చిన్న పిల్లలపై కుక్కలు దాడులు చేస్తుంటే.. అధికారులు ఏం చేస్తున్నారు?

by M.Rajitha |
చిన్న పిల్లలపై కుక్కలు దాడులు చేస్తుంటే.. అధికారులు ఏం చేస్తున్నారు?
X

దిశ, వెబ్ డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చిన్న పిల్లలపై కుక్కలు వరుస దాడులు చేస్తుంటే జీహెచ్ ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు? అంటూ టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజుల నుంచి కుక్కల దాడులు పెరుగుతున్నా, అధికారులు నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేవలం స్టెరిలైజ్ చేసి వదిలిపెట్టడం పరిష్కారం కాదన్నారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలో రోజూ ఏదో ఒక చోట వీధి కుక్కలు ప్రజలపై, పిల్లలపై దాడి చేయడం, గాయపరచడం, ప్రాణాలు తీయడం దారుణమన్నారు. జంతు హింస తగదని చెప్పడం పక్కకు పెడితే, ఈ మానవ హింస మాటేమిటి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. కుక్కకున్న విశ్వాసం మనిషికి లేదనడం నిజమే కానీ, విచ్చలవిడి తనాన్ని ఉపేక్షించడము తగదని నొక్కి చెప్పారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమా? కాదా? ఆలోచించాల్సిన అవసరం ఉన్నదన్నారు. హైకోర్టు కూడా ఇదే విషయాన్ని వివరించినట్లు నిరంజన్ గుర్తు చేశారు. వెంటనే కుక్కల దాడులు అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన జీహెచ్ఎంసీ అధికారులను కోరారు.



Next Story