‘నల్లమల అడవులను అదానీకి అప్పగించే కుట్ర’

by GSrikanth |
‘నల్లమల అడవులను అదానీకి అప్పగించే కుట్ర’
X

దిశ, తెలంగాణ బ్యూరో: నల్లమల ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలన్న బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు కే. లక్ష్మణ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా గిరిజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం సుందరయ్య పార్క్ వద్ద కేంద్ర బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నల్లమల అడవులను అదానీకి కట్టబెట్టేందుకు కుట్రలో భాగంగానే లక్ష్మణ్ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నల్లమల ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నదని అన్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కువెల్లిందన్నారు.

ప్రజా పోరాటాలకు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరోసారి యురేనియం తవ్వకాలను అదానీ గ్రూపుకు కట్టబెట్టేందుకు సిద్ధపడిందని ఆరోపించారు. యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని, అనుమతి ఇస్తే ఆ ప్రాంతమంతా అభివృద్ధి అవుతుందని లక్ష్మణ్ వ్యాఖ్యానించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. దీనిని ప్రజాస్వామ్యవాదులు, గిరిజన, ప్రజా సంఘాలు ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.ధర్మ నాయక్, ఆర్ శ్రీరాం నాయక్, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed