మూడో టెస్టులో శ్రీలంక సంచలనం.. పదేళ్ల తర్వాత ఇంగ్లాండ్‌పై టెస్టు విజయం

by Harish |
మూడో టెస్టులో శ్రీలంక సంచలనం..  పదేళ్ల తర్వాత ఇంగ్లాండ్‌పై టెస్టు విజయం
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ జట్టుకు శ్రీలంక దిమ్మతిరిగే షాకిచ్చింది. రెండు టెస్టులు ఓడిపోయి సిరీస్ కోల్పోయిన శ్రీలంక.. చివరిదైన మూడో టెస్టులో మాత్రం స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసింది. 10 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్‌పై టెస్టు విజయాన్ని అందుకుంది. లండన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో సోమవారం శ్రీలంక 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 325 స్కోరు చేయగా.. శ్రీలంక 263 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో 156 స్కోరుకే కుప్పకూలిన ఇంగ్లాండ్.. శ్రీలంక ముందు 219 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది. టఫ్ టార్గెట్‌ను శ్రీలంక మరో రోజు మిగిలి ఉండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించడం గమనార్హం. అజేయ సెంచరీతో సంచలన ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ పాతుమ్ నిశాంక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఓవర్‌నైట్ స్కోరు 94/1తో నాలుగో రోజు ఆట కొనసాగించిన శ్రీలంకకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓవర్‌నైట్ బ్యాటర్ కుసాల్ మెండిస్(39) వికెట్ పారేసుకున్నాడు. అయితే, మరో ఓవర్‌నైట్ బ్యాటర్ పాతుమ్ నిశాంక వన్డే తరహాలో బ్యాటు ఝుళిపించాడు. 124 బంతుల్లో 127 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఏంజెలో మాథ్యూస్(32 నాటౌట్)తో కలిసి మూడో వికెట్‌కు 111 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి శ్రీలంకను విజయతీరాలకు చేర్చాడు. ఇంగ్లాండ్‌ గడ్డపై 200లకుపైగా లక్ష్యాన్ని ఛేదించిన తొలి ఆసియా జట్టుగా శ్రీలంక చరిత్ర సృష్టించింది. టెస్టుల్లో ఇంగ్లాండ్‌పై శ్రీలంకకు ఇది 4వ విజయం. ఇంతకుముందు 2014లో టెస్టు మ్యాచ్‌ను గెలిచిన ఆ జట్టు.. 10 ఏళ్ల తర్వాత గెలుపు రుచిచూసింది. మరోవైపు, మూడు టెస్టుల సిరీస్‌ 2-1తో ఇంగ్లాండ్ కైవసమైంది.

Advertisement

Next Story

Most Viewed