ఫోర్త్​సిటీ పేరుతో అక్రమాలు.. ఆ భూములపైనే కన్ను

by Gantepaka Srikanth |
ఫోర్త్​సిటీ పేరుతో అక్రమాలు.. ఆ భూములపైనే కన్ను
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ప్రభుత్వ, ప్రైవేట్​భూమి అనే తేడా లేకుండా కబ్జాలో ఎవరు లేకపోతే కాగితాలు సృష్టించాల్సిందే. అంతేకాకుండా ఈ కేవైసీ పెండింగ్‌లో ఉంటే కబ్జాలో ఉన్నవాళ్లు ఎవరు..? ధరణి పోర్టల్‌లో ఎవరి పేరు ఉందనే వివరాలు తెలుసుకొని నకిలీ ధ్రువీకరణ పత్రాలను రూపొందించి ధరణిలో ఈకేవైసీ పెండింగ్​ క్లియర్​చేసుకుంటారు. ఆ తర్వాత ఆ భూమిలో కబ్జాలోనున్న వారికి ఎంతో కొంత కట్టబెట్టి క్రయ విక్రయాలు చేపడుతున్నారు. ఈ భూ దందా మహేశ్వరం నియోజకవర్గంలో అధికంగా కొనసాగుతున్నది. ఫోర్త్​సిటీ పేరుతో ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.

రంగారెడ్డి జిల్లాలో రికార్డుల్లో నమోదు కాని భూమి అధికంగానే ఉంది. గతంలో భూములపై పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియదు. కానీ ప్రస్తుతం భూ విలువ పెరిగిపోవడంతో ప్రతి భూ విషయంపై స్థానికులు చర్చించుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం, అసైన్డ్​, భూధాన్, వక్ఫ్​బోర్డు లాంటి భూములను సైతం కొనుగోలు చేయడం, పట్టా భూమిగా మల్చుకోవడం జరుగుతుంది. భూ సర్వే చేసినప్పుడు మిగులు భూమి ఉంటే స్థానికంగా ఉండే కొందరు నేతలు, రాజకీయ నాయకుల అండదండలతో భూములను స్వాధీనం చేసుకోవడం ఆలవాటుగా మారిపోయింది. అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే పాపాన పోవడం లేదు. ప్రభుత్వ భూములను కాపాడాల్సి అధికారులే క్రయ విక్రయాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది.

247 సర్వే నంబర్‌లో ఏమి జరుగుతుంది..?

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్​ 247లో ప్రభుత్వ, పట్టా భూమి వందల ఎకరాల్లో ఉంది. అయితే ఈ భూముల్లో 247లు, 247రూ వంటి సర్వే నంబర్‌ల్లో కబ్జాల్లో ఒకరు వ్యవసాయం చేసుకుంటే, మరొకరిపై రిజిస్ట్రేషన్​ఉన్నాయి. ఇలాంటి భూములపై రియల్​ వ్యాపారులు కన్నేశారు. ఈ కేవైసీ అప్​డేట్​ కాకపోవడంతో తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించి క్రయ విక్రయాలు చేపడుతున్నారు. ఇప్పటికి ఇలాంటి భూములు వందల్లో జరిగినట్లు సమాచారం. భూమని సాగు చేసుకుంటున్న రైతులకు ఎలాంటి పట్టా పేపర్లు లేకపోవడంతో నయానో బయానో చెప్పి కబ్జాను కైవసం చేసుకోవడం, స్థానిక ప్రజలకు ఎలాంటి సంబంధం లేని భూములపై తప్పుడు పత్రాలతో పట్టాదారుడిగా చేసి క్రయ విక్రయాలు చేపతున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో విచ్చలవిడిగా భూ దందా నడుస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో ఓ వ్యక్తి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి భూ క్రయ విక్రయాలు చేపట్టారు. అలాంటి వ్యక్తులపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. అయితే ఓ ప్రభుత్వ టీచర్, అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి కలిసి విక్రయించినట్లు సమాచారం. ప్రస్తుతం వాళ్లు ఇతర దేశాల్లో ఎంజాయ్​ చేస్తున్నట్లు తెలుస్తోంది.

గుడ్డిగా రిజిస్ట్రేషన్లు చేస్తున్న అధికారులు..

రాజకీయ పలుకుబడి ఉంటే చాలా ఆ భూమి ఏలాంటిది, ఎవరిది అనే సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. 247 సర్వే నంబర్‌లో మిగులు భూమిని తప్పుడు ధ్రువపత్రాలతో సక్సెస్​ చేసుకొని రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు ప్రచారం సాగుతున్నది. ఈ సర్వే నంబర్‌పై గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నెల రోజుల క్రితం ఇష్టానుసారంగా ఈ సర్వే నంబర్‌లో జరిగిన క్రయ విక్రయాలు నకిలీ పత్రాల సహాయంతో జరిగినట్లు ప్రచారం సాగుతున్నది. ఈ వ్యవహారం బయటికి పొక్కకుండా గుట్టు చప్పుడు కాకుండా స్థానిక రైతులకు సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ సర్వే నంబర్‌లో జరిగిన క్రయ విక్రయాలపై విచారణ చేపట్టి తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్లకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్​ చేస్తున్నారు.

కోట్ల విలువైన భూమి లక్షల్లో విక్రయం..

హైదరాబాద్​–శ్రీశైలం ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఈ భూమి కోట్లల్లో విలువ ఉంది. కానీ లక్షల్లో విక్రయాలు జరిపి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఎకరాకు సుమారు రూ.10 కోట్ల విలువ ఉంటే కేవలం రూ.80 లక్షలకే విక్రయించడంపై పలు అనుమానాలకు తావునిస్తున్నది. కబ్జాల్లో ఎవరూ లేని భూములను టార్గెట్ చేసుకొని విక్రయిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ భూమిని విక్రయించేందుకు మధ్యవర్తులుగా ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed