ఆ రూ. 15 కోట్లు ఎక్కడివి? మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో అనుమానాలు

by Sathputhe Rajesh |   ( Updated:2022-03-08 05:42:57.0  )
ఆ రూ. 15 కోట్లు ఎక్కడివి? మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో అనుమానాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి శ్రీనివాస్​గౌడ్​ హత్య కుట్ర కేసులో నిందితులను పోలీస్​ కస్టడీకి అప్పగిస్తూ మేడ్చల్​ కోర్టు అనుమతించింది. నాలుగు రోజుల పాటు విచారించేందుకు సైబరాబాద్​ పోలీసులకు అవకాశం కల్పించారు. మరికొద్దిసేపట్లో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోనున్నారు. ఏ1 నిందితుడు రాఘవేంద్రరాజుతో పాటుగా ఆయన సోదరులు, మార్కెట్​ కమిటీ చైర్మన్​ అమరేందర్​రాజు, మధుసూదన్​రాజు, నాగరాజు సహా మొత్తం 8 మంది నిందితులను పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తమను వేధింపులకు గురి చేశాడని, ఆర్థికంగా ఇబ్బందులపాలు చేయడంతో హత్య చేసేందుకు కుట్ర చేసినట్లు ప్రాథమిక రిపోర్టులో సైబరాబాద్​ పోలీసులు వెల్లడించారు. మంత్రి హత్యకు రూ. 15కోట్లు సుఫారీ ఒప్పందం చేసుకున్నట్లు కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే వారిని అరెస్ట్​ చేసి, మేడ్చల్​ కోర్టుకు తరలించారు. వారిని విచారించాలని మేడ్చల్​కోర్టులో పోలీసులు పిటిషన్​ వేయగా.. సోమవారం విచారించిన కోర్టు నాలుగు రోజుల కస్టడీకి అనుమతిచ్చింది.

ఈ నేపథ్యంలో పోలీసులు విచారణకు సిద్ధమవుతున్నారు. ఎక్కడ చంపాలనుకున్నారు, సుఫారీ గ్యాంగ్​ వివరాలను రాబట్టకోనున్నారు. అంతేకాకుండా మంత్రి హత్యకు సుఫారీ రూ. 15 కోట్లు ఎలా సర్దుబాటు చేస్తారనేదే ఇప్పుడు కీలకంగా మారింది. ఇందులో ఏదైనా రాజకీయ కోణం ఉందా అనే అనుమానాలు సైతం ఉన్నట్లు ముందుగానే పోలీసులు ప్రకటించారు. కానీ, రిమాండ్​ రిపోర్టులో మాత్రం మంత్రి వేధింపులు ఎక్కువవడంతోనే హత్య కుట్ర చేసినట్లు వెల్లడించారు. నిందితుల విచారణ సందర్భంగా ఇవన్నీ బయటకు వచ్చే అవకాశాలున్నాయి. అయితే, పోలీసులు ఏ విధంగా బయటకు లీకులిస్తారనేది మాత్రం సందేహంగానే ఉంది.

మరోవైపు పోలీసులు ఇప్పటి వరకు నిందితులను మీడియా ముందుకు తీసుకురాలేదు. నిందితుల తరుపున కుటుంబ సభ్యులు ఈ హత్య కుట్రను కొట్టి పారేశారు. అంతేకాదు.. నాలుగు రోజుల ముందుగానే మహబూబ్​నగర్​లోని ఇండ్ల నుంచి అదుపులోకి తీసుకుని, కట్టుకథ అల్లి, సుచిత్ర దగ్గర నడిరోడ్డుపై కత్తులతో తిరుగుతుంటే ఆరెస్ట్​ చేశారని చెప్పుతున్నారని, మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ఎన్నికకు సంబంధించిన అఫడవిట్​ కేసు కీలక దశకు వచ్చిన నేపథ్యంలోనే ఈ కథను అల్లారంటూ ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్​ పోలీసుల విచారణ కీలకంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed