మిడ్‌నైట్ ఇసుక దందా..కిన్నెరసాని వాగు, గోదావరి నుంచి తరలింపు

by Aamani |
మిడ్‌నైట్ ఇసుక దందా..కిన్నెరసాని వాగు, గోదావరి నుంచి తరలింపు
X

దిశ,బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలకు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. సంబంధిత ప్రభుత్వ విభాగాలు నిఘా పెట్టకపోవడంతోనే కొందరు ఇసుక వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా, ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక దందాను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు..

బూర్గంపాడు మండలంలోని పలు గ్రామాల నుంచి కిన్నెరసాని వాగు, గోదావరి నది నుంచి రాత్రికి రాత్రే రోజుకు పదుల సంఖ్యలో అర్ధరాత్రి నుంచి మొదలుకుని తెల్లవారుజాము వరకు ఇసుక వాహనాలు తరలిపోతున్నాయి. మండలంలోని పలు గ్రామాల శివారుల్లో వ్యాపారులు ఇసుకను నిల్వ చేసి రాత్రి వేళల్లో వాహనాల్లో తరలిస్తున్నట్లు సమాచారం. ఇసుక వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి నుంచి మొదలుకుని తెల్లవారుజాము వరకు జన సంచారం లేని సమయంలో యథేచ్చగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. రాత్రి వేళల్లో పలు గ్రామాలల్లోని కాలనీల నుంచి ఇసుక ట్రాక్టర్లు, వాహనాలు వెళ్తున్నాయని, వాహనాల శబ్ధానికి నిద్ర పట్టడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇసుక వాహనాలు ఓవర్‌ స్పీడ్‌తో వెళ్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల అవసరమే పెట్టుబడిగా..

ఇసుక రవాణా సక్రమమే అయితే పగటి వేళల్లో తరలించకుండా రాత్రి వేళలో ఎందుకు తరలిస్తున్నారని పలు గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు తనిఖీలు చేసి, ఇసుక, వాహనాలను స్వాధీనం చేసుకుని, నామమాత్రపు జరిమానాలు విధిస్తూ వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో ఇంటి నిర్మాణ పనులు చేసుకునే వారి అవసరాలను ఆసరాగా చేసుకుని, ఇసుక వ్యాపారులు ఒక్కో ట్రాక్టర్‌ ట్రిప్పునకు రూ.వేల నుంచి రూ.6వేల వరకు వసూలు చేస్తున్నారని తెలిసింది.

చోద్యం చూస్తున్న అధికారులు..

బూర్గంపాడు మండలంలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed