West Bengal post-poll violence cases: న్యాయవ్యవస్థపై దుష్ప్రచారమా?.. సీబీఐపై సుప్రీంకోర్టు పైర్

by Shamantha N |
West Bengal post-poll violence cases: న్యాయవ్యవస్థపై దుష్ప్రచారమా?.. సీబీఐపై సుప్రీంకోర్టు పైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమబెంగాల్ లో ఎన్నికల తర్వాత చెలరేగిన హింసపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల తర్వాత చెలరేగిన హింసకు సంబంధించిన 45 కేసులను బెంగాల్ నుంచి మరోరాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ సీబీఐ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఈ పిటిషన్ ని స్వీకరించేందుకు నిరాకరించిన ధర్మాసనం..సీబీఐని హెచ్చరించింది. సీబీఐని తప్పుపడుతూ.. ఘాటు వ్యాఖ్యలు చేసింది. "సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీ పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం న్యాయవ్యవస్థపై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరం" అని పేర్కొంది. “ పశ్చిమ బెంగాల్‌లోని అన్ని కోర్టులతో శత్రుత్వం ఉందని అభివర్ణిస్తున్నారు. జిల్లా న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులు తమని తాము రక్షించుకోలేరంటున్నారు. విచారణలు సక్రమంగా జరగడం లేదని అంటున్నారా?” అని కోర్టు పేర్కొంది. ఈ పిటిషన్ ధిక్కార నోటీసుకి తగిన కేసని.. న్యాయవాదికి సమన్లు జారీ చేస్తామని సుప్రీం ధర్మాసనం బెదిరించింది.

సీబీఐపై ఫైర్

కలకత్తా హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల తర్వాత హింస కేసుల దర్యాప్తును చేపట్టిన సీబీఐ.. విచారణలను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ గతేడాది సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 45 కేసులను బదిలీ చేయాలన్న సీబీఐ అభ్యర్థనపై సుప్రీం ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసులను వేరే రాష్ట్రానికి తరలిస్తే బాధితుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. అలానే న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. మరోవైపు సీబీఐ తరపున వాదిస్తున్న అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు.. సీబీఐకి కోర్టులపై ఆక్షేపణలు చేసే ఉద్దేశం లేదని సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే, పిటిషన్‌లో ఆరోపణలు స్పష్టంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లోని కోర్టులపై ఇలాంటి దుష్ప్రచారం చేసినందుకు సీబీఐ అధికారులు క్షమాపణలు చెప్పాలంది. న్యాయవ్యవస్థపైన చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా లేవని ఏఎస్‌జీ రాజు చెప్పడంతో కోర్టు తీవ్ర చర్యలు తీసుకోలేదు. కొత్త పిటిషన్‌ను సమర్పించేందుకు సీబీఐకి అనుమతినిస్తూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

Advertisement

Next Story

Most Viewed