KTR : అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారు.. ఎక్స్‌లో కేటీఆర్

by Ramesh N |   ( Updated:2024-09-20 05:53:32.0  )
KTR : అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారు.. ఎక్స్‌లో కేటీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతు భరోసా, రుణమాఫీ పై ఎన్నికల వేళ బీరాలు పలికి ముఖ్యమంత్రి ఇప్పుడు నేల చూపులు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘ ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటకా బోడి మల్లన్న అన్నటుంది’ కాంగ్రెస్ పాలన అని ఫైర్ అయ్యారు. తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతన్నలను అయోమయానికి గురి చేస్తున్నాయన్నారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని కుండ బద్దలు కొట్టారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులను నమ్మించి తడి గుడ్డతో గొంతు కోసిందన్నారు.

మొన్న రుణమాఫీ పేరిట మోసం చేశారని, నిన్న వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టారని, నేడు కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా? అని ఆరోపించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పిందేంటి? చేస్తున్నదేంటి? హామీల్లో ఒక్కో వాగ్దానాన్ని సీఎం పాతరేస్తున్నారు? చేతకానప్పుడు హామీలు ఇవ్వడమెందుకు? అధికారంలోకి రాగానే మాటతప్పడమెందుకు? అని నిలదీశారు. తెలంగాణ రైతులు దేన్నైనా క్షమిస్తారు కానీ, నమ్మించి ద్రోహం చేస్తే ఎట్టిపరిస్థితుల్లో క్షమించరన్నారు. గద్దెనెక్కాక గొంతు కోసిన వారిని అస్సలు వదిలిపెట్టరన్నారు. ఈ వెన్నుపోటుకు ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదని ఎక్స్‌లో కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed