సెప్టెంబర్ 17పై వివాదం ఎందుకు? చరిత్రలో అసలు ఏం జరిగింది?

by karthikeya |
సెప్టెంబర్ 17పై వివాదం ఎందుకు? చరిత్రలో అసలు ఏం జరిగింది?
X

సెప్టెంబరు 17... తెలంగాణ చరిత్రలో ఎప్పుడూ వివాదాస్పదమే. విలీనం, విమోచనం, విద్రోహం, సమైక్యత.. ఇలాంటి అనేక వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉంటాయి. 1948 సెప్టెంబరు 17న నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోయారా? హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్‌లో విలీనం చేశారా? కేవలం తన సైన్యాన్ని మాత్రమే అప్పగించారా? 1950 జనవరి 26 వరకూ హైదరాబాద్ రాష్ట్రం భారత్‌లో అంతర్భాగమే కాదని సుప్రీంకోర్టు ఎందుకు వ్యాఖ్యానించింది? భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26కు హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధమేంటి? అప్పటివరకూ హైదరాబాద్‌‌ను పాలించిందెవరు? నిజాం నవాబు రాజ్‌ప్రముఖ్‌గా ఎందుకు కొనసాగాల్సి వచ్చింది? నిజాం లొంగిపోయిన తర్వాత కూడా ఆపరేషన్ పోలో ఎందుకు జరిగింది? మిలిటరీ జనరల్‌గా ఉన్న జేఎన్ చౌదరి, ఆ తర్వాత ఐసీఎస్ అధికారి వెల్లోడికి సీఎం బాధ్యతలు, ఎన్నికలే లేకుండా ఆ పదవిని కట్టబెట్టడం... ఇలాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : నిజాం పాలనలోని హైదరాబాద్ రాష్ట్రం 1948 సెప్టెంబరు 17న పటేల్ నేతృత్వంలోని భారత యూనియన్ ప్రభుత్వంలో విలీనమైందని, నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిందన్నది బీజేపీ వాదన. స్వతంత్ర భారత్‌లో అంతర్భాగంగా మారిందనేది టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల వాదన. సాయుధ తెలంగాణ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టులను గద్దెనెక్కనివ్వకుండా పటేల్ చేసిన విద్రోహమనేది వామపక్ష పార్టీల వాదన. ఇప్పుడు పోటీ పడి మరీ ఆ పార్టీలు, వాటి నేతృత్వంలోని ప్రభుత్వాలు వేర్వేరు పేర్లతో, విడివిడిగా ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఏడున్నర దశాబ్దాలుగా లేని వేడుకలు ఈసారి ఉనికిలోకి రావడంతో ఆ రోజుకు ముందు, తర్వాత ఏం జరిగిందో పరిశీలిద్దాం...

భారత్, నిజాం మధ్య 'స్టాండ్‌స్టిల్ అగ్రిమెంట్'

బ్రిటీషు పాలన నుంచి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నిజాం నవాబులో గుబులు మొదలైంది. మతాల ఆధారంగా పాకిస్తాన్, భారత్ వేర్వేరు దేశాలుగా ఏర్పడినందున దేనిలోనూ భాగం కాకుండా స్వతంత్ర దేశంగానే కొనసాగుతానంటూ కామన్‌వెల్త్ దేశాలకు ప్రతిపాదన పెట్టారు. యూరోపియన్ దేశాలతో వ్యాపార సంబంధాలను కొనసాగించడానికి తీరప్రాంతం లేనందున గోవాను లీజుకు తీసుకోడానికి పోర్చుగీసుతో ప్రయత్నాలు జరిపారు. కానీ ఇవేవీ సాకారం కాలేదు. హైదరాబాద్ రాష్ట్రాన్ని (సంస్థానం) విలీనం చేయడానికి చర్చల మార్గాన్ని అనుసరించాలనే ప్రతిపాదనలను ప్రధాని నెహ్రూ ప్రస్తావించి చిట్టచివరి ప్రయత్నంగా మాత్రమే సైనిక చర్యలు ఉండాలని అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా భారత ప్రభుత్వం, హైదరాబాద్ రాష్ట్రం మధ్య 1947లో 'స్టాండ్‌స్టిల్ ఒప్పందం' జరిగింది. ఏడాది కాలం పాటు ఎలాంటి మిలిటరీ చర్యలు లేకుండా యధాతథ స్థితి కొనసాగాలన్నది ఆ ఒప్పందంలోని ప్రధానాంశం.

కానీ ఇరు వైపులా ఆ నిబంధనల ఉల్లంఘన జరిగింది. నిజాం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రజాకార్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్దేశపూర్వకంగానే భారత ప్రభుత్వాన్ని కవ్వించేలా సమాంతరంగా కమ్యూనికేషన్లు, ఆర్మీ తదితరాలను బలోపేతం చేసుకుంటున్నదనే వాదనలు తెరపైకి వచ్చాయి. భారత సైన్యం కూడా హైదరాబాద్ పరిధిలోకి చొరబడింది. మహ్మద్ ఆలీ జిన్నా సైతం భారత ప్రభుత్వం ఒత్తిడి చేస్తే ముస్లింలంతా ఏకమవుతామని చేసిన కామెంట్లు కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మారింది. ఈ ఒప్పందానికి 1947 నవంబరు 29న కాలం తీరిపోయిందని నవాబు వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితి భద్రతామండలిని 1948 ఆగస్టు 21న ఆశ్రయించారు. భారత సైన్యం హైదరాబాద్ స్టేట్ ఆక్రమణకు పాల్పడుతున్నదని పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాలు, న్యాయం ప్రకారం భారత్‌, హైదరాబాద్ రాష్ట్రాల మధ్య వివాదం సద్దుమణగకపోతే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని, ప్రజల జీవితాలు ప్రమాదంలో పడతాయని ఆ ఫిర్యాదులో నిజాం పేర్కొన్నారు.

సైన్యంతో దాడికి దిగడంతో పాటు ఆర్థిక దిగ్బంధనం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. ఇప్పటికే భారత సైన్యం ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, దళాలు గ్రామాల్లోకి చొరబడ్డాయని, హింస కేవలం హైదరాబాద్ రాష్ట్రానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అశాంతికి కారణమవుతుందని పేర్కొన్నారు. భారత సైన్యం చేపడుతున్న చర్యలు హైదరాబాద్ రాష్ట్ర ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితిలో హైదరాబాద్ సభ్యదేశం కాకపోయినా శాంతి కోసం ఆశ్రయించాల్సి వస్తున్నదని నవాబు అందులో పేర్కొన్నారు. భద్రతా మండలిలో చర్చల ప్రక్రియ పూర్తయి చివరకు ఓటింగ్ అనివార్యమైంది. మొత్తం 11 దేశాల్లో చైనా, రష్యా, ఉక్రెయిన్ ఓటింగ్‌లో పాల్గొనకపోవడంతో మిగిలిన 8 దేశాలు నిజాం నవాబుకు అనుకూలంగా ఓటువేశాయి. దీంతో హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్‌లో కలిపేందుకు జరిపిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.

సర్దార్ చొరవతో..

రజాకార్ల అకృత్యాలు, కమ్యూనిస్టుల నాయకత్వంలో గ్రామాల్లో రైతుల సాయుధ దాడులు, భారీ స్థాయిలో ఇరువైపులా జరుగుతున్న ప్రాణనష్టం తదితరాలతో నిజాం సైన్యంలో ఆందోళన మొదలైంది. మరోవైపు భారత యూనియన్ నుంచి వస్తున్న ఒత్తిడి, ఐక్య రాజ్య సమితిలో సమస్య తొందరగా పరిష్కారం కాకపోవడం.. ఇవన్నీ నిజాం నవాబును ఆలోచనల్లోకి నెట్టాయి. ఇంకోవైపు లియాక్ ఆలీ, ఖాసీం రజ్వీలు నిజాం నవాబుకు తెలియకుండానే ఫర్మానాలు జారీచేస్తూ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారనే వార్తలు జనంలోకి వెళ్లాయి. ఇలాంటివి భారత సైన్యానికి అస్త్రాన్ని అందించినట్లయింది. ప్రధాని నెహ్రూ వ్యూహం ఎలా ఉన్నా.. సర్దార్ పటేల్ చొరవ తీసుకుని మిలిటరీ యాక్షన్‌కే సిద్ధమయ్యారు. అప్పటి మేజర్ జనరల్ జేఎన్ చౌదురికి, సైనిక దాడులకు పక్కా ప్లాన్ రూపొందించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సెప్టెంబరు 13 నుంచి భారత సైన్యం హైదరాబాద్ రాష్ట్రాన్ని ఒక్కోవైపు నుంచి చుట్టుముట్టడం మొదలైంది. భారత సైన్యంతో గెలవడం సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చిన నిజాం చివరకు తన ప్రధాని లియాక్ ఆలీని రాజీనామా చేయాల్సిందిగా స్పష్టం చేసి కేబినెట్ రద్దుకు నిర్ణయం తీసుకున్నారు. ఓటమి తప్పదనే భావనతో సెప్టెంబరు 17కు ఒక రోజు ముందే ఇది జరిగిపోయింది. పటేల్ తరఫున భారత ఏజెంట్ జనరల్‌గా ఉన్న కేఎం మున్షీకి ఇదే విషయాన్ని సెప్టెంబరు 17న నవాబు తెలియజేశారు. ఆ ప్రకారం నిజాం మంత్రివర్గం రద్దు కావడం, భారత సైన్యం హైదరాబాద్ రాష్ట్రంలోకి అడుగుపెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది.-

మిలిటరీ పాలనలో హైదరాబాద్ స్టేట్

1948 సెప్టెంబరు 17న నిజాం నవాబు సైన్యం భారత సైన్యానికి పరోక్షంగా లొంగిపోవడం, ప్రధాని సహా మొత్తం మంత్రివర్గం రద్దు కావడంతో భారత యూనియన్‌లో హైదరాబాద్ స్టేట్ లాంఛనంగా విలీనమైనట్లయింది. హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన డెక్కన్ రేడియోలో నిజాం నవాబు తన ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ఇక ఎంతమాత్రం స్వతంత్ర దేశంగా కొనసాగడం సాధ్యం కాదనే సందేశాన్ని ఇచ్చారు. ఆ వెంటనే మేజర్ జనరల్ జేఎన్ చౌదురికి మిలిటరీ జనరల్‌గా బాధ్యతలు అప్పజెప్పారు పటేల్. అదే సమయంలో భద్రతామండలిలో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు సమాచారం ఇచ్చారు. భద్రతామండలిలో మరింత జాప్యం జరిగితే అది సంక్లిష్టంగా మారుతుందన్న ఉద్దేశంతో పటేల్ సైనిక చర్యకే చొరవ తీసుకున్నట్టు చరిత్రకారుల వాదన. హైదరాబాద్ రాష్ట్రం 1948 సెప్టెంబరు 17న భారత్ యూనియన్‌ ఆధీనంలోకి వచ్చినా నిజాం నవాబు మాత్రం రాజ్‌ప్రముఖ్‌గా కొనసాగారు. మిలిటరీ జనరల్ చౌదురి నేతృత్వంలో సైనిక పాలనలో కొనసాగింది. జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారులు (కలెక్టర్లు), ఎస్పీలు సహా కీలకమైన వ్యక్తులందరినీ మార్చాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి అధికారులను తరలించింది కేంద్ర ప్రభుత్వం. నిజాం పాలనలోని పోలీసులు చాలామంది ఉద్యోగాలు వదిలి వెళ్లిపోయారు. దాదాపు ఎనిమిది నెలల పాటు మిలిటరీ పాలనలో సాగిన హైదరాబాద్ రాష్ట్రానికి ఐసీఎస్ అధికారిగా ఉన్న వెల్లోడీని ముఖ్యమంత్రిగా నియమించింది. రాజ్యాంగమూ లేదు.. ఎన్నికలూ లేవు.. అయినా సీఎంగా వెల్లోడీ, రాజ్‌ప్రముఖ్‌గా నిజాం నవాబు 1950 జనవరి 26 వరకూ కొనసాగారు.

భారత్‌లో అంతర్భాగం కాదన్న సుప్రీంకోర్టు

కమ్యూనిస్టుల నాయకత్వంలో జరుగుతున్న రైతుల తిరుగుబాటును పరిగణనలోకి తీసుకున్న మిలిటరీ గవర్నర్ చౌదురి... అధికారం నుంచి తమను కూలదోయడానికి కుట్ర జరిగిందని, కమ్యూనిస్టులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారని, హత్యలకు పాల్పడ్డారని, గ్రామాల్లో సహకరించనివారిని 1948 సెప్టెంబరు 21న కిడ్నాప్ చేశారని, ఆ తర్వాత హత్య చేశారని స్పెషల్ ట్రిబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 1949 ఆగస్టు 9, 12, 13 తేదీల్లో వెలువరించిన వేర్వేరు తీర్పుల్లో వీరికి మరణశిక్షను ఖరారు చేసింది. ఈ తీర్పును సవాలుచేస్తూ కమ్యూనిస్టులు హైకోర్టును ఆశ్రయించారు. వీటిని విచారించిన కోర్టు.. 1949 డిసెంబరు 12-14 తేదీల మధ్యలో పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్టు తీర్పును వెలువరించింది. ఒకవైపు హైకోర్టులో విచారణ జరుగుతుండగానే 1949 నవంబరు 23న రాజ్‌ప్రముఖ్‌గా ఉన్న నిజాం నవాబు భారత రాజ్యాంగం హైదరాబాద్ రాష్ట్రానికి కూడా వర్తిస్తుందని, అందుకు తాను సమ్మతమేనని ఫర్మానా జారీ చేశారు. కానీ అప్పటికి భారతదేశానికి రాజ్యాంగం ఇంకా అమల్లోకి రాలేదు. హైకోర్టు తీర్పును సవాలుచేస్తూ కమ్యూనిస్టులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు స్పష్టమైన అభిప్రాయాలనే వెల్లడించింది. నిజాం పాలనలోని హైదరాబాద్ స్టేట్ 1950 జనవరి 26 వరకూ భారత్‌లో అంతర్భాగం కాదని, ఆ రాష్ట్ర హైకోర్టును కూడా భారత సుప్రీంకోర్టు పరిధిలోకి వచ్చే న్యాయస్థానంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. హైదరాబాద్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుల విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మిలిటరీ పాలనలో హైదరాబాద్

కేంద్ర హోం మంత్రి పటేల్ దూతగా (ఏజెంట్ జనరల్) వచ్చిన మున్షీ ద్వారా నిజాం నవాబు సందేశం పంపిన మరుసటి రోజు (సెప్టెంబరు 18న) మేజర్ జనరల్ చౌదురి సమక్షంలో హైదరాబాద్ స్టేట్ ఆర్మీ లొంగిపోయింది. ఆ వెంటనే చౌదురి మిలిటరీ జనరల్‌గా నియమితులై హైదరాబాద్ పరిపాలనను తన ఆధీనంలోకి తీసుకున్నారు. రాజ్‌ప్రముఖ్‌గా నిజాం నవాబు కొనసాగుతున్నా ఉత్తరప్రత్యుత్తరాలన్నీ ఢిల్లీ నుంచే నడుస్తున్నాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వెల్లోడీ వచ్చినా 1950 జనవరి 26 నుంచి మాత్రమే లాంఛనంగా భారత్‌లో విలీనమైనట్లయింది. పటేల్ చొరవతో భారత ఆర్మీ హైదరాబాద్‌లోకి చొచ్చుకురావడం, నిజాం సైన్యం నీరసపడడం, ఆ తర్వాత నిజాం నవాబు భారత ఏజెంట్ జనరల్ కేఎం మున్షీ ద్వారా పటేల్‌కు సమాచారం పంపడం, భారత ఆర్మీని హైదరాబాద్ రాష్ట్ర పరిధిలోకి రావడానికి నవాబు సమ్మతి తెలియజేయడం, భారత రాజ్యాంగమే హైదరాబాద్ స్టేట్‌కు కూడా రాజ్యాంగంగా వర్తింపజేయడానికి అంగీకారం తెలియజేయడం.. ఇవన్నీ లాంఛనంగా భారత్‌లో అంతర్భాగమైందనటానికి నిదర్శనాలు. విలీనం, విమోచనం, విద్రోహం, జాతీయ సమైక్యతా లాంటివి ఎలా ఉన్నా హైదరాబాద్ మొదలు ఐక్యరాజ్య సమితి వరకు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు, నిజాం నుంచి పటేల్ వరకు జరిగిన చారిత్రక ఘట్టాలు.

నేను రజాకార్‌నే...

'రజాకార్ల అకృత్యాల గురించి ఒక్కొక్కరు ఒక్కో కామెంట్ చేస్తారు. వాస్తవంగా దానికి వాలంటీర్ అని అర్థం. నిజాం చివరి రోజుల్లో ఆయనకు తెలియకుండానే ఖాసిం రజ్వీ, లియాక్ ఆలీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబరు 17కు ఎలాంటి చారిత్రక ప్రాధాన్యతా లేదు. వాస్తవంగా భారత్‌లో హైదరాబాద్ స్టేట్ అంతర్భాగమైంది 1950 జనవరి 26 నుంచే. అందుకే సెప్టెంబరు 17 విమోచనమూ కాదు.. విలీనమూ కాదు.. విద్రోహమూ కాదు.. కేవలం ఆ రోజున మూడు నిర్ణయాలు జరిగాయి. అందులో ఒకటి.. హైదరాబాద్ స్టేట్‌ను ఆధీనంలోకి తీసుకోవడానికి భారత యూనియన్ తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటే ఐక్యరాజ్య సమితి వరకూ వెళ్లి అంతర్జాతీయ అంశంగా మార్చడం. రెండు.. అప్పటికే దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు భద్రతా మండలికి సమాచారం పంపడం. మూడు.. లియాక్ ఆలీ నేతృత్వంలోని కేబినెట్‌ను రద్దు చేయడం. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక్కో పార్టీ ఒక్కో కామెంట్ చేస్తూ ఉంటుంది. కానీ నా దృష్టిలో హిందు-ముస్లిం ఐక్యత కోసం పనిచేసిన రజాకార్‌ను నేను".- కెప్టెన్ (మాజీ) లింగాల పాండురంగారెడ్డి, 11వ గూర్ఖా రైఫిల్ ఇన్‌ఫాంట్రీ ఆర్మీ

Advertisement

Next Story

Most Viewed