విచారణపై వెనకడుగు!

by Anjali |
విచారణపై వెనకడుగు!
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ప్రమాదాలు జరిగినప్పుడే చర్యలు తీసుకోవాలని ఆలోచన సంబంధిత అధికారులకు వస్తుంది. అయితే ప్రాథమిక స్థాయిలో ఆయా సంస్థలకు అనుమతులు జారీ చేసేటప్పుడు అధికారులు ఎందుకు బాధ్యతారహితంగా పనిచేస్తారనే ప్రశ్న ప్రతి ఒక్కరికి కలుగుతోంది. వేతనాలు సరిపోక అక్రమార్కులను ప్రోత్సహించి కాలం గడుపుతారనే ప్రచారం. అధికారులు చేసే తప్పిదాలతోనే అన్ని రంగాలల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. అప్పటి అవసరాల కోసం అధికారులు అవినీతికి మద్దతు పలుకుతారు. ఆ అక్రమ మార్గం ప్రమాదమనే విషయం కొన్నేండ్ల తర్వాత తెలుస్తోంది. ఇదే పద్ధతిలో విద్యాశాఖ అధికారులు వ్యవహారిస్తున్నారు. వాస్తవంగా అధికార పార్టీ నేతలు చేసే ఒత్తిడికి తలొగ్గి అధికారులు అక్రమాలకు మద్దతు పలుకుతారు. కానీ విద్యాశాఖ రంగాలల్లో అధికారుల తప్పిదాలకు బలయ్యేది విద్యార్థులే.

నిబంధనలు పాటించని అధికారులు

ఇప్పటికే నగరంలో, రంగారెడ్డి జిల్లా అర్బన్​ ప్రాంతంలో నడిపించే స్కూల్స్​తో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అడ్మిషన్లు తీసుకునే నాటికి పూర్తిస్ధాయిలో నిబంధనలకు అనుగుణంగా విద్యాశాఖాధికారులు అనుమతిని ఇవ్వాలి. లేకపోతే ప్రారంభ దశలో ఉంటే ఓపెనింగ్​ అనుమతి ఇచ్చినప్పడు స్కూల్​ గ్రౌండ్​, మున్సిపాలిటీ అనుమతి, ఫైర్​ సెప్టీ, మౌలిక వసతులు, తరగతి గదుల నిర్మాణం పూర్తి చేసిన తర్వాతే ఇవ్వాలి. ఇవేవీ పాటించకుండా విద్యాశాఖ అధికారులు, ఆర్‌జేడీ అధికారులు కలిసి కార్పొరేట్​ స్కూల్​ యాజమాన్యాలతో కుమ్మక్కై అనుమతులు ఇస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని హయత్​నగర్ మండలం పెద్ద అంబర్​పేట్​ మున్సిపాలిటీ పరిధిలోని సెయింట్​ జోసెఫ్​ పబ్లిక్ స్కూల్​ నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంధ సంస్థలు ఫిర్యాదు చేశాయి. అయినా విచారణ చేసేందుకు విద్యాశాఖాధికారులు జంకుతున్నారు. అంతేకాకుండా స్థానిక విద్యాశాఖాధికారితో ఈ స్కూల్స్‌పై వివరణ అడిగితే... నేను ఉన్నది ఉన్నట్టు ఉన్నతస్ధాయి అధికారులు రిపోర్ట్​ ఇచ్చాను.. కానీపై స్థాయిలో అంతా మ్యానేజ్​ చేశారనే సమాధానం ఇచ్చారు.

కాసులిస్తే పని ఖతం..

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​ మండలం పెద్ద​అంబర్​పేట్ ​మున్సిపాలిటీ పరిధిలోని కాల్వంచలో సెయింట్​ జోసెఫ్​ పబ్లిక్​ స్కూల్ నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారు. ఈ స్కూల్స్​కు అనుమతులు ఇవ్వడంలో జిల్లా విద్యాశాఖ, ఆర్జేడీలు తొందరపాటు వహించినట్లు స్పష్టమైతుంది. జీప్లస్​ బిల్లింగ్ 18.45 మీటర్ల ఎత్తులో ఉండే భవనానికి ప్రొవిజనల్​ ఫైర్​ఎన్‌వోసీతో జిల్లా విద్యాశాఖ పీపీ నుంచి 7వ తరగతి వరకు అనుమతినిచ్చింది. అదేవిధంగా 6 మీటర్ల ఎత్తుకు తక్కువ భవనం ఉందని ఫైర్​ ఎన్‌వోసీతో సంబంధం లేకుండానే 8వ తరగతికి ఆర్‌జేడీ అనుమతినిచ్చారు. అక్యూపెన్సీ ఫైర్​ ఎన్‌వోసీ లేకుండా జిల్లా విద్యాశాఖాధికారులు పీపీ నుంచి 7వ తరగతి వరకు 2022–2023లో, 2023–24కు ఆర్‌జేడీ అనుమతులిచ్చింది. ఈ అనుమతులపై చైల్డ్​ రైట్స్​ ఫోరం ఆధ్వర్యంలో 2022 మే 2022న జిల్లా విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేస్తే 20వ తేదీన సెయింట్​ జోసెఫ్​ పబ్లిక్​ స్కూల్ ను సీజ్​ చేశారు. కానీ అదే విద్యాశాఖ అధికారులు ఎలాంటి అక్యూపెన్సీ సర్టిఫికెట్​ లేకుండా వెనువెంటనే రీఓపెన్​ చేయడంపై అనుమానాలకు తావిస్తోంది.

భారీ దోపిడీ..

జీవో 1 1994కు విరుద్ధంగా స్కూల్​ నడిపించడమే కాకుండా విద్యార్థుల వద్ద భారీ స్ధాయిలో ఫీజులు వసూల్​ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పేదలకు సేవా చేస్తున్నాము. కార్పొరేట్​ స్థాయిలో విద్యానందించేందుకు తోడ్పాడుతున్నామని సెయింట్​ జోసెఫ్​ పబ్లిక్​ స్కూల్ యాజమాన్యం చెబుతున్నారు. కానీ అందుకు విరుద్ధంగా ఆ యాజమాన్యం స్కూల్ నడిపించడం గమనార్హం. ప్రతి విద్యార్థి వద్ద డొనేషన్​ పేరుతో రూ.61వేలు వసూల్​ చేసినట్లు ప్రచారం సాగుతుంది. అంతేకాకుండా ఈ స్కూల్‌లో 1072 మంది విద్యార్థుల దగ్గర నుంచి ఇప్పటి వరకు రూ.6.54కోట్లు వసూలు​ చేసినట్లు తెలుస్తోంది.

ముడుపుల మత్తులో జిల్లా విద్యాశాఖ

–మహ్మద్​ షబ్బీర్​అలీ, చైల్డ్ రైట్స్​ఫోరం​అధ్యక్షుడు

సెయింట్​ జోసెఫ్​ పబ్లిక్​ స్కూల్​కు గుడ్డిగా విద్యాశాఖ అధికారులు గుర్తింపునిచ్చారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులను జిల్లా విద్యాధికారులు బేఖాతరు చేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో గుర్తింపునిచ్చారు. ముడుపుల మత్తులో ఉండటంతోనే ఆ స్కూల్​కు గుర్తింపునిచ్చారు. విద్యార్థుల హక్కులను కాపాడాల్సిన విద్యాశాఖ అధికారులే భంగం కలిగించడం విడ్డూరం.

Advertisement

Next Story

Most Viewed