సీఎం రేవంత్ రెడ్డి వద్దకు నివేదిక.. 2014 తర్వాత అసలేం జరిగిందో తెలుసా?

by Gantepaka Srikanth |
సీఎం రేవంత్ రెడ్డి వద్దకు నివేదిక.. 2014 తర్వాత అసలేం జరిగిందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్‌లో చెరువులు, నాలాలపై వెలసిన అక్రమ నిర్మాణాలపై అధికారులు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి నివేదిక సమర్పించారు. 2014 తర్వాత ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్రతి చెరువుకు సంబంధించిన పూర్తి వివరాలను సోమవారం సీఎంకు తెలియజేశారు. గ్రేటర్ హైదరాబాద్‌(Greater Hyderabad)లో మొత్తం 920 చెరువులు ఉంటే.. అందులో దాదాపు 225 చెరువులు పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. మరో 196 చెరువులు పాక్షికంగా ఇంక్రోచ్ అయినట్లు పేర్కొన్నారు. గత పదేళ్లలోనే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 24 చెరువులు పాక్షికంగా, 127 చెరువులు పెద్ద మొత్తంలో ఆక్రమణలు జరిగినట్లు నిర్ధారించారు. మరోవైపు హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షణకు హైడ్రా అనే కొత్త వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

అక్రమ కట్టడాల తొలగింపునకు ఇప్పటివరకు వివిధ శాఖల పరిధిలో ఉన్న అధికారాలన్నింటినీ ప్రభుత్వం హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చింది. రెవెన్యూ, నీటిపారుదల, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, పంచాయతీరాజ్‌, రోడ్లు-భవనాల శాఖ.. ఇలా సంబంధిత శాఖలన్నింటి నుంచి హైడ్రా విధి నిర్వహణకు అవసరమైన అధికారాలను ఆ సంస్థకు బదలాయించారు. అంతేకాదు.. హైడ్రా ఆర్డినెన్సుకు రాజ్‌భవన్ ఆమోదముద్ర పడడంతో చట్టబద్ధత వచ్చింది. ఈ క్రమంలో చెరువుల ఆక్రమణలపై అధికారులు సీఎంకు నివేదిక అందించడం చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story