- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పంద్రాగస్టు ప్రసంగంలో ఆ విషయాన్ని నొక్కి చెప్పిన సీఎం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రం ఏర్పడిన పదేండ్ల తర్వాత ప్రజా పాలన ఏర్పడిందని, ప్రజలందరికీ స్వేచ్ఛ లభించిందని, ఏడో గ్యారంటీగా హామీ ఇచ్చిన ప్రజాస్వామ్య ఫలాలను ప్రజలు అనుభవిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ముందే ప్రజాస్వామ్య స్థాపనను ఏడో గ్యారంటీగా ప్రకటించామని, ఎనిమిది నెలలుగా ఆ స్వేచ్ఛను ప్రజలు ఆస్వాదిస్తున్నారని గుర్తుచేశారు. గతేడాది డిసెంబరు 7న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైమ్ సీఎం హోదాలో గోల్కొండ కోటలో జరిగిన పంద్రాగస్టు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఎగురవేసి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సీఎం హోదాలో రెండుసార్లు విదేశీ పర్యటనల్లో అనేక దేశాలకు తెలంగాణను ‘గేట్ వే’గా పరిచయం చేశామని, విశ్వవేదికపై ‘ఫ్యూచర్ స్టేట్’గా గుర్తింపు లభించిందన్నారు. భవిష్యత్తులో మన రాష్ట్రం మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొనసాగుతున్నదని, ప్రతి ఒక్కరికీ చెందిన ప్రభుత్వమని సీఎం నొక్కిచెప్పారు. స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజాపాలన సాగుతున్నదన్నారు. రానున్న రోజుల్లో అనేక రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా ఉంటుందని, విశ్వ వేదికపై మన రాష్ట్ర ఖ్యాతిని సగర్వంగా నిలిపే పాలనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం జరిపిన అమెరికా, దక్షిణ కొరియా పర్యటన విజయవంతమైందని పేర్కొన్న సీఎం రేవంత్... 19 అగ్రశ్రేణి కంపెనీలతో చర్చలు జరిపి పెట్టుబడులపై అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నామని, రాష్ట్ర,లో ఆ కంపెనీల కొత్త యూనిట్ల ద్వారా 30 వేల మందికి పైగా ప్రత్యక్ష్య ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు.
నిరుద్యోగులకు పెద్దన్నగా :
గడచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులు, యువత చాలా నష్టపోయారని పేర్కొన్న సీఎం రేవంత్... చెప్పుడు మాటలు విని భవిష్యత్తును చెడగొట్టుకోవద్దని పిలుపునిచ్చారు. ‘ఎవరి ఉద్యోగాల కోసమో మీ జీవితాలను బలి చేసుకోవద్దు... పెద్దన్నగా మీకు నేను అండగా ఉంటా...’ అని వ్యాఖ్యానించారు. నిరుద్యోగులకు ఏ సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తేవాలని, వాటిని పరిష్కరించడమే ప్రభుత్వ బాధ్యత అని భరోసా ఇచ్చారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 నియామకాలకు గత ప్రభుత్వ నిర్ణయాలతో ఏర్పడిన లీగల్ చిక్కుముళ్లను కోర్టుల ద్వారా పరిష్కరించుకున్నామని గుర్తుచేశారు. ఇటీవలే శాసనసభలో జాబ్ క్యాలెండర్‌ను ప్రవేశ పెట్టామని, దాని ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతి ఏటా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయబోతున్నామని వివరించారు. సింగరేణి సంస్థ సహకారంతో ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం’ కింద సివిల్స్ లో ప్రాథమిక పరీక్షను విజయవంతంగా పూర్తిచేసి అర్హులైన తెలంగాణ యువతకు లక్ష రూపాయల వంతున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించామని తెలిపారు.
పారిశ్రామికవేత్తలుగా మహిళలు :
రాష్ట్రంలో 63 లక్షల మంది మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసిందని సీఎం పేర్కొన్నారు. స్వయం సహాయక మహిళా బృందాల సభ్యులకు స్కూల్ యూనిఫారాలు కుట్టే పనిని అప్పగించామని, హస్తకళాఖండాలను ఉత్పత్తిచేసిన తర్వాత వాటి విక్రయానికి మాదాపూర్‌లోని శిల్పారామంలో మహిళా బజార్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందిరా జీవిత బీమా పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలలోని దాదాపు 63.86 లక్షల మంది మహిళా సభ్యులకు జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. స్వయం సహాయక సంఘాలలోని సభ్యులకు 10 లక్షల ప్రమాద జీవిత బీమా స్కీమ్‌తో పాటు దురదృష్టవశాత్తూ మహిళా సంఘాల సభ్యులు మరణిస్తే వారి పేరున ఉన్న రెండు లక్షల రూపాయల రుణాన్ని మాఫీచేస్తున్నామన్నారు. స్త్రీనిధి ఏర్పాటుతో పాటు బ్యాంకులకు అనుసంధానం చేయడం ద్వారా మహిళలకు లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మహిళలకు ఆసక్తి ఉన్న రంగాలలో వృత్తినైపుణ్య శిక్షణ ఇప్పించి, బ్రాండింగ్, మార్కెటింగ్‌లలో మెలకువలు పెంపొందించే సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
విద్యారంగంపై స్పెషల్ ఫోకస్ :
పాఠశాలలు తెరిచిన రోజునే పిల్లలందరికీ యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు అందజేశామని గుర్తుచేసిన సీఎం రేవంత్.. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. టాటా సంస్థల సహకారంతో రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్ ట్రెయినింగ్ సెంటర్లుగా మారుస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే ఆవరణలో పాతిక ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను నిర్మించబోతున్నామన్నారు. ఇటీవలే బేగరికంచె దగ్గర యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశామని, రాష్ట్ర విద్యా రంగంలో ఇదొక విప్లవాత్మక మలుపు అని అన్నారు. మన బిడ్టల కొలువులకు ఇది ఒక వేదికగా మారబోతున్నదని, సరికొత్త నైపుణ్యాలతో ఉపాధికి గ్యారంటీ ఉంటుందని, ఈ యూనివర్సిటీకి మహింద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా ఛైర్మన్‌గా ఉంటారని తెలిపారు.
వ్యవసాయానికి అగ్రతాంబూలం :
రైతు బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుందని ప్రస్తావించిన సీఎం రేవంత్... మూడు విడతల్లో రెండు లక్షల రుణమాఫీ స్కీమ్‌ను అమలు చేసి ఎన్నికల టైమ్‌లో ఇచ్చిన హామీని ఎనిమిది నెలల్లోనే సంపూర్ణం చేశామన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ నెల రోజుల్లోపే ఇంత పెద్దమొత్తంలో రుణమాఫీ కాలేదని గుర్తుచేశారు. అర్హులైన రైతులందరికీ రైతుభరోసా పథకం ద్వారా ఎకరానికి ఏటా రూ. 15 వేల చొప్పున అందించబోతున్నామని, మంత్రివర్గ ఉప సంఘం ఇప్పటికే జిల్లాల్లో పర్యటించి రైతుల అభిప్రాయాలను తీసుకున్నదని, త్వరలోనే విధివిధానాలను ఖరారు చేస్తుందన్నారురైతులపాలిట శాపంగా మారిన ధరణి సమస్యలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం... సరికొత్త సమగ్ర చట్టాన్ని ప్రభుత్వం తీసుకురాబోతున్నదన్నారు. ఈ సంవత్సరం నుంచి ఫసల్ బీమా యోజన పథకాన్ని కూడా అమలుచేసి రైతులకు నష్టపరిహారం అందిస్తామన్నరు. పండిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతన్నలు నష్టపోతున్నారని, సన్నరకం వరి ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తామన్నారు.
సకలజనుల సుఖశాంతుల కోసం :
రాష్ట్రంలోని అన్ని సెక్షన్ల ప్రజలకు సుఖశాంతులు అందించే దిశగా ప్రభుత్వం ఏకకాలంలో అటు అభివృద్ధిపైనా, ఇటు సంక్షేమంపైనా దృష్టి పెట్టిందని, గత ప్రభుత్వం అప్పులు మిగిల్చిపోయినా ప్రణాళికతో ఆర్థిక వ్యవస్థను చక్కిదిద్దుతున్నమని సీఎం అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండింటిని రెండు రోజుల్లోనే అమలు చేశామని, వాటి ఫలాలను ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద రూ. 10 వరకు కార్పొరేట్ వైద్యాన్ని పొందేతీరులో అనుభవిస్తున్నారని తెలిపారు. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ (గృహజ్యోతి), రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ (మహాలక్ష్మి) పథకాలు కూడా అమలవుతున్నాయన్నారు. ఇక గృహవసతి లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో 3500 చొప్పున మొత్తం నాలుగున్నర లక్షల ఇండ్లను నిర్మిస్తున్నామన్నారు. మరోవైపు పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నిధులిచ్చి వాటి ఫలాలను సాగునీటి రూపంలో రైతులకు అందిస్తున్నామని, సీతారామ ప్రాజెక్టు అందులో తొలి మెట్టు అని గుర్తుచేశారు.