వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో సస్పెండ్

by M.Rajitha |
వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో సస్పెండ్
X

దిశ, వెబ్ డెస్క్ : వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వోపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్లో ఆహారం, నీరు అందించడం లేదని అడిగిన వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో విజయలక్ష్మిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. వరదతో సర్వస్వం కోల్పోయిన బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉండాలని.. కోపంలోనో, అసహనంతోనో వారు ఒకమాట అన్నా.. అధికారులు ఓపిక పట్టాలి అని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ సీఎం ఆదేశాలు బేఖాతరు చేస్తూ కొంతమంది అధికారులు వరద బాధితుల పట్ల చిన్నచూపు చూస్తున్నారు. వారితో కఠినంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి అధికారులపై కొరడా ఝుళిపిస్తోంది ప్రభుత్వం. సోమవారం సింగ్ నగర్లో వరద బాధితులపై అకారణంగా చేయి చేసుకున్న వీఆర్వోను విధుల నుండి తొలగిస్తున్నట్టు కృష్ణా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోసారి అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

అసలేం జరిగిందంటే..

విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్లోని షాదీఖాన రోడ్డులో తమకు ఆహారం, నీళ్ళు ఇవ్వడం లేదంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ఈ విషయం గురించి విచారించేందుకు వచ్చిన వీఆర్వో విజయలక్ష్మిని.. ఆహారం, నీళ్ళు ఎందుకు ఇవ్వడం లేదు.. అనేక ఇబ్బందులు పడుతున్నాం.. చిన్న పిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారంటూ బాధితులు నిలదీశారు. కొద్దిసేపు బాధితులకు, వీఆర్వోకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి.. సహనం కోల్పోయిన వీఆర్వో విజయలక్ష్మి ఓ బాధితుని చెంప పగలగొట్టింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో.. పోలీసులు వీఆర్వోను అక్కడి నుండి పంపించి వేశారు. వీఆర్వో పై తక్షణమే చర్యలు తీసుకోవాలని వరద బాధితులు ధర్నాకు దిగారు.

Advertisement

Next Story

Most Viewed