330 ప్రైవేట్ కాలేజీలకు అనుమతులు నిల్.. నేటికీ గుర్తింపునివ్వని ఇంటర్‌ బోర్డు

by Shiva |   ( Updated:2024-11-29 02:33:28.0  )
330 ప్రైవేట్ కాలేజీలకు అనుమతులు నిల్.. నేటికీ గుర్తింపునివ్వని ఇంటర్‌ బోర్డు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనలో పడింది. తెలంగాణలోని పలు ప్రైవేట్ యాజమాన్యాలకు ఇప్పటి వరకు అఫిలియేషన్ గుర్తింపు లభించలేదు. కళాశాలలు ప్రారంభమై కొన్ని నెలలు కావస్తున్నా దాదాపు 330 కాలేజీలకు ఇప్పటి వరకు ఇంటర్ బోర్డు అనుమతులు ఇవ్వలేదు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేట్ ఇంటర్ కాలేజీలకు ఈ అనుమతులు ఇవ్వలేదు. మిక్స్ డ్ ఆక్యుపెన్సీ, ఫైర్ కు సంబంధించిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్‌వోసీ) లేకపోవడంతో బోర్డు గుర్తింపు ఇవ్వలేదు. దీంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాగా ఈ అంశంపై పలు ప్రైవేట్ యాజమాన్యాలు చివరికి సర్కారే ఇస్తుందనే ధీమాలో ఉండటం గమనార్హం.

తెలంగాణలో ప్రైవేట్, కార్పొరేట్ కలిపి ౧,497 ఇంటర్ కాలేజీలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు జూనియర్ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి సంవత్సరం మార్చిలో జరిగే పబ్లిక్ ఎగ్జామ్స్ తర్వాత ఇంటర్ కాలేజీల గుర్తింపు ప్రక్రియను ఇంటర్ బోర్డు అధికారులు మొదలుపెడతారు. విద్యాసంవత్సరం మొదలయ్యే నాటికి అంటే జూన్, జూలై వరకు కాలేజీలకు గుర్తింపు ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. అయితే సరైన అనుమతులు లేని కారణంగా ఇప్పటికీ వందల కాలేజీల గుర్తింపును ఇంటర్ బోర్డు ఇప్పటికీ పెండింగ్‌లోనే పెట్టింది. ఇప్పటివరకు 1,167 కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు ఇవ్వగా మరో 330 కాలేజీలకు గుర్తింపు ఇవ్వలేదు. జీహెచ్ఎంసీ శానిటరీ, స్ట్రాచరల్ సౌండ్ నెస్ సర్టిఫికెట్, ఫైర్ ఎన్వోసీ, గ్రౌండ్ లాంటి అనుమతులతో పాటు సబ్జెక్టుల వారీగా టీచర్లు, ల్యాబ్స్, లైబ్రరీ సదుపాయాలు ఉంటేనే ఇంటర్ బోర్డు.. కాలేజీ నిర్వహణకు అనుమతిస్తుంది.

పర్మిషన్ లేకున్నా అడ్మిషన్లు..

ప్రస్తుతం ఇంటర్ బోర్డు అధికారులు పెండింగ్ పెట్టిన కాలేజీల్లో ఒకే బిల్డింగులో వ్యాపార సముదాయాలతో పాటు కాలేజీలు కొనసాగుతున్నాయి. ఇలాంటి మిక్స్ డ్ ఆక్యుపెన్సీ బిల్డింగుల ఎత్తు 15 మీటర్లు దాటితే ఫైర్ అధికారులు ఎన్‌వోసీ ఇవ్వరు. ఆ శాఖ అనుమతి లేకపోవడంతో ఇంటర్ బోర్డు గుర్తింపు ఇవ్వలేదని తెలిసింది. ఇక పలు యాజమాన్యాలు మాత్రం కాలేజీలకు గుర్తింపు లేకపోయినా చివరి క్షణాన ఎలాగైనా వస్తుందనే ధీమాతో ఉన్నాయి. అనుమతి లభించకున్నా ప్రైవేట్ యాజమాన్యాలు అడ్మిషన్లు తీసుకున్నాయి. కాలేజీల గుర్తింపు అంశంపై సరైన అవగాహన లేక తల్లిదండ్రులు తమ పిల్లలను అనుమతుల్లేని కాలేజీల్లో జాయిన్ చేస్తున్నారు.

ముంచుకొస్తున్న ఎగ్జామ్ ఫీజు గడువు

ఏండ్ల తరబడి నడుస్తున్న మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ కాలేజీలకు గత ప్రభుత్వం లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గుర్తింపు ఇవ్వాలని ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు కోరుతున్నాయి. గుర్తింపు పొందని ప్రైవేట్ యాజమాన్యాల ఇష్యూను ఇప్పటికే ఇంటర్ బోర్డు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా మరో వైపు ఇంటర్ ఎగ్జామ్ ఫీజు చెల్లించే అవకాశం వచ్చేనెల 3తో ముగియనుంది. వాస్తవానికి ఈ గడువు నవంబర్ 26వ తేదీన ముగియాల్సి ఉండగా.. పొడిగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ఫైన్ లేకుండా డిసెంబర్ 3 వరకు పెంచింది.

రూ.100 ఫైన్‌తో డిసెంబర్ 4 నుంచి 10 వరకు, రూ.500 ఫైన్తో డిసెంబర్ 11 నుంచి 17 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందని బోర్డు అధికారులు తెలిపారు. రూ.1000 ఫైన్తో డిసెంబర్ 18 నుంచి 24 వరకు, రూ.2వేల ఫైన్తో డిసెంబర్ 25 నుంచి వచ్చే ఏడాది జనవరి 2 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉందని స్పష్టంచేశారు. మరి గుర్తింపు లేని యాజమాన్యాలు సైతం విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయి. కానీ గుర్తింపుపై ఎలాంటి స్పష్టత రావడంలేదు. ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.

Advertisement

Next Story

Most Viewed