ఫోన్ ట్యాపింగ్ కేసులో వారిద్దరికి రెడ్ కార్నర్ నోటీసులు

by Y. Venkata Narasimha Reddy |
ఫోన్ ట్యాపింగ్ కేసులో వారిద్దరికి రెడ్ కార్నర్ నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ1 ప్రభాకర్ రావు, ఏ6 శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీకి హైదరాబాద్ పోలీసులు చేసిన విజ్ఞప్తిని సీబీఐ అనుమతించింది. విదేశాల్లో ఉన్న వారిద్దరికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్ పోల్‌కు సీబీఐ లేఖ రాసింది. ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్‌‌రావులకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు తెలంగాణ పోలీసులు గుర్తించారు. కాగా ఇప్పటికే ప్రభాకర్ రావుపై కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ప్రభాకర్ రావుని హాజరుపరచాలని ఇప్పటికే నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మొదట లుక్ ఔట్ నోటీసులతో పాటు బ్లూ కార్నర్ నోటీసులను అప్పట్లో సీఐడీ పోలీసులు జారీ చేశారు. అనంతరం ఇద్దరికీ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు.

ట్యాపింగ్ కేసు విచారిస్తున్న సిట్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను ఇండియా రప్పించేందుకు సీఐడీ సహాయంతో సీబీఐని సంప్రదించింది. త్వరలోనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులని హైదరాబాద్‌కు రప్పించే ప్రయత్నం చేస్తున్నామని సిట్ అధికారులు చెప్పడం గమనార్హం. ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులను విచారిస్తే ట్యాపింగ్‌ విషయంలో మరిన్ని అంశాలు బయటపడే అవకాశం ఉంది. ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు ఇద్దరు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు వారిద్దరు దర్యాప్తు అధికారులకు ఇదివరకే సమాచారమిచ్చారు. గత నెల 26న తాను హైదరాబాద్‌కు వస్తానంటూ ప్రభాకర్‌రావు తొలుత న్యాయస్థానానికి సైతం వెల్లడించారు. అయితే క్యాన్సర్ చికిత్స కారణంగా రాలేకపోతున్నానంటూ ఇటీవలే మరోమారు సమాచారమిచ్చారు. న్యాయస్థానం అంగీకరిస్తే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని అభ్యర్థించారు. అయితే న్యాయస్థానం నుంచి అందుకు అనుమతి లభించలేదు.

ఈ కేసులో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులను విచారించాల్సిన అవసరాన్ని వివరిస్తూ సీఐడీ ద్వారా సీబీఐకి పోలీసులు అభ్యర్ధనను పంపించారు. ఈనేపథ్యంలో రెడ్‌ కార్నర్‌ నోటీస్ గనక జారీ అయితే వారిద్దరిని అమెరికాలోనే ప్రొవిజనల్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దర్యాప్తు అధికారుల అభ్యర్ధనను అమెరికా పోలీసులు పరిగణనలోకి తీసుకుంటే తొలుత వారిద్దరిని ప్రొవిజనల్ అరెస్ట్ చేసిన అనంతరం అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచి ఆ తరువాత భారత్‌కు పంపవచ్చని తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మార్చి 10వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురిని నిందితులుగా గుర్తించారు. ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌ రావును అరెస్ట్ చేశారు. అరెస్టయిన నలుగురు కూడా ప్రభాకర్‌రావు ఆదేశాలతో పాటు శ్రవణ్‌రావు సూచనలతో తాము ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు దర్యాప్తు అధికారులకు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed