సిటీ విభాగంలో నిర్వహిస్తున్న హరితహారం, నర్సరీల నిర్వహణపై నిఘా పెట్టారు. ట్రాన్స్ పోర్ట్ విభాగంలో అవినీతిపై విజిలెన్స్ విచారణ చేస్తున్నారు.
యాక్షన్ షురూ..
విజిలెన్స్ విచారణ చేయిస్తున్న కమిషనర్ యాక్షన్ కూడా ప్రారంభించారు. ఇప్పటికే ఇంజినీరింగ్ విభాగంలో రూ.60కోట్ల బిల్లులను నిలిపేశారు. త్వరలోనే ఇంజినీర్లపై చర్యలు తీసుకునే అవకాశమున్నట్టు ప్రచారం జరుగుతుంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అయితే 27మంది న్యాక్ ఇంజినీర్లను తొలగించిన విషయం విధితమే. మిగిలిన విభాగాల్లో విజిలెన్స్ విచారణ చేపట్టిన చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలూలేకపోలేదు.