Deputy CM Bhatti: మొదట తెలంగాణ నుంచే ప్రారంభిస్తున్నాం

by Gantepaka Srikanth |
Deputy CM Bhatti: మొదట తెలంగాణ నుంచే ప్రారంభిస్తున్నాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ ప్రయటనలో భాగంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌(KC Venugopal)తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) శుక్రవారం సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన ప్రక్రియపై వివరణ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంగా గతేడాది రాహుల్‌గాంధీ కులగణనపై స్పష్టమైన హామీ ఇచ్చారని, దేశవ్యాప్తంగా చేపట్టే ప్రక్రియలో భాగంగా తెలంగాణ నుంచే మొదట ప్రారంభిస్తామన్న మాట మేరకు ఈ విధాన నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం(Deputy CM Bhatti Vikramarka) వివరించారు. గత కొన్ని రోజులుగా కులగణన చేపట్టడానికి అనుసరించాల్సిన విధానంపై స్టేట్ బీసీ కమిషన్ కసరత్తు చేస్తున్నదని, ప్రక్రియ సజావుగా, సంతృప్తికరంగా, ఫలితాలు అందించే విధంగా ఉండేందుకు రాష్ట్ర ప్లానింగ్ డిపార్టుమెంటును నోడల్ ఏజెన్సీగా నియమించి నిర్వహిస్తున్నట్లు కేసీ వేణుగోపాల్‌కు వివరించారు. ఈ ప్రక్రియ ద్వారా రానున్న ఫలితాలు, దానికి అనుగుణంగా ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల గుర్తింపు సులభతరం కావడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఫార్ములాను ఫైనల్ చేయడానికి దోహదపడడం... ఇలాంటి అనేక అంశాలను వివరించారు. కులగణన కోసం రూపొందించిన ప్రశ్నావళి, ప్రొఫార్మాను అందజేశారు.

ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కులగణన ఎనిమిది వారాల పాటు (60 రోజులు) జరగనున్నదని, డిసెంబరు 9వ తేదీ నాటికి ప్రభుత్వానికి నివేదిక అందనున్నట్లు కేసీ వేణుగోపాల్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసీసీ సీనియర్ అబ్జర్వర్‌గా పార్టీ హైకమాండ్ నియమించినందున గత వారం జరిపిన పర్యటన వివరాలను కూడా వేణుగోపాల్‌తో పంచుకున్నారు. అక్కడి పరిస్థితులను వివరించి పార్టీపరంగా తీసుకోవాల్సిన చర్యలు, సమన్వయం కోసం రూపొందించాల్సిన మెకానిజం తదితరాలపై కూడా చర్చించినట్లు తెలిసింది. ఇదే విషయమై అజయ్ మాకెన్‌తో కూడా విడిగా భేటీ అయిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభిప్రాయాలను పంచుకున్నారు. సాయంత్రానికి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. త్వరలో కొన్ని రోజుల పాటు జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

సెంట్రల్ ఫైనాన్స్ సెక్రెటరీతో భేటీ :

గత ప్రభుత్వం చేసిన అప్పులు ప్రస్తుతం భారంగా మారడంతో రిలీఫ్ కోసం గత కొంతకాలంగా జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా స్టేట్ ఫైనాన్స్ సెక్రెటరీ ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ ఫైనాన్స్ సెక్రెటరీ, పలువురు అధికారులతో సమావేశమయ్యారు. పాత ప్రభుత్వం చేసిన అప్పుల్లో ‘అసలు’, వడ్డీ చెల్లించాల్సి ఉన్నందున అంచనాలకు మించి భారంగా మారడంతో రుణాలను రీ షెడ్యూలు చేయడంతో పాటు వడ్డీ శాతాన్ని తగ్గించడానికి ఉన్న వెసులుబాటుపైనా చర్చించారు. గత ప్రభుత్వంలో రుణాలు ఇచ్చేటప్పుడు కుదిరిన ఒప్పందంలో రీపేమెంట్ కోసం నిర్దేశించుకున్న గడువును పొడిగించేలా పవన్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ యాజమాన్యాలతో సంప్రదింపులు జరపాల్సిందిగా కోరినట్లు తెలిసింది. గతంలో ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధానిని కలిసినప్పుడు పాత అప్పుల రీషెడ్యూలుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. ఆ కసరత్తులో భాగంగానే స్టేట్, సెంట్రల్ ఫైనాన్స్ డిపార్టుమెంటు అధికారుల మధ్య సమావేశాలు జరుగుతున్నాయి. సెంట్రల్ ఫైనాన్స్ సెక్రెటరీ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed