మాజీ మంత్రి కొప్పుల మాటల్లో నిజం లేదు: ఎమ్మెల్యే అడ్లూరి

by Aamani |
మాజీ మంత్రి కొప్పుల మాటల్లో నిజం లేదు: ఎమ్మెల్యే అడ్లూరి
X

దిశ, వెల్గటూర్: రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం వల్ల విష జ్వరాల బారిన పడి ప్రజల ప్రాణాలు పోతున్నాయి. తక్షణమే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియా సమావేశంలో చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ధర్మపురి ఎమ్మెల్యే విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. మాజీ మంత్రి కొప్పుల మాటల్లో నిజం లేదని, కరోనా కాలంలో వేలాది మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్న మీరు మీ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదన్నారు. అలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి విద్యా వైద్య ఆరోగ్య శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టి మెరుగైన వైద్యాన్ని అందించడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ధర్మపురిలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడ్లూరి మాట్లాడుతూ.. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల జ్వరంతో ప్రజలు బాధపడుతున్నారు. ఎక్కడికక్కడ వారిని గుర్తించి సరైన వైద్యం అందించడానికి కృషి చేస్తున్నాము. ఇందులో భాగంగా త్వరలోనే ధర్మపురి తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసి విష జ్వరాలను అదుపులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీ లో చేర్చకుండా ప్రజలను గాలికి వదిలేసిన మీరు వైద్యం గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. మాత శిశు ఆసుపత్రిని ప్రజలకు ఎందుకు అందుబాటులో తీసుకురాలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ఖజనాను మొత్తం ఖాళీ చేసి రాష్ట్రాన్ని మాకు అప్పగించారు. అయినప్పటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి తరహాలో ఎందుకు ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు. మీలాగా ధర్మపురిని వరదల్లో ముంచి చేతులు ముడుచుకొని కూర్చోలేదని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దినేష్, శైలేందర్ మొగిలి కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed