MP Raghunandan Rao: హైడ్రా నిష్పక్షపాతంగా ముందుకు సాగాలి..

by Sumithra |   ( Updated:2024-09-09 13:57:19.0  )
MP Raghunandan Rao: హైడ్రా నిష్పక్షపాతంగా ముందుకు సాగాలి..
X

దిశ, దుబ్బాక : హైడ్రా తన పనితీరును నిష్పక్షపాతంగా ముందుకు సాగకపోతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పదవి నుంచి దిగిపోవాలని ప్రజలకు న్యాయం చేయలేని ఏ అధికారులైన, ప్రభుత్వమైన కుర్చిలో కూర్చుండే నైతిక హక్కు లేదని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పేర్కొన్నారు. సోమవారం దుబ్బాక పట్టణ పరిధిలోని చెల్లాపూర్ వేణుగోపాల స్వామి ఆలయంలో సీసీ బెడ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. హైడ్రాను హైదరాబాద్ కు పరిమితం చేయకుండా జిల్లాలకు, గ్రామాలకు విస్తరించాలని కోరారు. ఎఫ్టీఎల్, బఫర్ జోస్లో నిర్మించుకున్న ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం మాటమార్చకుండా, బ్యాంకులోన్లు ఉన్నా, పదేండ్లుగా ఆ ఇళ్లలో నివాసం ఉంటున్నా నూటికి నూరు శాతం కూలకొట్టాల్సిందేనన్నారు.

రాష్ట్ర రాజధానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిష్పక్షపాతంగా క్లీయర్ చేయాలన్నారు. తెలిసో తెలియక కొంత మంది పేద కుటుంబాలు చెరువుల్లో నిర్మించుకున్న ఇళ్లకు బదులుగా కోకాపేట ప్రాంతాల్లో ప్లాట్లను కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి పై ఉందన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను అక్రమించి నిర్మించుకున్న ఇళ్లను కూల్చి వేయాల్సిందేనని, హైడ్రాను జిల్లాలకు విస్తరించాలని ప్రతిపక్షాలు, ప్రజల నుంచి డిమాండ్ వస్తోందని, దీని పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని ఎంపీ మాదవనేని రఘునందన్ రావు సూచించారు. బఫర్ జోన్లోలోని ఇళ్లను కూల్చి వేస్తామని లాంటి ప్రకటనలు రావడం పై పలు అనుమానాలకు తావిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. హైడ్రా పనితీరుపై ప్రజలు గమనిస్తున్నారని, చెరువులను అక్రమించిన వారిలో ఎన్ని పెద్ద తలకాయలున్నా ఉపేక్షించొద్దన్నారు.

చెల్లాపూర్ గ్రామంలో మల్లన్న సాగర్ ప్రధాన కాల్వ నిర్మాణంతో పొలాల వద్దకు వెళ్లడానికి చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామ రైతులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన ఎంపీ సంబంధిత డీఈతో మాట్లాడి కాల్వ పై బ్రిడ్జీని నిర్మించి రైతులు రాకపోకలు సాగించేటట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కిష్టమ్మ గారి సుభాష్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్తు తిరుమల్ రెడ్డి, దూలం వెంకట్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకోజి ప్రవీణ్ కుమార్, పట్టణ దళిత మోర్చా అధ్యక్షుడు గంబీర్ పూర్ కనుక రాజు, పట్టణ దళిత మోర్చా ఉపాధ్యక్షుడు ఆస రాజు, ఆకుల నరేష్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story