కేసీఆర్ హాజరుపై ఎట్టకేలకు వీడిన సస్పెన్స్.. అసెంబ్లీలో ఈ సారి రచ్చ రచ్చే..!

by Satheesh |   ( Updated:2024-07-23 14:37:09.0  )
కేసీఆర్ హాజరుపై ఎట్టకేలకు వీడిన సస్పెన్స్.. అసెంబ్లీలో ఈ సారి రచ్చ రచ్చే..!
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు అవుతారా..? లేదా..? అన్నది స్టేట్ పాలిటిక్స్‌లో తీవ్ర ఉత్కంగా మారింది. గత ఫిబ్రవరిలో ప్రభుత్వం నిర్వహించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన గులాబీ బాస్.. ఈ సారైనా బడ్జెట్ సమావేశాలకు హాజరు అవుతారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సెషన్‌కు కేసీఆర్ హాజరు కావడంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరు అవుతారని స్పష్టం చేశారు. అసెంబ్లీ వేదికగానే ప్రభుత్వ వైఫల్యాలను కేసీఆర్ ఎండగడతారని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై సభలో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తామన్నారు. కాగా, హరీష్ రావు తాజా ప్రకటనతో కేసీఆర్ హాజరుపై నెలకొన్న నరాలు తెగే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది.

దీంతో సభలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా టార్గెట్ చేస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఏ అంశాలను లేవనెత్తి అధికార పార్టీని గులాబీ బాస్ ఇరుకున పెడతారని బీఆర్ఎస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉంటు వస్తున్నారు. కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే ఒక్కసారి అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత ఆయన అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడలేదు. ప్రభుత్వం కీలకమైన శ్వేత పత్రాలను అసెంబ్లీలో విడుదల చేసిన కేసీఆర్ మాత్రం లైట్ తీసుకుని సభకు హాజరు కాలేదు. కేవలం కేటీఆర్, హరీష్ రావు మాత్రం ప్రభుత్వానికి కౌంటర్లు ఇచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కానుండటంతో ఈ సమావేశాలపై ఆసక్తి నెలకొంది. సభలో కేసీఆర్ వర్సెస్ రేవంత్ మధ్య మాటల యుద్ధం ఎలా ఉంటుందనేది చూడాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Next Story