బల్దియా వెనుక బడా బొంద

by Sridhar Babu |
బల్దియా వెనుక బడా బొంద
X

దిశ, వరంగల్‌ టౌన్ : అధికారుల అవగాహన రాహిత్యమో, కాంట్రాక్టర్‌ అత్యుత్సాహమో, పాలకుల ఒత్తిళ్లే కారణమో.. వరంగల్‌ మహానగర పాలక సంస్థ పాలనా వైఫల్యం బల్దియా సాక్షిగా తేటతెల్లమవుతోంది. అభివృద్ధి పనుల పట్ల అధికారులు, పాలకుల చిత్తశుద్ధికి బల్దియా వెనుక పెద్ద గుంత నిదర్శనంగా నిలుస్తోంది. ఏండ్లు గడుస్తున్నా.. నీళ్లతో నిండి మురికి గుంతను తలపిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. మరో ఆఫీసుకు దారి లేకుండా చేసిన ఈ పని పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

అగాధంలో అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌..

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయ ముందు భవనం పాతబడింది. ఇండోర్‌ స్టేడియం ముందు భాగంలో కొత్త బిల్డింగ్‌ నిర్మించాలని నిర్ణయించారు. ఆ నిర్మాణం పూర్తయ్యాక ముందు బిల్డింగ్‌ను కూల్చివేసి షాపింగ్‌ కాంప్లెక్స్‌ కట్టించాలనుకున్నారు. తద్వారా బల్దియాకు ఆదాయం సమకూరుతుందని భావించారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా... అసలు లక్ష్యం నీరుగారి పోయినట్లయింది. ఆరంభంలోనే హంసపాదులా నిధుల లేమి బిల్డింగ్‌ నిర్మాణానికి అడ్డంకిగా మారాయి. సీఎం అస్యూరెన్స్‌ నిధులు రూ.24 కోట్లతో ఈ బిల్డింగ్‌

నిర్మించాలనుకుని గత ప్రభుత్వ హయాంలో టెండర్‌ కూడా పిలిచారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పనులు మొదలుపెట్టాడు. పునాది, పిల్లర్ల కోసం గుంత తవ్వి వదిలేశాడు. దీంతో ఇప్పుడు ఆ గుంత వర్షపునీటితో నిండి మురికి కూపాన్ని తలపిస్తోంది. అంతేకాదు ఆర్కియాలజీ ఆఫీసుకు వెళ్లే దారి మూతపడినట్లయింది. ఫలితంగా ఆర్కియాలజీ అధికారులు ఆఫీసుకు వెళ్లడానికి ఇండోర్‌ స్టేడియం వెనుక భాగం నుంచి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అర్ధంతరంగా నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యేదెప్పుడో? వేచిచూడాల్సిందే.

Advertisement

Next Story