‘ఐఏఎస్‌లు వెళ్లిపోతే ఏం చేయాలి..?’ ఆలోచనలో సర్కార్

by karthikeya |   ( Updated:2024-10-16 03:52:51.0  )
‘ఐఏఎస్‌లు వెళ్లిపోతే ఏం చేయాలి..?’ ఆలోచనలో సర్కార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌గా నిర్ణయిస్తూ డీవోపీటీ (డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ ట్రెయినింగ్) ఈ నెల 9న జారీ చేసిన ఉత్తర్వుల అమలుపై ‘క్యాట్’ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్) ఊరట ఇవ్వకపోవడంతో తెలంగాణకు చెందిన నలుగురు ఐఏఎస్ అధికారులు హైకోర్టులో బుధవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ‘క్యాట్’ ఇచ్చిన తాజా ఉత్తర్వులనూ ప్రస్తావించనున్నారు. వీరి పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరిస్తుందా? ఆశించినట్లు రిలీఫ్ లభిస్తుందా? లభించకుంటే వీరి ముందు ఉన్న ప్రత్యామ్నాయాలేంటి? తప్పనిసరిగా ఏపీకి వెళ్లి రిపోర్టు చేయాల్సిందేనా? తెలంగాణ ప్రభుత్వం వీరిని రిలీవ్ చేస్తుందా? ఇలాంటి చర్చలు సచివాలయ వర్గాల్లో మొదలయ్యాయి. హైకోర్టు స్పందనకు అనుగుణంగా తదుపరి చర్యలపై ఫోకస్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఆశించిన స్థాయిలో ఊరట లభించని పక్షంలో వీరిని ప్రస్తుతానికి రిలీవ్ చేయక తప్పదనే అభిప్రాయాన్ని సీనియర్ అధికారులు వ్యక్తం చేశారు.

ఇక్కడే కొనసాగేలా సర్కార్ ప్రయత్నాలు

హైకోర్టు నుంచి వెలువడే ఉత్తర్వులకు అనుగుణంగానే వీరికి రిలీవింగ్ ఆర్డర్లు ఇవ్వడం, వారు ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతలను అదే డిపార్టుమెంటులోని తదుపరి ర్యాంక్‌లో ఉన్న ఆఫీసర్లకు పూర్తి అదనపు బాధ్యతల (ఫుల్ అడిషనల్ చార్జెస్-ఎఫ్ఏసీ) పేరుతో అప్పగించడంపై చీఫ్ సెక్రెటరీ నిర్ణయం తీసుకోనున్నారు. రోనాల్డ్ రోస్, కాటా ఆమ్రపాలి, వాకాటి కరుణ సర్వీసులను వినియోగించుకోవాలనే తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నదని, ఈ ముగ్గురినీ ఏదో ఒక మార్గంలో ఇక్కడే కొనసాగేలా చూసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఒకవేళ హైకోర్టులో ప్రతికూల పరిస్థితులే ఎదురైతే ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్ పద్ధతిలో వీరిని తెలంగాణలోనే కొనసాగించుకునే ప్రయత్నాలు ఇప్పటికే మొదలు పెట్టినట్లు తెలిసింది. రెండు ప్రభుత్వాల మధ్య పరస్పర అంగీకారం కుదిరితే వేర్వేరుగా ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్)లను డీవోపీటీకి సమర్పిస్తే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందన్నది ఆ సీనియర్ అధికారుల అభిప్రాయం.

హైకోర్టు ఉత్తర్వుల తర్వాతే తదుపరి కార్యాచరణ

అయితే.. డీవోపీటీ నిబంధనల ప్రకారం ప్రస్తుతం వారి డిజిగ్నేషన్, పే మాట్రిక్స్, గతంలో సెంట్రల్ సర్వీసులో పనిచేసిన హిస్టరీ.. ఇవన్నీ పరిగణనలోకి వస్తాయని, రెండు రాష్ట్రాలు రాతపూర్వకంగా సమ్మతి వ్యక్తం చేసినా కేంద్ర స్థాయిలో ఏ మేరకు ఈ ముగ్గురు అధికారులకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుందనే చర్చ కూడా జరుగుతున్నది. డీవోపీటీ తనంతట తానుగా ఇంటర్ స్టేట్ కేడర్ డిప్యూటేషన్‌పై నిర్ణయం తీసుకోవడం వీలు పడదని, ప్రధాని అధ్యక్షతన జరిగే కేబినెట్ కమిటీ ఆన్ అపాయింట్‌మెంట్స్ కమిటీలో చర్చల తర్వాత జరిగే నిర్ణయమని ఓ సీనియర్ అధికారి వివరించారు. మూకుమ్మడిగా ముగ్గురు అధికారులకు ఒకే నిబంధన వర్తించదని, ఒక్కో ఇండివిడ్యువల్ సర్వీస్ రికార్డు, గతంలో వారు డిప్యూటేషన్ పద్ధతిలో పనిచేసిన కాలం, వారి గ్రేడ్, హోదా తదితరాలన్నింటినీ వేర్వేరుగానే పరిశీలించి తీసుకోవాల్సిన నిర్ణయమని అభిప్రాయపడ్డారు. హైకోర్టు నుంచి వెలువడే ఉత్తర్వుల తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టాలని భావిస్తున్నది.

ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫారసు.. డీవోపీటీ నిర్ణయం

ముగ్గురు అధికారుల (ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్, వాకాటి కరుణ) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉన్నదని, వచ్చే నెలలో రిటైర్ కానున్న మల్లెల ప్రశాంతి, సీనియారిటీ కారణంగా వాణీ ప్రసాద్ (1995 బ్యాచ్) విషయంలో ప్రయత్నాలు ఫలించకపోవచ్చనే అభిప్రాయాలు సచివాలయ వర్గాల్లో వెల్లడవుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు సందర్భంగా ఉమ్మడి రాష్ట్రానికి అలాట్ అయిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ కొన్ని రూపాల్లో సరళమైన నిర్ణయాలను సిఫారసుల రూపంలో డీవోపీటీకి వ్యక్తం చేసింది. అంతకుముందు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా అక్కడ కమిటీల టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సులో భాగంగా రూపొందించిన నిబంధనలను, లిబరల్ విధానాల మేరకు ఈ అభిప్రాయానికి వచ్చింది. దానికి ముందు బిహార్ రాష్ట్రంలోనూ ఇదే తరహా లిబరల్ విధానాలను అమలు చేసినట్లు ఓ సీనియర్ అధికారి గుర్తుచేశారు.

హైకోర్టు తీర్పుపై ఐఏఎస్‌లలో ఉత్కంఠ

ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు అప్పటి పరిస్థితుల్లో పిల్లల చదువులను దృష్టిలో పెట్టుకుని డిస్టర్బ్ కాకుండా, తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలను కూడా పరిగణనలోకి తీసుకుని లిబరల్‌గా వ్యవహరించాలని ప్రత్యూష్ సిన్హా కమిటీ చేసిన సూచనలను దృష్టిలో పెట్టుకుని ఇంటర్ స్టేట్ కేడర్ డిప్యూటేషన్ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకునే ధోరణిలో ఏకాభిప్రాయానికి, అంగీకారానికి రావచ్చన్నది ఆ అధికారి భావన. ఐదుగురు ఐఏఎస్ (ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణీప్రసాద్, ఏపీకి చెందిన గుమ్మల్ల సృజన) దాఖలు చేసే లంచ్ మోషన్ పిటిషన్లపై హైకోర్టు వెలువరించే ఉత్తర్వుల ఆధారంగా వీరు నిర్వహిస్తున్న బాధ్యతలను వేరే అధికారులకు ఎఫ్ఏసీ రూపంలో అప్పగించడంపైనా, వీరిని రిలీవ్ చేయడంపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. ఎలాంటి ఉత్తర్వులు వెలువడతాయనేదే ఆ నలుగురు తెలంగాణ ఐఏఎస్ అధికారుల్లో ఉత్కంఠగా మారింది. దీనికి తోడు తదుపరి ఉత్తర్వుల జారీపై చీఫ్ సెక్రెటరీ కూడా ఫోకస్ పెట్టారు. డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం తెలంగాణకు చెందిన ఐదుగురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ (అంజనీకుమార్, అభిలాష భిష్ట్, అభిషేక్ మొహంతి) అధికారులు ఏపీలో బుధవారం సాయంత్రంలోగా రిపోర్టు చేసి జాయిన్ కావడం తప్పనిసరి అయితే ఈ-మెయిల్ ద్వారా కూడా ఆ పని చేయవచ్చని సీనియర్ అధికారి పేర్కొన్నారు. కచ్చితంగా అక్కడకు ఫిజికల్‌గా వెళ్ళి రిపోర్టు చేయాల్సిన అవసరం లేదని, కరోనా తర్వాతి పరిస్థితుల్లో ఈ ఫెసిలిటీ ఉనికిలోకి వచ్చిందని గుర్తుచేశారు.

Advertisement

Next Story

Most Viewed