సిట్టింగ్ ఎంపీలకు టికెట్ కట్! మెదక్ బరిలో KCR?

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-20 03:05:56.0  )
సిట్టింగ్ ఎంపీలకు టికెట్ కట్! మెదక్ బరిలో KCR?
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ సెగ్మెంట్ నుంచి గులాబీ బాస్ కేసీఆర్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మెదక్‌లో పార్టీ పటిష్టంగా ఉండగా ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి కేడర్‌లో మరింత జోష్ నింపాలని భావిస్తున్నారు. ఆ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆర్థిక పరిపుష్టి ఉన్నవారిపై ఫోకస్

బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టిసారించింది. రాష్ట్రంలోని 17 స్థానాలపై కసరత్తు ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం కేడర్‌పై లేకుండా చేయాలని భావిస్తూ అన్ని స్థానాల్లో పాగా వేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నది. ప్రస్తుతం పెద్దపల్లి, నాగర్ కర్నూల్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, మహబూబాబాద్, చేవెళ్ల, వరంగల్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాలు బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. అయితే సిట్టింగ్ ఎంపీల్లో కొంతమందికి పార్టీ టికెట్ ఇవ్వడం లేదని విశ్వసనీయ సమాచారం.

అందులో కొంతమంది పోటీకి ఆసక్తి చూపడం లేదని, వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా నల్లగొండ, భువనగిరి, మల్కాజ్ గిరి, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల కోసం వేటను ప్రారంభించింది. పార్టీ సీనియర్లతో పాటు ఆయా నియోజకవర్గాల్లో ఏ సామాజిక వర్గం బలంగా ఉందని, గతంలో గెలిచిన సామాజిక వర్గాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అన్నీ బేరీజు వేస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు ఖర్చుతో కూడుకున్నవి కావడంతో ఆర్థిక పరిపుష్టి ఉన్నవారిపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది.

హైదరాబాద్ చేరుకున్న ఎంపీలు

రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ నాలుగు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించలేకపోయింది. నల్లగొండ, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాల్లో ఈసారి బలమైన అభ్యర్థులను బరిలో నిలిపాలని భావిస్తున్నది. అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికలకు సంసిద్ధతపై ఎంపీలతో రివ్యూ నిర్వహించనున్నట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాలకు వెళ్లిన ఎంపీలు హైదరాబాద్‌ చేరుకున్నారు. అయితే వారితో కేసీఆర్ బుధవారం భేటీ అవుతారని సమాచారం.

ఇదిలా ఉంటే ఇప్పటికే కొంతమంది ఎంపీలు పార్టీ మారుతారనే ప్రచారం కొనసాగుతోంది. ఈ భేటీలో ఆ అంశాన్ని సైతం ప్రస్తావించేందుకే ఒక్కొక్కరితో వీడిగా మాట్లాడాలని భావిస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, నేతల మధ్య సయోధ్య, చేసిన పనులు అన్నింటిపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. నేతలకు బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్ ఇచ్చిందని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బలోపేతానికి పనిచేయాలని కేసీఆర్ వివరించే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఓటమికి గల కారణాలనూ తెలుసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే అన్నింటినీ బేరీజు వేసుకొని గెలుపే లక్ష్యంగా కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలకు ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed