ఫామ్ ప్లాట్లకూ రైతుబంధు! సాయం కట్ చేస్తే సర్కారుకు ఎంత మిగులుతుందో తెలుసా..?

by Rajesh |
ఫామ్ ప్లాట్లకూ రైతుబంధు! సాయం కట్ చేస్తే సర్కారుకు ఎంత మిగులుతుందో తెలుసా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: జనతా, న్యూ లీఫ్ ఎకో ఫామ్స్, క్రీక్ సైడ్ ఫామ్ ల్యాండ్, గ్రీన్ వ్యాలీ, నీమ్స్ బోరో, జీఎస్ఆర్ ఇన్ఫ్రా.. ఒక్కటేమిటి.. ఇలా వందలాది కంపెనీలు తెలంగాణలో ‘ఫామ్ ల్యాండ్’ బిజినెస్ చేస్తున్నాయి. అందమైన బ్రోచర్లు, కనువిందు చేసే ప్రాజెక్టు వీడియోలతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. రైతుబంధు, రైతు బీమా పేరుతో మార్కెటింగ్ చేస్తున్నాయి. ఇలా రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాలకు పైగా లే అవుట్లు చేసి అమ్మేశాయి. ఇక్కడ రోడ్డు, కరెంటు సౌకర్యం ఉంటుంది. కానీ డీటీసీపీ, హెచ్ఎండీఏ పర్మీషన్లు ఉండవు.

అంతా ఫామ్ ప్లాట్లు, రీసార్ట్ ప్లాట్లు, వీకెండ్ హౌజెస్ పేరిట అమ్మేస్తున్నారు. నాలా కన్వర్షన్ చేయకుండానే వ్యవసాయ భూములను నేరుగా గజాల్లో సొమ్ము చేసుకొని గుంటల్లో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మరోవైపు క్లబ్ హౌజ్ లు, ఫామ్ ప్లాట్లలో ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నాయి. అంతా తెలిసినా రెవెన్యూ, హెచ్ఎండీఓ, కార్పొరేషన్ మున్సిపాలిటీ, పంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోడం లేదు. ఈ నాలుగేండ్లలో గుంట, రెండు గుంటలు, గుంటలోపు వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు లక్షల్లోనే సాగాయని ధరణి పోర్టల్ డేటా స్పష్టం చేస్తున్నది.

క్షేత్ర స్థాయి పరిశీలన అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్ చేస్తుండడంతో అది వ్యవసాయమా, వ్యవసాయేతరమా అన్న కోణంలో చూడాల్సిన అవసరం కూడా తహశీల్దార్లకు లేకుండాపోయింది. ఈ ఫామ్ ప్లాట్లను ఇన్వెస్ట్ మెంట్ పర్పస్ లోనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ భూముల్లో వ్యవసాయం చేయకపోవడం, వీటిని కొనుగోలు చేసిన వారు రైతులు కాకపోవడంతో వీటికి రైతు భరోసా అవసరం లేదన్న వాదన వినిపిస్తున్నది. వీటికి కోత పెట్టడం ద్వారా ఏటా రూ.300 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదా అయ్యే అవకాశమున్నది.

స్టేటస్ సింబల్ కోసమే

రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలకు ఫాంహౌజ్లు ఉన్నాయి. అక్కడ సేద తీరడంతోపాటు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అక్కడే స్పెషలైజ్ మీటింగులు నిర్వహిస్తున్నారు. ఇక్కడే సెటిల్మెంట్లు, ఇతర దందాలు చేస్తున్నారనే చర్చ కూడా ఉన్నది. ఫంక్షన్లు, పెళ్లిళ్లు కూడా ఫాంహౌజ్ లలోనే చేసేందుకు ఇష్టపడుతున్నారు. నగరాల్లో ఉండే వారే కాకుండా.. జిల్లా, మండల కేంద్రాల్లో ఇతర పనులు, వృత్తుల్లో ఉన్న వారు కూడా ఈ కల్చర్ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలోనే రెండు గుంటల వ్యవసాయ భూమి తమకు ఉంటే బాగుంటుందన్న నిర్ణయానికి వస్తున్నారు. అందుకే ఈ నాలుగేండ్లలో అతి తక్కువ భూమితో జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాల సంఖ్య లక్షల్లో పెరిగింది. గుంట నుంచి ఐదు గుంటల వరకు భూ విస్తీర్ణంతో కూడిన రైతుల సంఖ్య పెరిగింది. ఈ స్టేటస్ సింబల్ కోసం ఫామ్ ప్లాట్లు కొనే వారికి పెట్టుబడి సాయం కట్ చేయడం ద్వారా ఎలాంటి నష్టం జరగదనే అభిప్రాయమున్నది.

150 కి.మీ. వరకు..

గేటెడ్ మెగా ప్రాజెక్ట్ పేరిట నారాయణఖేడ్ లో 200 ఎకరాల్లో చేస్తున్నామని జీఎస్ఆర్ ఇన్ఫ్రా గ్రూప్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ విస్తృతంగా ప్రచారం చేసింది. 605 గజాలకు కేవలం రూ.6 లక్షలే (ఆఫర్ ప్రైస్).. పన్నెండేండ్లలో ఏండ్లల్లో రూ.80 లక్షలు మీ సొంతం.. అంటూ జీఎస్ఆర్ ఇన్ఫ్రా మోడరన్ ఫామ్స్ 1, 2 పేరిట విస్తృతంగా పబ్లిసిటీ చేస్తున్నారు. మరోవైపు ‘రైతుబంధు వస్తుంది. భవిష్యత్తు కోసం ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. ప్రకృతితో మమేకం కావచ్చు. కుటుంబ సభ్యులతో ఫామ్ విజిట్ చేయొచ్చు. ప్రభుత్వ మద్దతుతో అగ్రి ఫారెస్ట్రీని ఏర్పాటు చేస్తున్నాం’ అంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. అయితే ఇక్కడ ఫామ్ ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి సైతం రైతుబంధు అందుతున్నది. ఇలాంటి ఫామ్ ప్లాట్ల దందా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, నల్లగొండ, యాదాద్రి, వరంగల్, జనగామ జిల్లాల్లో అత్యధికంగా ఉంది. హైదరాబాద్ కి 150 కి.మీ. దూరం వరకు ఈ దందా జోరుగా సాగుతున్నది.

రైతు బీమా ఎఫెక్ట్

గతంలో ఎక్కువ భూమి కలిగిన రైతులు కూడా వారసుల పేరిట మార్చేస్తున్నారు. ఇంటి యజమాని చనిపోయిన తర్వాత చేసే పంపకాలు బతికుండగానే విరాసత్ చేయించుకుంటున్నారు. కుటుంబ సభ్యులందరి పేరిట భూమి ఉండేటట్లుగా చూసుకుంటున్నారు. రైతుబంధు ఎలాగూ వస్తుంది. కానీ ఏదైనా ప్రమాదం జరిగితే రైతుబీమా భరోసాగా ఉంటుందన్న అభిప్రాయం కూడా నెలకొన్నది. ఫామ్ హౌజ్కల్చర్ తో ఫామ్ ప్లాట్లు కొనుగోలు చేసే వారు కూడా దీన్ని కోరుకుంటున్నారు. ప్రభుత్వం బెనిఫిట్స్ పొందేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఫౌంహౌజ్ పేరిట ప్లాట్లు విక్రయించే వారు కూడా ఇదే ప్రచారం చేస్తున్నారు. మీకు పట్టాదారు పాసు పుస్తకం వస్తుంది. రైతుబంధు సొమ్ము మీ ఖాతాలో పడుతుంది. రైతుబీమాకు అర్హులవుతారంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ప్రస్తుతం రైతుబంధు పొందుతున్న రైతులు

విస్తీర్ణం రైతుల సంఖ్య

ఎకరం లోపు 24,24,870

2 ఎకరాల్లోపు 17,72,675

3 ఎకరాల్లోపు 11,30,788

4 ఎకరాల్లోపు 6,54,419

5 ఎకరాల్లోపు 4,92,568

5 ఎకరాలకు పైగా 4 లక్షలకు పైగానే

మొత్తం 68,75,320

2021 జూలైలో రైతుల సంఖ్య

విస్తీర్ణం రైతుల సంఖ్య

2.20 ఎకరాల్లోపు 39,52,232

2.20 నుంచి 3 ఎకరాలు 4,70,759

3 నుంచి 5 ఎకరాలు 11,08,193

5 నుంచి 7.20 ఎకరాలు 3,49,382

7.20 నుంచి 10 ఎకరాలు 1,15,916

25 ఎకరాలకు పైగా 6000

మొత్తం 60,95,134

ప్రతి ఏడాది పెరుగుతున్న రైతుల సంఖ్య

సంవత్సరం మొత్తం రైతులు

2018–19 50,23,861

2019–20 51,61,022

2020–21 58,01,594

2021–22 60,95,134

2023–24 68,75,320

– అంటే ఏడేండ్లల్లోనే 18.50 లక్షల మంది పెరిగారు.

Advertisement

Next Story

Most Viewed