ఐఐఎంలు, ఐఐటీలలో ఎస్సీ, ఎస్టీ ఫ్యాకల్టీ లోటు: R. S. Praveen Kumar

by Satheesh |   ( Updated:2023-01-29 10:56:17.0  )
ఐఐఎంలు, ఐఐటీలలో ఎస్సీ, ఎస్టీ ఫ్యాకల్టీ లోటు: R. S. Praveen Kumar
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐఐఎం, ఐఐటీలలో ఎస్సీ, ఎస్టీ ఫ్యాకల్టీ(వైవిధ్యం) లోటు ఉందని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా 9,640 ఫ్యాకల్టీలో కేవలం 23 మంది ఎస్టీలు, 157 మంది ఎస్సీలు మాత్రమే ఉన్నారని అన్నారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ వేదికగా ఓ వార్తా కథనాన్ని షేర్ చేశారు. ఐఐటీలు, ఐఐఎంలలో ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) ప్రాతినిధ్యం తక్కువగా ఉందని.. విద్యాసంస్థల్లో ఈ వర్గాలకు చెందిన ఒక్క లెక్చరర్ కూడా లేరని చెప్పారు. డిసెంబర్‌లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌లో సమర్పించిన నివేదిక ప్రకారం.. 18 ఐఐఎంలలో మంజూరైన 784 ఫ్యాకల్టీ పోస్టులలో కేవలం రెండు మాత్రమే ఎస్టీ వర్గానికి చెందినవి ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.

ఓబీసీ కేటగిరీకి చెందిన 27 మంది సభ్యులు ఉండగా కేవలం ఎనిమిది మంది లెక్చరర్లు మాత్రమే ఉన్నారని, ఎస్సీల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. ప్రస్తుతం ఐఐఎంలలో ఉన్న మొత్తం ఫ్యాకల్టీ సభ్యుల్లో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు కేవలం 6 శాతం మాత్రమే ఉన్నారని, ఐఐటీల పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉందని స్పష్టం చేశారు. మంజూరైన 8,856 మంది అధ్యాపకుల్లో 4,876 మంది జనరల్ కేటగిరీ, 329 మంది ఓబీసీలు, 149 మంది ఎస్సీలు, 21 మంది ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఉన్నారు. ఫలితంగా కొత్త, పాతవి కలిపి 23 ట్రిపుల్ ఐటీలో ప్రస్తుతం ఉన్న ఫ్యాకల్టీలో 9 శాతం మాత్రమే ఎస్సీలు, ఎస్టీలు లేదా ఓబీసీలు ఉన్నట్టు తెలుస్తోంది. మరికొన్ని ఇన్‌స్టిట్యూట్‌లలో అయితే ఎస్సీ, ఎస్టీ లేదా ఓబీసీ ఫ్యాకల్టీ అసలే లేరని వివరించింది.

Advertisement

Next Story

Most Viewed