ఇథనాల్ లొల్లి‌కి రాజకీయ రంగు

by Aamani |
ఇథనాల్ లొల్లి‌కి రాజకీయ రంగు
X

దిశ,ప్రతినిధి నిర్మల్ : నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ సమీపంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారం రాజకీయ గొడవకు దారి తీసింది.నిన్నటిదాకా ఫ్యాక్టరీ యాజమాన్యం,రైతుల వరకు మాత్రమే పరిమితం అయిన వివాదం తాజాగా రాజకీయ పార్టీల చీకటి ఒప్పందాల ను తెరమీదికి తెస్తున్నది.ఈ పరిణామాలు నిర్మల్ జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలను కుదిపివేస్తున్నది.

అసలు కంపెనీ ఎవరిది..?

దిలావర్ పూర్ మండలం లో పనులు ప్రారంభించిన ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అసలు కంపెనీ ఎవరిది అనే అంశం ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. రైతు ఉద్యమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల జరుగుతున్నదని ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆరోపించాయి.

దీనిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఆ ఫ్యాక్టరీ కి అనుమతి ఇచ్చింది అప్పటి బీజేపీ, బి ఆర్ ఎస్ పార్టీ లేనని ఆరోపించారు. ఇది రాజకీయ దుమారానికి దారితీసింది. రాష్ట్రస్థాయిలో రాజకీయ వివాదం ఎలా ఉన్నప్పటికీ... ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతున్న నిర్మల్ నియోజకవర్గంలో స్థానిక రాజకీయ అగ్గి రాజుకుంది. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సేకరించిన భూమి గతంలో బీజేపీ అగ్రనేతకు చెందినవని ప్రచారం జరుగుతున్నది. అదే క్రమం లో ఫ్యాక్టరీ అనుమతులు ఇచ్చిన సమయంలో అప్పటి బి.ఆర్.ఎస్ అగ్రనేతగా కొనసాగి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేత అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తాజాగా జిల్లా కలెక్టర్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని బ్రేక్ చేసిన నేపథ్యంలో అసలు కలుగులో దాగిన నేతలు ఎవరన్న విషయం బయటకు వస్తుందన్న ప్రచారం మొదలైంది. ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్మాణ పనులు బ్రేక్ వేసిందన్న సమాచారం నేపథ్యంలో పలు గ్రామాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు.గుండంపల్లి గ్రామంలో మహిళలు చేసిన ఉద్యమం ఆ గ్రామస్తులనే విస్మయానికి గురిచేసింది. తాజాగా ఆ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు మహిళల విజయంగా జరుగుతున్న చర్చ ఆలోచింపజేస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed