BC Commission Chairman : బీసీ బహిరంగ విచారణకు కలెక్టర్లు రాకపోవడం ఆక్షేపణీయం

by Sridhar Babu |
BC Commission Chairman : బీసీ బహిరంగ విచారణకు కలెక్టర్లు రాకపోవడం ఆక్షేపణీయం
X

దిశ, సంగారెడ్డి : బీసీ కులాల రిజర్వేషన్లను తేల్చేందుకు నిర్వహిస్తున్న బహిరంగ విచారణ కార్యక్రమానికి కలెక్టర్లు రాకపోవడం విచారకరమని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ (BC Commission Chairman G. Niranjan)అన్నారు. సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ విచారణ కార్యక్రమానికి మెదక్, సిద్దిపేట జిల్లా కలెక్టర్లు రాకపోవడంపై కమిషన్ చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ రిజర్వేషన్ల కార్యక్రమానికి ఎందుకు రాలేదో కారణం చెప్పాలన్న చైర్మన్ నిరంజన్. మెదక్, సిద్దిపేట కలెక్టర్ల తీరుపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానన్నారు.

బుధవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిరంజన్ మాట్లాడుతూ ప్రభుత్వం పెద్ద యజ్ఞంలా నిర్వహిస్తున్న కార్యక్రమంపై కలెక్టర్లకు పూర్తి అవగాహన ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న సమయంలో రాకపోవడం ఆక్షేపణీయన్నారు. మెదక్, సిద్దిపేట కలెక్టర్లు (Collectors of Medak and Siddipet)ఈ కార్యక్రమానికి రాకపోవడంపై ప్రభుత్వానికి లేఖ రాస్తా అని నిరంజన్ వెల్లడించారు. అదే విధంగా నవంబర్ 13వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగనున్న ఈ బహిరంగ విచారణ కార్యక్రమానికి ఆయా జిల్లాల కలెక్టర్లు రావాలని వారికి లేఖలు రాస్తానని తెలిపారు. ప్రజల ఆకాంక్షలు, డిమాండ్లు తెలిపేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్భయంగా కమిషన్ కు తమ విన్నపాలు ఇవ్వాలని సూచించారు. కొందరు తమను కులం పేరుతో పిలవడం నామోషీగా ఉందని పేరు మార్చాలని వినతిపత్రం అందజేశారన్నారు. కొందరు బీసీల నుంచి ఎస్సీలలో కలపాలనే డిమాండ్ చేశారని, వాటన్నింటిని కమిషన్ పరిశీలించి పూర్తి నివేదికను డిసెంబర్ 5వ తేదీన హైకోర్టుకు అందజేస్తుందన్నారు.

బీసీలకు చట్టసభల్లో అవకాశం రాకపోవడం దురదృష్టకరం..

బీసీలకు గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలుగా అవకాశం వస్తున్నా చట్టసభల్లో అవకాశం రాకపోవడం దురదృష్టకరమని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. భారతదేశ చరిత్రలో బీసీలకు చట్టసభల్లో అవకాశం దక్కడం లేదని, దేశం అబ్బురపడేలా బీసీ కులగణన చేసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. 40-41శాతం రిజర్వేషన్లు బీసీలకు రావాలంటే సమగ్ర కుటుంబ సర్వేలో వాస్తవ సమాచారం అందించాలని సూచించారు.

నవంబర్ 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించడం జరుగుతుందని, నేరుగా ఎన్యూమరేటర్లు ఇండ్ల వద్దకే వస్తారని, వారికి సయైన సమాచారం ఇచ్చి మా కులం జనాభా ఇంత ఉంది అని తేల్చాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు పర్యవేక్షించాలని సడన్ విజిట్ చేసి ఎక్కడా తప్పులు దొర్లకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, బీసీ సంక్షేమశాఖ అధికారి జగదీష్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed