అండమాన్ - నికోబార్ ( రెండో భాగం ) గిరిజా పైడిమర్రి

by M.Rajitha |
అండమాన్ - నికోబార్ ( రెండో భాగం ) గిరిజా పైడిమర్రి
X

దిశ, వెబ్ డెస్క్ : మరునాడు ఉదయమే అల్పాహారం ముగించి మేము నార్త్ బే, రాస్ ఐలాండ్స్ చూడడానికి వెళ్ళాము. నార్త్ బే ఐలాండును కోరల్ ఐలాండ్ అని కూడా అంటారు. అక్కడ అనేక రకాల వాటర్ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వాటికి సంబంధించిన టికెట్లు డబ్బు చెల్లించి పోర్ట్ బ్లెయిర్ లోనే తీసుకోవలసి ఉంటుంది. మనం పాల్గొనలేక పోయిన గేమ్స్ డబ్బు తిరిగి వచ్చిన తరువాత మనకు తిరిగి చెల్లిస్తారు. సబ్ మెరైన్ కు తొమ్మిది, పారా సెయిలింగ్ కు ఆరు, జెట్స్కికి ఎనిమిది టికెట్లు తీసుకున్నాము. సబ్ మెరైన్ ఒక్కరికి ₹2600/. పారా సెయిలింగ్ ఒకరికి ₹3600/. జెట్స్కీ ఒక్కరికి ₹600/. ఫెర్రీలో నార్త్ బే ఐలాండుకు గంట ప్రయాణం. మా సబ్ మెరైన్ ట్రిప్ కు దాదాపు రెండు గంటల టైం ఉండడం వల్ల మాలో నలుగురం లైట్ హౌస్ వైపు వెళ్ళాము. ఒక్కరికి పది రూపాయల టికెట్ తీసుకొని, ఆరు అంతస్తులు ఎక్కి పైకి వెళ్ళాము. అద్భుతమైన ఆ ప్రాకృతిక దృశ్యాన్ని చూసి మైమరచి పోయాము. ఈలోగా సబ్ మెరైన్ ట్రిప్ కు రమ్మంటూ ఫోన్ వచ్చింది. సబ్ మెరైన్ లో ఒకేసారి 40 మంది కూర్చోవచ్చు. ఒక ట్రిప్ 45 ని.లు. అంటే మేము అంత సేపు సముద్ర గర్భంలో ఉన్న రక రకాల కోరల్స్, భిన్న వర్ణాల చేపలను చూస్తూ కడలి అంచులో కదిలి పోయాము. అసలు సమయమే తెలియలేదు.

పారాచూట్ బెలూన్

అక్కడి నుంచి రాస్ ఐలాండ్ కు ప్రయాణం. పారాసెయిలింగ్ చేయని వాళ్ళను ఒక పెద్ద బోటులో ఎక్కమన్నారు. పారాసెయిలింగ్ చేయాలని టికె ట్ తీసుకున్న ఆరుగురం విడిగా చిన్న బోటు ఎక్కాము. మధ్యలో వాతావరణ అనుకూల స్థితిని బట్టి పారాసెయిలింగ్ చేసి, అదే బోటులో రాస్ ఐలాండ్ కు తీసుకువెలతారన్నమాట. పారాచూట్ బెలూన్ ను నడుముకు బిగించికొని సముద్రం మీద గాలిలోకి ఎగరడమే పారాసెయిలింగ్. ( సముద్రం పైన కాకుండా కొండలపైన గాలిలోకి ఎగిరితే పారాస్లైడింగ్ అంటారు. ) అది ఒక అద్భుతమైన సాహస క్రీడ. పక్షిలా రెక్కలు కట్టుకొని ఎగరాలని చిరకాలంగా అంతర్లీనంగా ఉన్న కోరిక తీరబోతున్నదనే ఉద్వేగం ... మా ఆరుగురిలో నలుగురం చేయగలిగాము. భిన్న వర్ణాల పారాచూట్ ను నడుముకు బిగించికొని ఆ మూడు నిమిషాలు పక్షిలాగా గాలిలో ఎగిరిపోయాను. పైన నీలాకాశం... కింద నీలి సముద్రం ..... కనిపించనంత ఎత్తులో గాలిలో తేలిపోతూ నేను.... ఇలాంటి అనుభూతులను వర్ణించడానికి నిజంగా భాష సరిపోదు. మా బోటులో ఉన్న యువతీ యువకుల్లో కూడా కొందరు భయపడ్డారు. మరికొందరు కళ్ళు తిరిగాయని చెప్పారు. ఇంకొందరికి వాంతులు కూడా అయ్యాయి.

జెట్స్ కింగ్ కూడా సముద్రంలో చేసే సాహసక్రీడనే. గాలిలో ఆకాశంలోకి ఎగరడం ఒకటైతే.... మోటారు బైకులో రయ్ మని సముద్రపు అలల మీద దూసుకుపోవడం రెండోది. బనానా పడవపై ( బనానా రైడ్ ) అలల మీద తేలి పోయిన అనుభవం నాకుంది. మోటారు బైకు పైన రయ్ మంటూ అలల మీద దూసుకు పోవడం ఇదే తొలిసారి. అలల మీద బైకు కదలికలకు ఒక వైపు ఉద్వేగం .... మరోవైపు ఆనందం... కాసింత భయం. అన్నింటి మేళవింపు అనుభూతిని మాటల్లో చెప్పలేను. మొత్తంగా పది నిమిషాలు... ఇంకాసేపు ఉంటే బాగుండునిపించింది. కానీ తీరాన్ని చేరాను. మరో రోజు మళ్ళీ చేయాలనుకున్నాను. వీలు కాలేదు. ఇరవై ఏళ్ళ వయసులో చేయవలసిన ఇలాంటి సాహస క్రీడలు అరవై దాటాక చేయడం.... నాకైతే బోలెడంత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వయసు సంఖ్య మాత్రమే .... మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండడం ముఖ్యం. అందుకు నిరంతరం శ్రద్ధ పెట్టడం చాలా అవసరం.

రాస్ ఐలాండ్ - బ్రిటిష్ పాలనా కేంద్రం

రాస్ ఐలాండ్ చేరుకున్నాము. రెండు కిలోమీటర్ల విస్తీర్ణం. అప్పటికే చాలా అలసిపోయి ఉండడం వలన బ్యాటరీ కారులో వెళ్ళాము. అండమాన్ దీవులలో రాస్ దీని చారిత్రకమైనది. ఒకప్పుడు బ్రిటిష్ వారు ఇక్కడి నుంచే తమ పాలన సాగించారు. మేము మొదటిరోజు సెల్యులార్ జైలులోని ప్రత్యేక గ్యాలరీలో చూసిన ఫోటోలలో ఉన్న భవనాల ఆనవాళ్లు రాస్ ఐలాండ్ లో ఉన్నాయి. వాటిని పోల్చుకుంటూ ముందుకు సాగాము. అలా అప్పటి బ్రిటిష్ వాళ్ళ రెసిడెన్సీ, చర్చి, లైబ్రరీ, ఆఫీసు భవనాల మొండి గోడలు ప్రస్తుతం అక్కడున్నాయి. అప్పట్లో అక్కడ 500 మంది నివసించే వారట. రాస్ ఐలాండ్ లోని మరో ఆకర్షణ.... విచ్చలవిడిగా తిరుగుతున్న జింకపిల్లలు. వాటితో మనం ఆడుకోవచ్చు... వాటి వెనక పరుగులు పెట్టొచ్చు... ఫోటోలు తీసుకోవచ్చు. వెనక వైపుగా మెట్లు దిగి కిందకు వెళితే సముద్రతీరం. ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు అక్కడి నుంచే కాబోలు పడవలలో బయటకు వెళ్ళేవారు. తిరిగి పోర్ట్ బ్లెయిర్ చేరుకునే సరికి రాత్రి అయింది. మధ్యాహ్నం లంచ్ కొబ్బరినీళ్ళతో సరిపెట్టాం కాబట్టి తొందరగా డిన్నర్ ముగించి గదుల్లో దూరిపోయాము.

కాలాపత్తర్, రాధానగర్ బీచ్‌లు

ఉదయం 5.30 లకు హావలాక్ ఐలాండ్ కు వెళ్ళాము. పోర్ట్ బ్లెయిర్ నుంచి 57 కిమీ దూరం. మా ఐటినర్లో ఉన్నది రాధానగర్ బీచ్ మాత్రమే. ఎల్ఫెంట్ బీచికి ప్రవేశ రుసుము ఒకరికి రూ.1000/ అదనం. అయినా మేము దానికి వెళ్లాలని అనుకున్నాము. కానీ సమయం సరిపోదని చెప్పారు. అందుకని మేము కాలాపత్తర్ బీచ్ కు వెళ్ళాము. అక్కడ హిందీ సినిమా షూటింగ్స్ చాలా జరిగాయని చెప్పారు. అక్కడి నుంచి రాధానగర్ బీచ్ కు వచ్చాము. ఆసియా ఖండంలో ఉన్న మొదటి పది బీచ్ లలో అది ఒకటట. సాయంత్రం దాకా అక్కడే గడిపి పోర్ట్ బ్లెయిర్ చేరుకున్నాము.

పోర్ట్ బ్లెయిర్.. నావెల్ మెరైన్ మ్యూజియం

ఉదయమే పోర్ట్ బ్లెయిర్ నగర పర్యటన మొదలు పెట్టాము. ముందుగా సముద్రికా నావెల్ మెరైన్ మ్యూజియం కు వెళ్ళాము. అక్కడ నాలుగైదు గదులలో ఆ దీవులలోని ఆదివాసీల జీవన విధానానికి సంబంధించిన వివరాలు, మోడల్స్, ఎరుపు, తెలుపు, పసుపు, నీలం ఇలా రంగు రంగుల కోరల్స్ ఉన్నాయి. ప్రవేశరుసుము ఒక్కరికి ₹ 50/. అక్కడినుంచి చాతన్ కలప మిల్ కు వెళ్ళాము. అది ఆసియాలోనే పెద్దది. పురాతనమైనది. దానిని 1883 లో ప్రారంభించారు. అండమాన్ వృక్షంగా పిలువబడే పడౌక్ చెట్టు కలపను అందమైన, నాణ్యమైన కళాకృతులను చేయడానికి ఉపయోగిస్తారు. ఇది చాలా ఖరీదైనది కూడా... ఈ కలప కొత్తగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటుంది. ఏళ్ళు గడిచేకొద్దీ లోహం కంటే దృఢంగా తయారీతుంది. మిల్లు లోపల ఊతంగా పెట్టిన స్తంభాలు పడౌక్ వృక్షాలవే ఉన్నాయని గైడు చూపించింది. పలురకాల కలప దుంగలు ఆ ప్రాంతంలో ఉన్నాయి. 1857లో ప్రథమ స్వాతంత్రోద్యమములో ప్రాణాలు కోల్పోయిన 250 మంది అమర వీరుల స్తూపం ఆ ప్రాంగణంలో ఉన్నది. ఇప్పటికీ మార్చి ఒకటో తేదీన వాళ్ళ జ్ఞాపకార్థం అక్కడ ఉత్సవం జరుగుతుందట. వారిని అండమాన్ కు తీసుకువచ్చిన ఆ తేదీనే ఉత్సవాన్ని జరుపడానికి ప్రభుత్వం నిర్ణయించిందని గైడ్ లావణ్య చెప్పింది. ఇలాంటి స్తూపాలు పోర్ట్ బ్లెయిర్ లో రెండు మూడు చోట్ల చూసాము. ఆ ప్రాంగణంలో యుద్ధ కాలం నాటి బంకర్, బాంబు పడిన చోటు కూడా ఉన్నాయి. రెండు మూడు షిఫ్టుల్లో ఇప్పటికీ చాతన్ కలప మిల్లు పనిచేస్తోంది.

ఫిషరీస్ మ్యూజియం.. అరుదైన చేపల

మధ్యాహ్నం లంచ్ హోటల్ లో ముగించి కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ మూడు గంటలకు బయలుదేరాము. ఫిషరీస్ మ్యూజియం చూశాము. అండమాన్ సముద్ర గర్భంలో దొరికే వివిధ జలచరాల నమూనాలు చూసాము. ఆవు, పంది, పాము, ఆకారాల్లో ఉన్న చేపలు ఇన్క్యూబలేటర్లలో పెట్టి ఉన్నాయి. నేనైతే ఇలాంటివి ఇప్పటివరకు ఏ ఎక్వీరియంలోనూ చూడలేదు. అక్కడి నుంచి ట్రైబల్ మ్యూజియం కు వెళ్ళాము. ఆదివాసీలు ఉపయోగించే ఆయాధాలు, వాళ్ళ జీవనవిధానం, సంగీత వాయిద్యాలు, వారి ఇళ్ళ నమూనాలు మొదలైనవి అక్కడ ఉన్నాయి. ఆదివాసీలపై తీసిన డాక్యుమెంటరీ సినిమా కూడా చూసాము. అక్కడ నుంచి సైన్సు మ్యూజియం లోకి పోయాము. అది ఏమంత గొప్పగా లేదు. హైదరాబాద్ లోని బిర్లా సైన్సు మ్యూజియమే చాలా బాగుంటుంది. ఒక ఎత్తైన కొండపైనుంచి అండమాన్ ఎయిర్ పోర్ట్ రన్ వే చూసాము. రెండు విమానాలు మాత్రమే ఆగడానికి అవకాశమున్నది. చిడియాటాపు మీదుగా ముండా పర్వత్ కు వెళ్ళాము. అది చాలా అందమైన సముద్ర తీరం. పేరుగురించి గైడ్ మాల్యాద్రిని అడిగితే ఇదివరకు అక్కడ ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకునే వారని అందుకే ఆ పేరు వచ్చిందని చెప్పాడు. సునామీ తరువాత అక్కడ ఉండడానికి సాయంత్రం ఐదు గంటలవరకే అనుమతిచ్చారట. ఐదు అయిందంటే పోలీసులు ఈలలు వేస్తూ జనాలను పంపించి వేస్తున్నారు. చిడియాటాపు సూర్యుడు అస్తమించే దృశ్యాన్ని చూసే ప్రదేశం. మేము కూడా అక్కడికి వచ్చి చాలా సేపు వేచి చూసాము. సూర్యుడికి మాకు మధ్యలో మబ్బులు అడ్డం వచ్చాయి.

జరావా తెగను చూడవచ్చంతే

మా అండమాన్ నికోబార్ ప్రయాణంలో అది చివరి రోజు. చాలా కీలకమైన రోజు. ఉదయమే మూడు గంటలకు బారతాంగ్ ఐలాండ్ కు బయలు దేరాము. మేము చెక్ పోస్ట్ దగ్గరకు వెళ్ళే సరికే మా ముందు చాలా వాహనాలున్నాయి. ఆరుగంటలకు గేటు తెరుస్తారట. మా వాహనం క్రమ సంఖ్య 49. అంటే మా ముందర అప్పటికే 48 వాహనాలు వచ్చి ఆగాయన్నమాట. గేటు తెరవడానికి గంటపైన టైముంది. తరువాత బారతాంగ్ చేరేదాకా మధ్యలో ఎక్కడా ఆగడానికి కుదరదని, టీ, కాఫీ లాంటి అవసరాలు ముగించుకొని గైడ్ మాల్యాద్రి సూచించాడు. నేను కిందకు దిగి, కాఫీ తాగి, గేటు దాకా ఉదయపు నడక మొదలు పెట్టాను. దాదాపు రెండు కి.మీలు. దూరం. పొగమంచులో ప్రశాంతమైన వాతావరణంలో ఆ నడక మనసుకు శరీరానికి ఉత్సాహాన్నిచ్చింది. అక్కడి నుంచి దట్టమైన అడవిలో వాహనం ముందుకు సాగుతోంది. ఆ ప్రాంతంలో జరావాలు అనే ఆదివాసీలు ఉంటారట. వాళ్ళు కనిపిస్తారేమోనని అందరూ ఉత్సాహంగా చూస్తున్నారు. ఒకచోట ఇద్దరు మగవాళ్ళు ఒక మహిళ కనిపించారు. మహిళ ఒక పురుషుడు అర్థనగ్నంగా ఉన్నారు. మరొకతను ప్యాంటు షర్టు వేసుకొని ఉన్నాడు. మరికాసేపటికి ఐదారుగురు చిన్నపిల్లల గుంపు కనిపించింది. ఐదారేళ్ల వయసున్న పిల్లలు. ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకాసేపటికి ఇద్దరు పురుషులు ట్రక్కులో వెళుతూ కనిపించారు. తిరుగు ప్రయాణంలో ఒకచోట ముగ్గురు పురుషులు కూర్చుని ఉన్నారు. వాళ్ళ పక్కన బల్లాలు కూడా ఉన్నాయి. ముందుగానే మమ్మల్ని హెచ్చరించి ఉండడం వలన ఎలాంటి సైగలు, ఫోటోలు తీయలేదు. సఫారీలో క్రూరమృగాలను చూడడానికి వెళ్ళినట్లుగా మనుషులను చూడడానికి వెళుతున్నామన్న బాధ లోలోపల నన్ను వేధించింది. తరచి చూడగా అండమాన్ టూరిజం శాఖ వాళ్ళను ప్రదర్శనకు పెట్టిందేమో అనే సందేహం నాకు కలిగింది.

సెంటినెలీస్ దీవిలోకి వస్తే ప్రాణాలు హరీ...

అండమాన్ నికోబార్ దీవులలో ఒంగే, జరావా, జాంగిల్, సెంటినెలోస్, నికోబారీస్ అనే ఐదు ప్రధాన ఆదివాసీ తెగలున్నాయి. వారిలో నికోబారీస్ చదువుకొని డాక్టర్, లాయర్, లాంటి వృత్తులలో ఉన్నారట. కానీ వాళ్ళు తను నికోబార్ ఐలాండ్ కు పోయినప్పుడు మాత్రం విధిగా తను సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తారట. నికోబార్ లో ఉన్నత పాఠశాల కూడా ఉన్నదట. ఆపై చదువులకు మాత్రం అండమాన్ రావలసిందే.... ఇంగ్లీషు, హిందీ మాధ్యమాలలో బోధన ఉంటుందట. ఉద్యోగాలలో యాభైశాతం రిజర్వేషన్ వారికి అండమాన్ ప్రభుత్వం కల్పించిదట. వాళ్ళలాగే జరావా ఆదివాసీలను కూడా అభివృద్ధి చేయవచ్చు కదా? అండమాన్ ప్రభుత్వం అని మాల్యాద్రిని అడిగాను. ప్రభుత్వం జరావాల ప్రాథమిక అవసరాలు తీరుస్తుంది కానీ చదువులో ప్రోత్సహించడం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉద్యోగాలలో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే ఉన్న కొద్దిపాటి ఉద్యోగాలలో అది సాధ్యం కాదు. అక్కడ స్థిరపడ్డ తమ లాంటి స్థానికులకు నష్టం జరిగే అవకాశం ఉంది అని అభిప్రాయపడ్డాడు మాల్యాద్రి. వీళ్ళలో సెంటినెలీస్ ఆదివాసీ తెగ సెంటెనల్ ఐలాండ్ లో ఉంటుందట. 2010 జనాభా లెక్కల ప్రకారం ( ఎయిర్ సర్వే ) వాళ్ళు 50 మంది మాత్రమే ఉన్నారట. వాళ్ళ దీవిలోకి కొత్తవాళ్ళు ఎవరు వచ్చినా చంపేస్తారట. అలాంటి సంఘటన ఒకటి ఆమధ్య జరిగి వార్తల లోకి ఎక్కింది కూడా....

ప్రకృతి అద్భుతం లైమ్ స్టోన్ గుహ

బారతాంగ్ చేరాక ఫెర్రీలో 15 ని.లు ప్రయాణించి మరోచోటుకు వెళ్ళాము. అక్కడినుంచి స్పీడు బోటులో 20 ని.లు ప్రయాణించి, రెండు కిలోమీటర్లు నడిస్తే ..... సహజ సిద్ధంగా ఏర్పడ్డ లైమ్ స్టోన్ గుహను చేరుకోవచ్చు. ప్రకృతి సృష్టించిన అద్భుతాలులో ఇది ఒకటి. ప్రకృతి వైపరీత్యం వల్లనో, మానవ తాకిడి వల్లనో కానీ చాలా వరకు నల్లబడి పాడైపోయింది. వంద మీటర్ల గుహ మాత్రం సహజసిద్ధంగా తెల్లగా ఉన్నది. సహజంగా ఏర్పడ్డ అనేక రకాల ఆకారాలను టార్చ్ లైటు వెలుగులో యాత్రికులకు గైడులు చూపిస్తున్నారు. ఆ లైట్ వెలుగులో లైమ్ స్టోన్ అందంగా తళ తళా మెరిసి పోతూ ఉన్నది. అది అలా అంత అందంగా ఎన్నాళ్లు ఉంటుందో.....గైడులు హెచ్చరిస్తున్నా.... మనుషులు కదా:.... చేతితో తాకకుండా ఉండలేక పొతున్నారు.

మట్టి అగ్ని పర్వతం

అక్కడి నుంచి తిరిగి వచ్చి మేము మరో చిన్న వాహనంలో మడ్ వాల్కనో ( మట్టి అగ్ని పర్వతం ) చూడడానికి వెళ్ళాము. మట్టి, నీరు, వాయువుల విస్ఫోటనం ద్వారా అది ఏర్పడింది. కొన్నిసార్లు అనేక భౌగోళిక చర్యలు కూడా మట్టి అగ్నిపర్వతాలు ఏర్పడడానికి కారణం కావచ్చు. అలాంటివి చైనాలో చాలా ఏర్పడ్డాయని అక్కడ రాసి వుంది. మేము వెళ్ళి నప్పుడు అక్కడ బురదలో బుడగలు రావడం గమనించాను. అయితే బురద అగ్నిపర్వతాలు నిజమైన అగ్నిపర్వతాల లాగా ప్రమాదకరమైనవి కావు. ఎందుకంటే అవి లావాను ఉత్పత్తి చేయవు. వాటి పరిమాణం కూడా చాలా చిన్నగా ఉంటుంది.

జాపాక సుభద్ర బంధువు భద్రయ్యగారు మేము ఎయిర్ పోర్ట్ లో దిగినప్పుడు ఆమెను కలవడానికి వచ్చారు. ఆయన నేవీలో పని చేస్తారు కాబోలు మాకు వార్ షిప్ చూసే ఏర్పాటు చేస్తానని చెప్పారు. నేను చాలా ఉత్సాహపడ్డాను. ఎందుకంటే అలాంటివి ప్రత్యేక అనుమతితో మాత్రమే చూడడానికి వీలవుతుంది. కానీ సమయాభావం వలన మాకు వచ్చిన సదవకాశాన్ని వినియోగించుకోలేక పోయాము. అది నాకు ఇప్పటికీ కొంచెం వెలితిగా, బాధగానే ఉంది.

మా బృందంలో రచయిత్రులు, ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు ఉండడం వలన ఈ ప్రయాణం ప్రత్యేకంగా సాగింది. ఆనందంతోపాటు జ్ఞానాన్ని ఆర్జించుకొని సంతోషంగా వెనుదిరిగాము.

గిరిజ పైడిమర్రి

ట్రావెలర్

99494 43414

Advertisement

Next Story