Banking Sector: సెప్టెంబర్ లో తగ్గిన బ్యాంకుల రుణాలు

by S Gopi |
Banking Sector: సెప్టెంబర్ లో తగ్గిన బ్యాంకుల రుణాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: కొవిడ్ మహమ్మారి తర్వాత దేశంలో రుణాలు విపరీతంగా పెరిగాయి. ఇటీవల డిపాజిట్లు తగ్గిపోయి లోన్‌లు అత్యధికంగా ఉండటంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) బ్యాంకులకు కీలక సూచనలు చేసింది. దాని ఫలితంగా సెప్టెంబర్ నెలలో భారతీయ బ్యాంకుల రుణాల వృద్ధి నెమ్మదించింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే రిటైల్ రుణాలు తగ్గాయని గురువారం విడుదలైన ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాతృసంస్థ హెచ్‌డీఎఫ్‌సీతో విలీనం చేయడం వల్ల దాన్ని మినహాయిస్తే గత నెలలో బ్యాంకుల రుణాల వృద్ధి 14.4 శాతంగా ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఇది 15.3 శాతంగా ఉంది. విలీనమైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును కూడా కలిపిస్తే బ్యాంకుల రుణాల వృద్ధి 13 శాతం, గతేడాది ఇది 20 శాతం ఉంది. అంతకుముందు ఆగష్టులో సైతం రుణాల వృద్ధి కొంతమేర తగ్గింది. గత కొంతకాలంగా ఆర్థిక వృద్ధి సానుకూలంగా ఉండటం, పట్టణాల్లో వినియోగం పెరగడంతో రెండంకెల స్థాయిలో రుణాలు పెరిగాయి. అయితే, మొండి బకాయిల ప్రమాదాన్ని గుర్తించిన ఆర్‌బీఐ గతేడాది ఆఖరు నుంచి బ్యాంకులను హెచ్చరించింది. అంతేకాకుండా అధిక మూలధన నిధులు కలిగి ఉండాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత కూడా పర్సనల్ లోన్‌లు, క్రెడిట్ కార్డు రుణాలు 25 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. దాంతో ఆర్‌బీఐ మరింత కఠినంగా బ్యాంకులను హెచ్చరించాయి. డిపాజిట్లు పెరిగే చర్యలు తీసుకోవాలని సూచించాయి. ఫలితంగా గత రెండు నెలలుగా రుణాల వృద్ధి నెమ్మదిస్తోంది.

Advertisement

Next Story