ఫలించిన పోలీస్​‘వ్యూహాం’.. ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ ఎలక్షన్స్..!

by Satheesh |   ( Updated:2023-11-30 15:45:03.0  )
ఫలించిన పోలీస్​‘వ్యూహాం’.. ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ ఎలక్షన్స్..!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పోలీస్​ వ్యూహం ఫలించింది. చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్​ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. కొన్నిచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగినా పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తీసుకు రాగలిగారు. మావోయిస్టు ప్రభావిత అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అయితే, ముందు జాగ్రత్తగా అధికారులు ఈ అసెంబ్లీ స్థానాల్లో గంట ముందుగానే పోలింగ్​ను ముగించారు.

ఈసారి అసెంబ్లీ ఎన్నికల పోరు ప్రధాన రాజకీయ పక్షాల మధ్య హోరాహోరీగా జరిగిన విషయం తెలిసిందే. హ్యాట్రిక్​ సాధించటానికి బీఆర్ఎస్, విజయం దక్కించుకోవటానికి కాంగ్రెస్, బీజేపీలు సర్వశక్తులు ఒడ్డాయి. ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం ప్రచారాన్ని హోరెత్తించారు. పోలింగ్​కు రెండు రోజుల ముందు నుంచి కట్టలకు కట్టలు నగదుతోపాటు పెద్ద ఎత్తున మద్యం పంపిణీ చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసు శాఖ పోలింగ్​సందర్భంగా శాంతిభద్రతల పరిస్థితికి విఘాతం కలగకుండా విస్తృతస్థాయిలో భద్రతా చర్యలు చేపట్టారు.

45వేల మంది రాష్ర్ట పోలీసులతోపాటు అంతే సంఖ్యలో కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. దాంతోపాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, కర్ణాటకల నుంచి మరో 20వేల మందికి పైగా హోంగార్డులను రప్పించుకుని వారిని కూడా ఎన్నికల విధుల్లో నియమించారు. క్రిటికల్​అని గుర్తించిన పన్నెండు వేల పోలింగ్​స్టేషన్ల వద్ద రెండంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక, మావోయిస్టు ప్రభావం ఉన్న ఆరు వందల పధ్నాలుగు పోలింగ్​స్టేషన్ల వద్ద అయిదంచెల బందోబస్తు పెట్టారు. అన్ని పోలింగ్​స్టేషన్ల వద్ద వంద మీటర్ల వ్యాసార్థంలో 144 సెక్షన్​విధించారు.

పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినా పోలింగ్​రోజున రాష్ర్టవ్యాప్తంగా పలు చోట్ల ఆయా పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ప్రధానంగా జనగామ, ఇబ్రహీంపట్నం, బోదన్, తాండూరు మండలం కరణ్​కోట్, అమ్రాబాద్​మండలం మన్ననూర్, సూర్యాపేట సెగ్మెంట్​లోని మఠంపల్లి, ఎల్లారెడ్డిగూడ, ఖమ్మం జిల్లా కొత్త మేడిపల్లి, హైదరాబాద్​లోని మణికొండ తదితర ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్...కొన్నిచోట్ల బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.

ఇక, కొడంగల్​లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి తమ్ముడు ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటూ వెంటనే ఆయనను అక్కడి నుంచి పంపించి వేయాలంటూ బీఆర్ఎస్​నాయకులు, కార్యకర్తలు ఆందోళన జరిపారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, బందోబస్తులో ఉన్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆయా చోట్ల పరిస్థితులు అదుపు తప్పకుండా చూడగలిగారు. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో గొడవలు పడుతున్న ఆయా పార్టీల కార్యకర్తలను తరిమి కొట్టటానికి లాఠీఛార్జీలు జరిపారు.

ఆ ప్రాంతాల్లో..

ఇక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించిన పోలీసు అధికారులు ఆయా చోట్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడగలిగారు. ఎన్నికలకు ముందే 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మావోయిస్టుల ప్రభావం ఉందని గుర్తించిన అధికారులు ఆయా సెగ్మెంట్లలో పది వేల మందికి పైగా కేంద్ర బలగాలను మోహరించారు. ఈ బలగాలు పోలింగ్‌కు రెండు రోజుల ముందే ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్​స్టేషన్లను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇక, ఆయా పోలింగ్​స్టేషన్ల వద్ద అయిదంచెల భద్రతా ఏర్పాట్లు చేసిన ఉన్నతాధికారులు ముమ్మరంగా కూంబింగ్​జరిపించారు. బయటి నుంచి ఎవరైనా వచ్చారా? అన్న దానిపై నిఘా వర్గాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించారు.

అయినా, మావోయిస్టులు చర్ల మండలంలోని హోసుగుప్ప ప్రాంతంలో ఓ లారీని దగ్ధం చేయటంతో అలర్ట్​అయిన పోలీసు ఉన్నతాధికారులు భద్రతను మరింత పటిష్టం చేశారు. పోలింగ్​రోజున ముమ్మరంగా తనిఖీలు జరిపారు. ఈ క్రమంలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు చర్ల మండలం అంజనీపురం దారిలో ఏర్పాటు చేసిన ఐఈడీ బాంబును గుర్తించి దానిని నిర్వీర్యం చేశారు. ఛత్తీస్​ఘడ్​రాష్ర్ట సరిహద్దుల్లో నిఘా కోసం డ్రోన్​కెమెరాలను సైతం వినియోగించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తీసుకున్న ఈ చర్యలు ఫలితాలనిచ్చాయి.

13 అసెంబ్లీ సెగ్మెంట్లలో చిన్నపాటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు చూడగలిగారు. ఇక, ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ను కూడా ఓ గంట ముందే నిలిపి వేశారు. ఆ వెంటనే ఈవీఎంలను భారీ భద్రత మధ్య స్ర్టాంగ్​రూంకు తరలించారు. రాష్ర్ట డీజీపీ అంజనీకుమార్​మాట్లాడుతూ చిన్న చిన్న సంఘటనలు మినహా పోలింగ్​ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించిన సిబ్బందికి, వారికి మార్గదర్శకత్వం చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు.

Read More..

TS Election: ఓటు వేయని వారికి ఆ శిక్ష విధించండి.. ఈసీకి రిక్వెస్ట్

Advertisement

Next Story

Most Viewed